కాకినాడ AE కేసులో కీలక పరిణామం.. సైకో సాధిక్ షూటింగ్ అకాడెమీ సీజ్! 30 రైఫిల్స్ స్వాధీనం
కాకినాడలో పంచాయతీ రాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్ ఖాన్ నుంచి మూడో రోజు విచారణలో భాగంగా పలు వివరాలు రాబట్టినట్లు సమాచారం..

కాకినాడ, సెప్టెంబర్ 11: సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా సర్పవరం సీఐ సీహెచ్ ప్రకాష్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం గురువారం ఉదయం సాధిక్‌ను కాకినాడలోని గుడారిగుంట సమీపంలో ఉన్న అతనికి చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ అకాడెమీకి తీసుకెళ్లింది. రెండో అంతస్తులో ఉన్న షూటింగ్ అకాడెమీలో శిక్షణ కోసం ఉపయోగించే 30 రైఫిల్స్‌ను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతోపాటు ల్యాప్‌టాప్‌లు, ప్రత్యేక గదులు, ఇతర కీలక ఆధారాలను పరిశీలించారు.
అనంతరం అకాడెమీని సీజ్ చేసి, అక్కడ ఉన్న రైఫిల్స్, ఇతర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అకాడెమీ నిర్వహణకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి? శిక్షణ ఇవ్వడానికి అర్హతలు ఏమిటి? ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు? వంటి అంశాలపై సాధిక్‌ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేసులో మరో కీలక అంశమైన సౌజన్యతో సాధిక్‌కు ఉన్న పరిచయం, ఆమె కుమారుడితో అకాడెమీకి ఉన్న సంబంధం, ఆమెను వేధించినట్లు వచ్చిన ఆరోపణలు, ఆమె భర్త జగదీశ్వరరెడ్డి హత్యకు సంబంధించిన అంశాలపై కూడా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. సౌజన్య కుమారుడిని కారులో సాయంత్రం అకాడెమీకి తీసుకెళ్లి సుమారు రెండు గంటల పాటు అక్కడే ఉండేవారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే, అక్కడ రైఫిల్ షూటింగ్ శిక్షణ కంటే సౌజన్యపైనే సాధిక్ ఎక్కువగా దృష్టి పెట్టేవాడని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
200 ప్రశ్నలతో విచారణ.. పథకం ప్రకారమే హత్య జరిగిందా?
సౌజన్యను తనకు అనుకూలంగా మార్చుకుని, పథకం ప్రకారమే జగదీశ్వరరెడ్డిని హత్య చేసినట్లు విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. జగదీశ్వరరెడ్డికి చెందిన ఖరీదైన కార్లను కూడా పోలీసులు ఆధారాల కోసం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిని కేసు దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. విచారణ సమయంలో సాధిక్ తనపై ఉన్న ఆరోపణలను అంగీకరించకుండా, ఘటనకు సంబంధించిన బాధ్యతను సౌజన్యపైకి నెట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో సాంకేతిక ఆధారాలు, సూసైడ్ నోట్‌లోని అంశాలను ప్రస్తావిస్తూ సుమారు 200 ప్రశ్నలతో విచారణ జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన కొన్ని కీలక వివరాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.
సాధిక్ ఖాన్ పోలీసు కస్టడీ ముగియడంతో శుక్రవారం ఉదయం కాకినాడలోని కోర్టులో హాజరుపరచనున్నారు. దర్యాప్తులో ఇంకా మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి పోలీసు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సర్పవరం పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. కేసులో సేకరించిన రైఫిల్స్, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.




