Borewell: 20 గంటలు శ్రమించి.. బోరుబావిలో పడ్డ చిన్నారిని కాపాడిన అధికారులు! వీడియో

|

Apr 04, 2024 | 3:38 PM

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల బాలుడిని రెస్క్యూ టీం సురక్షితంగా కాపాడారు. సుమారు 20 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించి బోరుబావి నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చిన్నారిని కాపాడారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో బుధవారం (ఏప్రిల్‌ 3) చోటు చేసుకోగా గురువారం (ఏప్రిల్‌ 4) మధ్యాహ్నం చిన్నారిని బోరు బావి నుంచి బయటికి..

Borewell: 20 గంటలు శ్రమించి.. బోరుబావిలో పడ్డ చిన్నారిని కాపాడిన అధికారులు! వీడియో
Borewell Rescue Operation
Follow us on

విజయపుర, ఏప్రిల్‌ 4: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల బాలుడిని రెస్క్యూ టీం సురక్షితంగా కాపాడారు. సుమారు 20 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించి బోరుబావి నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చిన్నారిని కాపాడారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో బుధవారం (ఏప్రిల్‌ 3) చోటు చేసుకోగా గురువారం (ఏప్రిల్‌ 4) మధ్యాహ్నం చిన్నారిని బోరు బావి నుంచి బయటికి తీసుకొచ్చారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకెళ్తే..

కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా లచయానా గ్రామానికి చెందిన సతీశ్‌ ముజగొండ అనే వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉన్న నాలుగు ఎకరాల పొలంలో బోరుబావి తవ్వించాడు. ఈ క్రమంలో సతీశ్‌ రెండేళ్ల కుమారుడు సాత్విక్‌ బుధవారం సాయంత్రం పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయాడు. దాదాపు 16 అడుగుల లోతున్న బోరు బావిలో చిన్నారి పడిపోవడం తల్లిదండ్రులు గమనించలేదు. చిన్నారి ఏడుపువిన్న స్థానికులు వెంటనే బాలుడి తల్లిదండ్రులకు, అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారుల సూచనల మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాయి. బాలుడు సుమారు 16 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ టీం గుర్తించింది. బోరు బావికి సమాంతరంగా 21 అడుగుల లోతు గొయ్యి తవ్వారు. అనంతరం ఎస్కవేటర్‌ సహాయంలో బాలుడిని బయటకు తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. వైద్య బృందం అంబులెన్స్‌లో ఆక్సిజన్‌తో సహా ఇంజెక్షన్‌లు ఇతర అత్యవసర ప్రథమ చికిత్స మందులతో సంఘటన స్థలానికి ముందుగా చేరుకున్నారు. చిన్నారిని రక్షించిన వెంటనే అంబులెన్స్‌లో ఇండీలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సాత్విక్‌ క్షేమంగా బయటపడాలని గ్రామస్తులంతా ప్రత్యేక పూజలు చేశారు. వారి పూజలు, ప్రార్థనలు ఫలించి బాలుడు క్షేమంగా ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.