world no tobacco day 2021: కరోనా సెకండ్ వేవ్ నుంచి భారతదేశం ఇంకా కోలుకోలేదు. కానీ కేసులలో తగ్గుదల ఉంది. ఇంతలో WHO ( ప్రపంచ ఆరోగ్య సంస్థ) కరోనా కాలంలో పొగాకు తినేవారికి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని సూచిస్తోంది. మీరు దాని గురించి తెలుసుకోవాలి. ధూమపానం చేసేవారికి కొవిడ్ ప్రమాదం యాభై శాతం ఎక్కువగా ఉంటుందని WHO ప్రకటించింది. తీవ్రమైన అనారోగ్యంతో మరణాలు సంభవిస్తాయని హెచ్చిరించింది. అంతేకాదు క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వీటి నుంచి బయటపడాలంటే పొగాకు దూరంగా ఉండటమే ఉత్తమమైన పని అని సూచించింది.
WHO చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అడ్నోమ్ ఘెబియస్ ఇలా అన్నారు.. “WHO ప్రచారంలో చేరాలని పొగాకు రహిత వాతావరణాన్ని సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు” పొగాకును విడిచిపెట్టడానికి కష్టపడుతున్న వ్యక్తులకు మద్దతు ఇచ్చే విధంగా అన్ని రకాల ప్రచారాలను చేపడుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని 29 దేశాలపై ఫోకస్ ఉంది. 2021 చివరి వరకు కొనసాగుతుంది. ప్రతి దేశం పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటుంది. పొగాకును విడిచిపెట్టడానికి ప్రయత్నించేవారికి కొత్త డిజిటల్ సాధనాలను జారీ చేయడం, ప్రతి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, విధానాలను సవరించడం, జాతీయ టోల్ ఫ్రీ క్విట్‌లైన్‌లను ఏర్పాటు చేయడం ఇందులో ఉంటాయి.
వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, వెచాట్, వైబర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేయడం ప్రారంభించారు. డబ్ల్యూహెచ్‌ఓ క్వైట్ ఛాలెంజ్ ప్రజలు పొగాకును విడిచిపెట్టడానికి 6 నెలల వరకు ప్రచార చిట్కాల కోసం సాధారణ నోటిఫికేషన్‌లను అందిస్తుంది. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 40 శాతం మంది పురుషులు, 10 శాతం మహిళలు పొగాకును ఒక రూపంలో లేదా మరొక విధంగా వినియోగిస్తున్నారు. ఐరోపాలో అత్యధిక ధూమపానం రేటు 26 శాతానికి మించి ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవాన్ని ఈ ఏడాది మే 31 న జరుపుకుంటారు.