AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుప్పల్లో దొరుకుతుంది.. రోగాల తుప్పు వదిలిస్తుంది.. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

తిప్పతీగను.. గిలోయ్ అని కూడా పిలుస్తారు.. దాని ఔషధ గుణాల కారణంగా ఇటీవల ప్రాచుర్యం పొందింది. ఇది టి హెల్పర్ కణాలు, మాక్రోఫేజ్‌ల సంఖ్యను పెంచి, బి కణాల ద్వారా యాంటీబాడీల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా రోగనిరోధక శక్తిని గణనీయంగా బలోపేతం చేస్తుంది. స్థూలకాయం, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

తుప్పల్లో దొరుకుతుంది.. రోగాల తుప్పు వదిలిస్తుంది.. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు
Thippa Theega Uses
Shaik Madar Saheb
|

Updated on: Apr 15, 2026 | 4:20 PM

Share

ప్రకృతిలో ఎన్నో రకాల సహజ ఔషధ మొక్కలు ఉన్నాయి.. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాంటి పవర్‌ఫుల్ ఔషధ మొక్కల్లో తిప్పతీగ ఒకటి.. డైలీ తిప్పతీగ రసం తీసుకుంటే.. చాలా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు.. ఇక తిప్పతీగ ప్రత్యేకత ఏంటంటే.. ఆకులు, కాండం, వేర్లు.. అన్ని విలువైనవే.. అందుకే.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో తిప్పతీగ ప్రాముఖ్యత ఈ మధ్య కాలంలో చాలా మందికి సుపరిచితమైంది. పల్లెటూళ్ళలో పొలాల గట్ల మీద, పొదలలో విరివిగా కనిపించే ఈ మొక్కను ఆయుర్వేద వైద్య శాస్త్రం ఏనాడో గుర్తించి దాని ఉపయోగాన్ని తెలియజేసింది. అయితే, ఇటీవల పలు రకాల వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దీని ఔషధ గుణాలపై ప్రజలకు అవగాహన మరింత పెరిగింది. తిప్పతీగలో ఉన్న శాస్త్రీయ ప్రయోజనాల గురించి ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

శాస్త్రీయ ఆవిష్కరణలు, ఫైటోకెమికల్స్

తిప్పతీగలో 35 రకాలకు పైగా ఔషధ గుణాలు కలిగిన ఫైటోకెమికల్స్ ఉన్నాయని గుర్తించారు. వీటిలో ముఖ్యంగా 15 రకాల ఆల్కలాయిడ్స్, ఆరు రకాల గ్లైకోసైడ్స్, ఐదు రకాల డై టర్పినాయిడ్స్, నాలుగు రకాల స్టిరాయిడ్స్, ఐదు రకాల ఆలిఫ్యాటిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ రసాయన సమ్మేళనాలు తిప్పతీగకు అద్భుతమైన ఔషధ లక్షణాలను అందిస్తాయి. 2016 సంవత్సరంలో, లక్నోలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) తిప్పతీగపై జరిపిన 170 పరిశోధన పత్రాల సారాంశాన్ని సంగ్రహించి, దాని ప్రయోజనాలను ధృవీకరించింది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే విధానం

తిప్పతీగ ప్రధానంగా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా శరీరానికి రక్షణను అందిస్తుంది.

టి హెల్పర్ కణాల పెరుగుదల: మన శరీరంలోకి వైరస్‌లు లేదా బ్యాక్టీరియాలు ప్రవేశించినప్పుడు వాటిని పసిగట్టే టి హెల్పర్ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. తిప్పతీగ ఈ టి హెల్పర్ కణాల సంఖ్యను గణనీయంగా పెంచుతుంది. ఈ కణజాలం పెరగడం వల్ల శరీరం త్వరగా స్పందించి, వ్యాధికారక క్రిములను గుర్తించి, రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేస్తుంది.

మాక్రోఫేజ్ కణాల పనితీరు మెరుగుదల: టి హెల్పర్ కణాలు సమాచారం అందించిన వెంటనే, మాక్రోఫేజ్ కణాలు రంగంలోకి దిగుతాయి. ఈ కణాలు రక్తంలో సంచరిస్తూ వైరస్‌లు, బ్యాక్టీరియాలను మింగేస్తాయి. మాక్రోఫేజ్‌లలో ఉండే లైసోజోమ్‌లు అనేవి మింగిన క్రిములను భస్మం చేస్తాయి. తిప్పతీగ ఈ లైసోజోమ్‌ల సంఖ్యను పెంచుతుంది.. తద్వారా వైరస్‌లు, బ్యాక్టీరియాలు త్వరగా నాశనం అవుతాయి.

యాంటీబాడీల ఉత్పత్తి: భవిష్యత్తులో అదే వైరస్ లేదా బ్యాక్టీరియా మళ్ళీ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి యాంటీబాడీలు చాలా అవసరం. తిప్పతీగ బీ కణాలను (B cells) ఉత్తేజపరుస్తుంది. ఇవి యాంటీబాడీల ఉత్పత్తిని పెంచుతాయి.. తద్వారా దీర్ఘకాలిక రక్షణ లభిస్తుంది.

వాపు నిరోధక, ఇతర ప్రయోజనాలు

తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, శరీర వాపును తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది.

స్థూలకాయంలో వాపు: స్థూలకాయం ఉన్నవారిలో కొవ్వు కణాలు అధికంగా వాపును కలిగిస్తాయి, ఇది వైరస్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను పెంచుతుంది. తిప్పతీగలో అరబినో గలాక్టిన్ అనే రసాయనం ఉంటుంది, ఇది స్థూలకాయం వల్ల కలిగే వాపును తగ్గించి, ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగకుండా సహాయపడుతుంది.

హానికరమైన రసాయనాల నియంత్రణ: వైరస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు, శరీరం ఇంటర్‌లూకిన్-6 (IL-6), టిఎన్‌ఎఫ్-ఆల్ఫా (TNF-alpha) వంటి కొన్ని రసాయనాలను అధికంగా విడుదల చేస్తుంది. ఈ రసాయనాలు వాపును పెంచి, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు నష్టం కలిగిస్తాయి. తిప్పతీగలో ఉండే రసాయనాలు ఈ హానికరమైన కెమికల్స్‌ను తగ్గించి, శరీరాన్ని వాపు నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.

తిప్పతీగను ఉపయోగించే విధానాలు

తిప్పతీగను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు:

పల్లెటూళ్ళలో లభించే వారికి: తాజా తిప్పతీగ ఆకులను శుభ్రంగా కడిగి ముద్దగా చేసి, కొద్దిగా తేనె కలుపుకుని మింగవచ్చు. లేదా, ఒక లీటరు నీటిలో ఆకులను వేసి, నీరు సగం అయ్యే వరకు మరిగించి, వడకట్టి, తేనె కలుపుకుని కషాయంగా తాగవచ్చు.

పట్టణాల్లో లభించే వారికి: పట్టణాల్లో తిప్పతీగ పొడి మార్కెట్‌లో లభిస్తుంది. ఈ పొడిని రెండు విధాలుగా వాడవచ్చు. ఒక స్పూన్ పొడికి కొద్దిగా తేనె కలిపి నేరుగా తినవచ్చు. లేదా, ఒక స్పూన్ పొడిని 100-150 ml నీటిలో వేసి సగం అయ్యే వరకు మరిగించి, వడకట్టి, తేనె కలుపుకుని డికాక్షన్‌గా త్రాగవచ్చు.

ఈ విధంగా తిప్పతీగను ఉపయోగించడం ద్వారా శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయవచ్చని, వైరస్‌లు, బ్యాక్టీరియాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడింది..

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం..

Follow Us