Elephants Dead: పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ పిడుగులు పడుతున్నాయి. ఇక అసోం రాష్ట్రంలో 18 ఏనుగులు మరణించాయి. అయితే పిడుగుపాటు వల్ల మరణించి ఉంటాయని అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగాన్-కర్బి ఆంగ్లాంగ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో 18 ఏనుగులు మరణించి ఉండటాన్ని గురువారం గుర్తించినట్లు అసోం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) అమిత్ సాహే పేర్కొన్నారు. ప్రతిపాదిత కాతియాటోలి పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని కుండోలి ప్రాంతంలో ఏనుగులు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఒక చోట 14 ఏనుగులు, మరో చోట 4 ఏనుగుల మృతదేహాలను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఘటన స్థలానికి ఉన్నతాధికారులు చేరుకుని పరిశీలించారు. ఏనుగుల మృతిపై కారణాలేంటన్నది అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు 18 ఏనుగులు పిడుగుపాటుకు మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని అటవీ శాఖ మంత్రి పరిమల్ సుక్లబైద్యా తెలిపారు. పోస్టుమార్టం తర్వాత అసలు కారణాలు తెలుస్తాయని అన్నారు. తాను శుక్రవారం సంఘటన ప్రాంతాలను సందర్శిస్తామని ఆయన వెల్లడించారు.