
మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. అయినప్పటికీ వీటిని మానుకోవడం గురించి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. విచారంగా ఉన్నా లేదా సంతోషంగా ఉన్నా చాలా మంది మద్యం సేవిస్తారు. కొందరు సిగరెట్లు తాగుతారు. అధిక మంది సరదాగా మద్యం సేవించేవారే ఉంటారు. మరికొందరు ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కోసం తాగుతారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మానసిక విశ్రాంతి కోసం తాగేవారు కూడా ఉన్నారు. అయితే ఈ అలవాట్లు ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ ఈ చెడు అలవాట్ల వెంట జనం ఎందుకు పరిగెత్తుతారో మీరెప్పుడైనా ఆలోచించారా? వీటి ఆకర్షణలో ఈ చెడు అలవాట్లకు పూర్తిగా బానిసలు ఎందుకు అవుతారో? ఇందుకు కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
ధూమపానం, మద్యం వంటి మాదకద్రవ్యాలను తీసుకోవడం ఎంత హానికరమో మనందరికీ తెలుసు. అయితే కొంతమంది వీటిని సరదాగా తీసుకోవడం ప్రారంభించి వాటికి పూర్తిగా బానిసలవుతారు. కానీ ఒకసారి ఈ దుర్గుణాలకు బానిసలైతే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ విధంగా మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకున్న వారు మన చుట్టూ ఉండే వారిలో చాలా మంది ఉన్నారు.
ఇలాంటి చెడు అలవాట్ల ఎక్కువగా ఆకర్షితులవడానికి, వాటికి బానిసలుగా మారడానికి ప్రధాన కారణం మన శరీరంలో ఉండే RASGRF-2 జన్యు మూలకం. ఏదైనా పదార్థాన్ని సేవించినప్పుడు లభించే ఆనందాన్ని ఆస్వాదించడంలో ఈ జన్యువు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మద్యం సేవించేటప్పుడు, ధూమపానం చేసేటప్పుడు RASGRF-2 ఎక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆనందం హార్మోన్. అందుకే కొందరు అన్ని బాధలను మరచిపోయి డ్రగ్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఈ డోపమైన్ తాత్కాలికంగా మనసుకు ఆనందాన్ని, విశ్రాంతిని అందిస్తుంది. ఈ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించాలనే కోరిక, మందులు తీసుకున్న వారిని మళ్ళీ మళ్ళీ దాని వెంట పరుగెత్తేలా చేస్తుంది. ఆ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుంది. వీటిని తీసుకోవడం వల్ల కలిగే క్షణిక ఆనందం కోసం యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి ఈ దుర్గుణాలకు బలైపోతే వాటి నుండి బయటపడటం చాలా కష్టం. అందుకే జీవితాలను నాశనం చేసే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.