World’s Most Polluted Cities: వామ్మో.. కాలుష్య కోరల్లోకి దేశంలోని నగరాలు.. టాప్ 20 సిటీల్లో 13 మన దగ్గరే..
ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2024 నివేదిక షాకిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయనే రిపోర్ట్ ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ.. దేశంలో కాలుష్య నగరాలుగా మారిన ఆ 13 సిటీస్ ఏంటి?... ఈ నివేదికలపై WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త, ఆరోగ్య మంత్రిత్వశాఖ సలహాదారు సౌమ్య స్వామినాథన్ ఏమన్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

మన దేశంలోని నగరాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దేశంలోని చిన్న నగరాలను సైతం కాలుష్య కోరల్లోకి నెట్టేస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు చేపడుతున్నప్పటికీ, దేశంలో పలు నగరాల్లో గాలి నాణ్యత పడిపోవడం ఆందోళనకరంగా మారింది.. మంగళవారం విడుదలైన 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 20 అత్యంత కాలుష్య నగరాల్లో పదమూడు భారతదేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది..
స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2024 నివేదిక సంచలనం సృష్టిస్తోంది. ఈ నివేదిక ప్రకారం అస్సాంలోని బైర్నీహాట్ నగరం తొలిస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్లన్‌పుర్, ఫరీదాబాద్, లోనీ, న్యూఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నోయిడా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ తొలి స్థానంలో కొనసాగుతున్నట్లు నివేదిక తెలిపింది. 2023లో ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోని మూడో అత్యంత కలుషిత వాతావరణ దేశంగా భారత్ నిలవగా.. ప్రస్తుతం విడుదలైన జాబితాలో ఐదో స్థానంలో ఉంది.
ఈ కాలుష్యం వల్ల ప్రజల ఆయుర్దాయం దాదాపు 5.2 సంవత్సరాలు తగ్గినట్లు నివేదికలు అంచనా వేశాయి. కాగా.. 2009 నుంచి 2019 వరకు భారత్‌లో ప్రతియేటా కాలుష్య సంబంధిత వ్యాధుల వల్ల దాదాపు 1.5 మిలియన్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు గతేడాది విడుదలైన లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనం పేర్కొంది.
ఈ నివేదికలపై WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త, ఆరోగ్య మంత్రిత్వశాఖ సలహాదారు సౌమ్య స్వామినాథన్ రియాక్ట్ అయ్యారు. కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొన్నిరకాల వాహనాలపై జరిమానాలు విధించడం.. పరిశ్రమలు, నిర్మాణసంస్థలు తగిన నిబంధనలు పాటించడం లాంటి చర్యలతో కాలుష్యాన్ని అరికట్టవచ్చని సౌమ్య స్వామినాథన్ వివరించారు.
ఆ ఏడు దేశాలే..
2024 సంవత్సరానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన కఠినమైన గాలి నాణ్యత ప్రమాణాలను కేవలం ఏడు దేశాలు మాత్రమే సాధించాయి.. స్విస్ వాయు నాణ్యత పర్యవేక్షణ సంస్థ ఐక్యూఎయిర్ సంకలనం చేసిన డేటా ప్రకారం.. ఈ దేశాలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బహామాస్, బార్బడోస్, గ్రెనడా, ఎస్టోనియా, ఐస్లాండ్ ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..