రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్ తీసుకుంటే రిస్క్ మీకే..
రాత్రి నిద్రలో ఒక్కసారి మెలకువ రావడం సాధారణమే. అయితే ప్రతిరోజూ లేదా తరచూ నిద్రకు భంగం కలుగుతూ, మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రపట్టకపోతే మాత్రం దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా అనిపించడం, పగటిపూట నిద్రమత్తు, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎదురవుతుంటే నిద్రకు భంగం కలిగిస్తున్న కారణాన్ని గుర్తించడం అవసరం. రాత్రి పదేపదే మేల్కొనడానికి అనేక కారణాలు ఉండవచ్చు..

ఒత్తిడి, ఆందోళన నిద్రపై ప్రభావం చూపుతాయి. రోజంతా ఉన్న ఆలోచనలు, ఆందోళనలు పడుకునే సమయంలో కూడా కొనసాగితే నిద్ర నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే పడకగదిలో ఎక్కువ కాంతి, శబ్దం ఉండటం, గది ఉష్ణోగ్రత ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం, అసౌకర్యంగా ఉండే పరుపు లేదా దిండు వంటి అంశాలు కూడా నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. సాయంత్రం, రాత్రి సమయంలో టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలను ఎక్కువగా తీసుకోవడం కొంతమందిలో నిద్రను ప్రభావితం చేస్తుంది. మద్యం సేవించడం కూడా రాత్రి నిద్ర కొనసాగింపుకు అంతరాయం కలిగించవచ్చు. తరచుగా మూత్రవిసర్జన, శరీర నొప్పులు, కొన్ని మందుల ప్రభావం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణాలు కావచ్చు. నిద్రలేమి అంటే కేవలం నిద్ర పట్టకపోవడం మాత్రమే కాదు. రాత్రిపూట తరచూ మేల్కొనడం, మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రపట్టకపోవడం, లేదా ఉదయం చాలా త్వరగా మేల్కొని తిరిగి నిద్రపోలేకపోవడం కూడా నిద్రలేమిలో భాగమే. ఈ సమస్య పదేపదే కొనసాగితే పగటిపూట అలసట, చిరాకు, జ్ఞాపకశక్తి , ఏకాగ్రతకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
నిద్రలో బిగ్గరగా గురక పెట్టడం, శ్వాస ఆగినట్లు అనిపించడం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ అకస్మాత్తుగా మేల్కొనడం వంటి లక్షణాలు ఉంటే స్లీప్ అప్నియాను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదయం తలనొప్పి, పగటిపూట అధిక నిద్రమత్తు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. స్లీప్ అప్నియాలో నిద్ర సమయంలో శ్వాసకు పదేపదే అంతరాయం ఏర్పడుతుంది. చాలాసార్లు ఈ లక్షణాలను బాధితుడి కంటే ముందే కుటుంబ సభ్యులు గుర్తించే అవకాశం ఉంటుంది.
మంచి నిద్ర కోసం ఏం చేయాలి?
నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ఉపయోగకరంగా ఉంటుంది.
- ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోండి.
- పగటిపూట తగినంత శారీరక శ్రమ చేయండి.
- పడుకునే ముందు మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ వినియోగాన్ని తగ్గించండి.
- సాయంత్రం తర్వాత కెఫిన్ తీసుకోవడాన్ని పరిమితం చేయండి.
- పడకగదిని నిశ్శబ్దంగా, చీకటిగా, సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతలో ఉంచండి.
- నిద్రకు ఇబ్బంది కలిగించే అలవాట్లను గుర్తించి వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి.
నిద్ర సమస్యలు తరచూ కొనసాగుతూ రోజువారీ పనులపై ప్రభావం చూపిస్తే స్వయంగా నిద్రమాత్రలు వాడకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా శ్వాస ఆగిపోవడం, గట్టిగా గురక, పగటిపూట అధిక నిద్రమత్తు వంటి లక్షణాలు ఉంటే స్లీప్ అప్నియా పరీక్ష అవసరమా అనే విషయాన్ని వైద్యుడితో చర్చించాలి.




