మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా? గుండె నుంచి నిద్ర వరకు దెబ్బ

నవ్వు, ఏడుపు మాదిరి కోపం కూడా ఒక భావోద్వేగం. విచారంగా లేదా చిరాకుగా ఉన్నప్పుడు కోపం రావడం సహజం. కోపం అనేది ఒక సహజ భావోధ్వేగ లక్షణం. ప్రతి ఒక్కరికీ కోపం వస్తుంది. కొంతమంది చిన్న చిన్న విషయాలకే కోపపడతారు. దీనివల్ల వారు తమ మాటలు, చేతలపై నియంత్రణ కోల్పోయి ఇతరులతో తమ సంబంధాలు దెబ్బతింటాయి. అంతేకాదు ఈ కోపం ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. కోపం ఒక వ్యక్తిపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా? గుండె నుంచి నిద్ర వరకు దెబ్బ
Health Risk Of Anger

Updated on: May 22, 2026 | 1:50 PM

మితిమీరిన కోపం వచ్చినప్పుడు, అది గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కోపం, విచారం, ఆందోళన వంటి రోజువారీ ప్రతికూల భావోద్వేగాలు గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. మితిమీరిన కోపం ఎండోథెలియల్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది అధిక రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఇతర ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జీర్ణక్రియపై ప్రభావితం

మితిమీరిన కోపం కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసి మలబద్ధకం మరియు అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల జీర్ణనాళంలో వాపు పెరగవచ్చు. ఒత్తిడి తరచుగా కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం మరియు ఇతర సమస్యలను కలిగిస్తుంది, ఇవి పోషకాహార లోపాలకు దారితీయవచ్చు .

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

కోపం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కోపం తరచుగా ఆందోళన, కుంగుబాటు వంటి భావోద్వేగ రుగ్మతలను పెంచుతుందని పలు అధ్యయనాలు చూపిస్తున్నాయి. కోపంగా ఉన్నప్పుడు మెదడు తార్కిక శక్తి తగ్గి, సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. మితిమీరిన కోపం ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల మానసిక అలసట, చిరాకు అధికమవుతాయి.

రక్తపోటు ప్రమాదం

ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు శరీరంలో అడ్రినలిన్, నొరాడ్రినలిన్ అనే హార్మోన్లు వేగంగా విడుదలవుతాయి. దీనివల్ల హృదయ స్పందన రేటు పెరిగి, రక్తపోటు అకస్మాత్తుగా అధికమవుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం తరచుగా కోపం తెచ్చుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

నిద్ర నాణ్యత తగ్గుదల

మితిమీరిన కోపం నిద్రలేమికి దారితీస్తుంది. మీకు కోపం వచ్చినప్పుడు మనస్సు మరింత చురుకుగా, అశాంతంగా మారుతుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. అంతేకాకుండా మితిమీరిన కోపం నిరంతర ఒత్తిడి కలిగించి శరీరంలో కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతాయి. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని బలహీనత

నిరంతర కోపం రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.

కండరాల ఒత్తిడి

నిరంతర కోపం కండరాల నొప్పికి కారణమవుతుంది. ఈ ఒత్తిడి తరచుగా తలనొప్పి, నడుము నొప్పి , ఇతర కండరాల సమస్యలకు దారితీస్తుంది.

కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి ?

  • మీకు చాలా కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు చల్లటి నీళ్ళు తాగండి. లోతుగా శ్వాస తీసుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
  • మీకు మితిమీరిన కోపం సమస్య ఉంటే ప్రతిరోజూ ధ్యానం, యోగా, ప్రాణాయామం సాధన చేయండి.
  • మీకు కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని, లోతుగా శ్వాస తీసుకుని అంతా బాగానే ఉందని భావించండి.
  • మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే లేచి ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోండి.
Follow Us