AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోమలు కొందరినే ఎందుకు ఎక్కువ కుడతాయి? అసలు కారణం తెలిస్తే..

‘‘నా రక్తం చాలా తీపి.. అందుకే దోమలన్నీ నన్నే టార్గెట్ చేస్తున్నాయి’’ అని మీరు కూడా సరదాగా అంటూ ఉంటారా? అయితే మీరు పొరబడినట్లే.. ఇంట్లో నలుగురు ఉన్నా కొందరినే దోమలు ఎక్కువగా కుట్టడం వెనుక సైన్స్ దాగి ఉంది. మీ శరీర ఉష్ణోగ్రత నుంచి మీ బ్లడ్ గ్రూప్ వరకు దోమలను ఆకర్షించే ఆసక్తికర శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దోమలు కొందరినే ఎందుకు ఎక్కువ కుడతాయి? అసలు కారణం తెలిస్తే..
Why Mosquitoes Bite Some People More
Krishna S
|

Updated on: Aug 03, 2026 | 1:17 PM

Share

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. తేమతో కూడిన వాతావరణంలో దోమల బెడద తీవ్రమవుతుంది. డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధుల భయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఇంట్లో నలుగురు ఉంటే వారిలో ఒకరిద్దరినే దోమలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ‘‘నా రక్తం తీయగా ఉందేమో.. అందుకే నన్నే కుడుతున్నాయి’’ అని సరదాగా జోకులు వేసుకుంటుంటాం. అయితే దోమలు అందరినీ కాకుండా కొందరినే టార్గెట్ చేయడం వెనుక కొన్ని బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వైద్య అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మన శరీరంలో పట్టే చెమటలోని లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా వంటి సమ్మేళనాలు దోమలను బాగా ఆకర్షిస్తాయి. చర్మంపై నివసించే బ్యాక్టీరియా చెమటతో కలిసినప్పుడు విభిన్న వాసనలు వెలువడతాయి. ప్రత్యేకంగా ఎవరి చర్మం నుంచి అయితే కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతాయో, వారి వైపు దోమలు త్వరగా ఆకర్షితమవుతాయి.

బ్లడ్ గ్రూప్

మీ బ్లడ్ గ్రూప్ కూడా దోమల కాటుకు కారణం కావచ్చు. జపాన్ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. O గ్రూప్ రక్తం ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. చర్మం నుంచి వెలువడే రసాయన సంకేతాల ఆధారంగా దోమలు రక్త వర్గాన్ని పసిగట్టి O గ్రూప్ వారిపై దాడి చేస్తాయి.

వదిలే కార్బన్ డయాక్సైడ్

మనం శ్వాస ద్వారా బయటకు వదిలే కార్బన్ డయాక్సైడ్‌ను దోమలు చాలా దూరం నుంచే పసిగట్టగలవు. ఎక్కువ వ్యాయామం చేసేవారు, అలాగే గర్భిణీ స్త్రీలు సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తారు. దీంతో దోమలు వారి వైపే ఎక్కువగా మళ్లుతాయి.

ముదురు రంగు దుస్తులు

మీరు ధరించే దుస్తుల రంగు కూడా దోమలను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా నలుపు లేదా ముదురు రంగు దుస్తులు వేసుకున్న వారిని దోమలు సులువుగా గుర్తిస్తాయి.

శరీర ఉష్ణోగ్రత – ఆల్కహాల్

శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారికి, విపరీతంగా చెమట పట్టేవారికి దోమల బెడద ఎక్కువ. అంతేకాకుండా బీరు వంటి మద్యం సేవించే వ్యక్తులను కూడా ఇతరులతో పోలిస్తే దోమలు ఎక్కువగా కుడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి దోమల బారి నుంచి తప్పించుకోవాలంటే ముదురు దుస్తులు తగ్గించడం, శరీరాన్ని వీలైనంత శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us