మోకాలి ఆపరేషన్‌లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ ఫుడ్‌బాల్ క్రీడాకారిణి మృతి చెందిన ఘటన చెన్నైలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని చెన్నైకి చెందిన ప్రియ (17) కుడి మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఐతే ఆపరేషన్ తరువాత తలెత్తిన సమస్యలతో శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతిని ప్రియ మృతి చెందింది.
చెన్నైలోని కానికరపురానికి చెందిన ప్రియ (17) రాష్ట్ర ఫుట్‌బాల్ ప్లేయర్. ఐతే కొద్ది రోజుల కిందట మోకాలిలో నొప్పితో ఆసుపత్రికి వెళ్లింది. మోకాలి కీలు దగ్గర నరాలు దెబ్బతిన్నాయని, వాటిని ఆపరేషన్ చేసి సరి చేయాలని డాక్టర్లు చెప్పడంతో పెరియార్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. నవంబర్ 7న డాక్టర్లు ఆర్థోస్కోపి పద్ధతిలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం ప్రియ ఆరోగ్యం మరింత క్షీణించడంతో నవంబర్ 10న రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు బాధితురాలి కాలు కుళ్లి పోయిందని, వెంటనే దాన్ని తొలగించారు. కాలు తీసేని తరువాత ప్రియ ఆరోగ్యం మరింత దిగజారడంతో నవంబర్14న మరో ఆపరేషన్ చేశారు. కానీ ఆ మరుసటి రోజే (మంగళవారం) శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతినడంతో ప్రియ మృతి చెందింది.
మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే తమ కూతురు మరణించినట్లు కుటుంబ సభ్యులు నిరసనలకు దిగడంతో.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిరసనలు చెలరేగాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని విచారణకు ఆదేశించింది. విచారణలో పరేషన్ చేసిన ఇద్దరు వైద్యులు నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో వారిని లైఫ్‌లాంగ్ సస్పెండ్ చేశారు. ప్రియ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వాగ్థానం చేశారు.
ఆపరేషన్ టైంలో రక్తం ఎక్కువగా కారిపోకుండా ఉండేందుకు కాలికి గట్టిగా కట్టుకట్టి బ్యాండేజీ వేస్తారు. అది రక్తనాళాలను గట్టిగా అదిమి పట్టి రక్తప్రసరణను తగ్గిస్తుంది. ఆపరేషన్ తరువాత ఆ బ్యాండేజీని తీసేయాలి. ఐతే ప్రియ ఆపరేషన్ తర్వాత ఈ కట్టు వెంటనే తీసేయలేదు. దీంతో చాలా సేపటి నుంచి రక్తప్రసరణ లేకపోవడం వల్ల ఎక్కడైతే కట్టు కట్టారో అక్కడ చర్మం, కండరాలు చచ్చుబడి కుళ్లిపోయాయి. ఈ స్థితిని వాస్క్యులర్ అక్లూజన్ అంటారు. ఈ క్రమంలోనే ప్రియను రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి, కుళ్లిపోయినంత వరకు కాలిని తీసేశారు. ఐతే దెబ్బతిన కణాల నుంచి ‘మయోగ్లోబిన్’ అనే ప్రొటీన్ విడుదలయ్యి ప్రియ రక్తంలో కలవడంతో కిడ్నీలు, కాలేయం, గుండె దెబ్బతిని ప్రియ మరణానికి కారణం అయ్యింది. ఆపరేషన్ టైంలో కాలికి కట్టిన కట్టు సరైన సమయంలో తీయకపోవడం వల్లే ప్రియ మృతి చెందినట్లు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డీన్ తెరానీ రంజన్ వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.