AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీస్ రూల్స్ మగవారి కోసమేనా..? మహిళల పీరియడ్స్ కష్టాలపై గళమెత్తిన నిపుణులు..

ఈ రోజుల్లో కూడా మన దేశంలో లక్షలాది మంది మహిళలు, అమ్మాయిలకు పీరియడ్స్ టైమ్‌లో ప్రశాంతంగా ఉండడం అనేది ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయింది. చాలా చోట్ల స్కూళ్లలో సరైన టాయిలెట్లు లేకపోవడం నుండి, ఆఫీసుల్లో నెలసరి నొప్పులను కనీసం గుర్తించకపోవడం వరకు.. మహిళలు నిత్యం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కీలక విషయాలపై మాట్లాడటానికి న్యూస్9 ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో డాక్టర్లు, చట్టపరమైన నిపుణులు మరియు ఎవరెస్ట్ వీరులు పాల్గొని మహిళల పీరియడ్స్ కష్టాలపై గళమెత్తారు.

ఆఫీస్ రూల్స్ మగవారి కోసమేనా..? మహిళల పీరియడ్స్ కష్టాలపై గళమెత్తిన నిపుణులు..
Why Indian Workplaces Still Fail Menstruating Women
Krishna S
|

Updated on: May 28, 2026 | 7:48 PM

Share

ప్రతి సంవత్సరం మే 28న జరుపుకునే ప్రపంచ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. నేటి ఆధునిక కాలంలో కూడా దేశంలోని లక్షలాది మంది మహిళలు, బాలికలకు పీరియడ్స్ సమయాన్ని సురక్షితంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపడం అనేది ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయింది. పాఠశాలల్లో సరైన టాయిలెట్లు లేకపోవడం నుండి పీరియడ్స్ నొప్పిని గుర్తించడానికి కూడా నిరాకరించే ఆఫీసుల వరకు.. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో సాధారణంగా మెయిన్ స్ట్రీమ్ పాలసీ చర్చల్లోకి రాని ఇలాంటి కీలకమైన సమస్యలను బహిరంగంగా చర్చించడానికి న్యూస్9 సంస్థ ది షీకానమీ అజెండా.. పీరియడ్ పవర్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో నిపుణులు పాల్గొని పీరియడ్స్ సమయంలో మహిళలు పడుతున్న ఇబ్బందులపై గళమెత్తారు.

పీరియడ్స్ అనేవి ఆఫీసుల్లో మహిళల పనితీరును ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయినప్పటికీ చాలా ఆఫీసుల్లో దీనికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక రూల్స్ లేవు. ఈ సమస్య కేవలం నెలసరి సమయంలో లీవ్స్ ఇవ్వడం గురించి మాత్రమే కాదు, ఆఫీసులలో శుభ్రమైన టాయిలెట్లు ఉండటం, శానిటరీ ప్యాడ్స్ పారేయడానికి డస్ట్‌బిన్లు పెట్టడం, అవసరమైనప్పుడు చిన్న బ్రేక్స్ తీసుకోవడం, పీరియడ్స్ గురించి మహిళలు ఓపెన్‌గా మాట్లాడినా వారిని తక్కువ చేసి చూడని వాతావరణం ఉండటం చాలా ముఖ్యం. మన దేశంలో ఆఫీస్ సంస్కృతి ఇప్పటికీ ఎక్కువగా మగవారికి అనుకూలంగానే సాగుతోందని, అందుకే మహిళా ఉద్యోగుల కోసం పీరియడ్స్ సెలవులు ఇచ్చేలా కంపెనీలు ఆలోచించాలని సామాజిక నిపుణులు నిర్జ భట్నాగర్ సూచించారు. అలాగే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ గీతా లుత్రా మాట్లాడుతూ.. మహిళలకు క్లీన్ టాయిలెట్స్ కల్పించడం ప్రాథమిక అవసరమని, ఆఫీసులు ఇతర సెలవులు ఇచ్చినట్లే పీరియడ్స్ సెలవులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నెలసరి చుట్టూ సమాజంలో ఉన్న ఒక రకమైన అపవాదు లేదా భయం గురించి వైద్య నిపుణులు డాక్టర్ సుర్వీన్ ఘుమాన్ మాట్లాడారు. ఆఫీసుల్లో అధికారికంగా పీరియడ్స్ లీవ్స్ ఇస్తే తప్ప, మహిళలు తమ సమస్యల గురించి బయటకు మాట్లాడటానికి ధైర్యం చేయలేరని ఆమె అన్నారు. పీరియడ్స్ అనేవి ఆడవారి జీవితంలో ఒక సహజమైన భాగమని అంగీకరించి, ఎలాంటి వివక్ష లేకుండా ఈ సమస్యను చూడాలని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో పేపర్ల మీద రూల్స్ వస్తున్నా.. అవి నిజ జీవితంలో సరిగ్గా అమలు కావడం లేదని నీతి ఆయోగ్ మాజీ డైరెక్టర్ ఊర్వశి ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల కోసం ఇలాంటి మంచి రూల్స్ తెస్తే.. ఎక్కడ వారు దాన్ని దుర్వినియోగం చేస్తారో అనే సంకుచిత ఆలోచన ఇంకా చాలా మందిలో ఉందని, ఈ విధానాలు సక్సెస్ కావాలంటే ముందుగా సమాజంలో మైండ్‌సెట్ మారాలని ఆమె అన్నారు. దీనికి తోడు నెలసరి ఆరోగ్యంపై ప్రజలందరిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని డాక్టర్ కిరణ్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడ్డారు.

ఈ చర్చా కార్యక్రమంలో అన్నిటికంటే ఎంతో స్ఫూర్తినిచ్చే నిజ జీవిత కథనాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సునీత సింగ్ చోకెన్ పంచుకున్నారు. తాను ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతున్న సమయంలోనే పీరియడ్స్ వచ్చాయని.. ఆ చలిలో తక్కువ ఆక్సిజన్ ఉన్న కొండలపై ఎన్నో రకాల శారీరక సవాళ్లను ఎదుర్కొన్నానని ఆమె గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ వాటన్నిటినీ తట్టుకుంటూ పట్టుదలతో ముందుకు సాగి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నానని చెప్పారు. మహిళలకు ఎలాంటి మద్దతు లేదా కనీస సౌకర్యాలు లేకపోయినా.. నెలసరి కష్టాలను భరిస్తూనే జీవితంలో అసాధారణమైన విజయాలను సాధిస్తున్నారని సునీత సింగ్ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇకనైనా ఆఫీసులు, ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు పక్కనపెట్టి, మహిళా ఉద్యోగుల పీరియడ్స్ కష్టాలను గుర్తించి ప్రాథమిక వసతులు, సెలవులు కల్పించడమే ఈ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం అసలైన లక్ష్యం.

Follow Us