2020 Roun Up: ఏడాదిలో ఎన్ని మార్పులో.. అల్లర్ల నుంచి అభివృద్ధి వైపు అందాల కశ్మీరం..

భూమి మీద అందమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా జమ్మూ కశ్మీరే. భూతల స్వర్గంగా.. భారతావనికి తలమానికంగా..

2020 Roun Up: ఏడాదిలో ఎన్ని మార్పులో.. అల్లర్ల నుంచి అభివృద్ధి వైపు అందాల కశ్మీరం..
Jammu and Kashmir
Follow us

| Edited By: Balu

Updated on: Dec 31, 2020 | 8:44 PM

భూమి మీద అందమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా జమ్మూ కశ్మీరే. భూతల స్వర్గంగా.. భారతావనికి తలమానికంగా.. హిమాలయ పర్వత పంక్తులతో ప్రపంచంలోనే అతి సుందరమైన ప్రాంతంగా విరాజిల్లుతోంది జమ్మూ కశ్మీర్. ఆధ్యాత్మికతకు కొలువై.. ప్రకృతి సోయగాలకు నెలవై.. మరెన్నో జీవ నదుల పుట్టుకకు కారణభూతమైన హిమాలయ పర్వత శ్రేణులు అధికంగా జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇంతటి సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ఆ రాష్ట్రానికి భయానకమైన రెండో కోణం కూడా ఉంది.

రావణ కాష్టంలా రగలడమే తప్ప శాంతి అనే మాటకు చోటు లేని ప్రాంతానికి కేరాఫ్‌లా ఉండేది జమ్మూ కశ్మీర్. ఎప్పుడు తుపాకీ పేలుతుందో.. ఎటు నుంచి తూటా దూసుకువస్తోంది తెలియని పరిస్థితుల మధ్య అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడిపేవారు. అలాంటి సుందర కశ్మీరం ఇప్పుడు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటోంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించి ఆక్టికల్ 370, 36ఏ రద్దుతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ నవశకానికి నాంది పలుకుతోంది. కీలక ఆర్టికల్స్ రద్దు మొదలు.. మొన్నటికి మొన్న అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఏడాది కాలంగా అక్కడ ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవేంటో చూద్దాం పదండి..

అభివృద్ధివైపు పరుగులు పెడుతూ.. 2020 సంవత్సరం యావత్ ప్రపంచానికి పీడ కలను మిగిల్చినప్పటికీ.. జమ్మూ కశ్మీర్‌లో మాత్రం మార్పునకు శ్రీకారం చుట్టింది. అల్లర్లే తప్ప.. అభివృద్ధి ఎరుగని ఆ చోట నేడు పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. దేశ రక్షణ పరంగా జమ్మూ కశ్మీర్ కీలకమైన ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం అక్కడ మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసింది. రహదారుల సౌకర్యాల కల్పన, వంతెనల నిర్మాణం, పెద్ద సంఖ్యలో స్కూళ్లు, కాలేజీలు సహా మెడికల్ కాలేజీల ఏర్పాటుతో జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అంతేకాదు, హిమాయత్ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఉజ్జ్వల, కిసాన్ యోజన సహా 85 పథకాలను కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో అమల్లోకి తెచ్చింది. 2020 కేంద్ర బడ్జెట్‌లో ఒక్క జమ్మూ కశ్మీర్‌కే రూ.30,757 కోట్లు మంజూరు చేసింది. ఇక లద్దాక్ ప్రాంతానికి రూ.5,985 కోట్ల ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. బనిహాల్-ఖాజిగుండ్ టన్నెల్ నిర్మాణం చేపట్టింది. మరోవైపు ఇండియన్ రైల్వే కూడా కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తోంది. ఢిల్లీ-కాట్రా వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఎత్తైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇలా గత సంవత్సర కాలంగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

నెమ్మదిగా బయటపడుతూ… అయితే జమ్మూ కశ్మీర్‌‌లో మొత్తానికి మొత్తంగా శాంతి పరిఢవిల్లుతుందని కూడా చెప్పడం లేదు. ఎక్కడో ఒక చోటు చిన్న చిన్న నిరసనలు, ఘర్షణలు చోటు చేసకుంటునే ఉన్నాయి. అయితే, ఈ విషయంలో గతంతో పోలిస్తే పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. పాకిస్తాన్ జెండా ఎగిరిన స్థానంలో ఇప్పుడు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అలా జమ్మూ కశ్మీర్ మెల్లమెల్లగా శాంతి యుత పరిస్థితులకు అలవాటు పడుతోంది.

ఆంక్షలు.. నిర్బంధాలు.. పోలీసుల పహారాలు.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే 370, 36 ఏ ఆర్టికల్ రద్దు తరువాత ఆ రాష్ట్రంలో తీవ్రమైన ఘర్షణలు చేసుకున్నాయి. యావత్ జమ్మూ కశ్మీర్ ప్రజానికం రోడ్డెక్కి తమ నిరసన గళం వినిపించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనలు, నిరసనలు నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంది. దాదాపు నెలల తరబడి అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేసింది. అల్లర్లకు ప్రేరేపిస్తారే అనుమానం ఉన్న వారిని ఎక్కడికక్కడ నిర్బంధించింది. ఆ రాష్ట్రాంలోని కీలక పార్టీల నేతలను గృహనిర్బంధం చేసింది. అలా అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడే వరకు కఠిన చర్యలు తీసుకుంది. మొత్తంగా ఇప్పుడు పరిస్థితులు పూర్తి సానుకూలంగా మారడంతో విధించిన ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తోంది.

జమ్మూ కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ హవా.. అయితే అల్లర్లతో అట్టుడికే జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సద్దుమణగడంతో తాజాగా అక్కడ జిల్లా అభివృద్ధి మండళ్లకు ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలు ఎవరూ ఊహించని రీతిలో ప్రశాంతంగా జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 278 అభివృద్ధి మండళ్లకు ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, గుప్‌కార్ అలయెన్స్(నేషన్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్) పోటీ చేశాయి. రాష్ట్ర విభజన తరువాత అక్కడ జరిగిన తొలి ఎన్నికలు కావడంతో బీజేపీకి అక్కడ ఎదురు దెబ్బ ఖాయం అని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను, ఊహలను పటాపంచలు చేస్తూ జమ్మూ కశ్మీర్ లో అధిక సీట్లను గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 75 స్థానాలు గెలుచుకోగా, గుప్‌కార్ అలయెన్స్(ఎన్సీపీకి 67, పీడీపీకి 27), ఇండిపెండెంట్లు 50, కాంగ్రెస్ 26 స్థానాలు గెలుచుకున్నాయి. ఇలా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. జమ్మూలో తన పట్టును నిలుపుకోవడమే కాకుండా.. కశ్మీర్ లోయలోనూ మూడు స్థానాలు గెలుచుకుని బోణీ కొట్టింది. ఇక గుప్‌కార్ అలయెన్స్‌కు 3.94 లక్షల ఓట్లు రాగా, బీజేపీకి 4.87 లక్షల ఓట్లు రావడం విశేషం.

ఏది ఏమైనా.. 2020 ని జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సంవత్సరంగా పేర్కొనవచ్చు. అల్లర్ల నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న అందాల జమ్మూ కశ్మీరం.. మరింత అభివృద్ధి చెందాలని మనమూ కోరుకుందాం.