AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ అంటే మున్నార్, తెక్కడినే కాదు.. కల్పెట్టా కూడా మస్తుగుంటది..! ఒక్కసారి పోతే మర్చిపోలేరు

చల్లగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశం కోసం చూస్తున్నారా..? కేరళ లోని వయనాడ్ జిల్లా కల్పెట్టా అనే ప్రదేశం మీకు బాగా నచ్చుతుంది. ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఈ హిల్ స్టేషన్ టూరిస్టు లకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ ప్లేస్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళ అంటే మున్నార్, తెక్కడినే కాదు.. కల్పెట్టా కూడా మస్తుగుంటది..! ఒక్కసారి పోతే మర్చిపోలేరు
Kalpetta Tourism
Prashanthi V
|

Updated on: Apr 25, 2025 | 3:50 PM

Share

మీలో ఎవరైనా వెకేషన్ ప్లాన్ చేస్తూ చల్లగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశం కోసం వెతుకుతున్నారా..? మీకోసం ఇవాళ నేను మంచి ప్లేస్ ని తీసుకొచ్చాను. ఆ ప్లేస్ కేరళలో ఉంది. కేరళ అనగానే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేది మున్నార్ లేదా తెక్కడి వంటి ప్రదేశాలు. అవి నిజంగా ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశాలు. కానీ కేరళలో ఇంకా చాలా కొత్త, ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కల్పెట్టా ఒకటి.

మనలో చాలా మంది ఇప్పటి వరకు కల్పెట్టా గురించి వినకపోవచ్చు. కానీ ఇది మనుషుల మనసు దోచేసే ప్రదేశం. ఎత్తైన కొండలు, పచ్చటి అడవులతో కలిసిపోయి ఇది ఒక అందమైన విజువల్ అందిస్తుంది.

కల్పెట్టా అనే ప్రదేశం కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, ప్రకృతి అందాలు విస్తరించి ఉంటాయి. అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఇది ఒక మంచి అనుభవంగా మిగిలిపోతుంది. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగిన ప్రదేశం.

ఇది సముద్ర మట్టానికి దాదాపు 780 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పశ్చిమ కనుమల మధ్య ఉండే ఈ ప్రదేశంలో వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. వేసవికాలంలో కూడా ఇక్కడ చల్లదనం తగ్గదు. అందుకే సంవత్సరం పొడవునా ఇది సందర్శించడానికి సరైన ప్రదేశం.

కల్పెట్టా చుట్టూ ఉన్న మెప్పాడి అనే ప్రాంతంలో విస్తారమైన టీ తోటలు ఉన్నాయి. పచ్చగా విస్తరించిన వీటి మధ్య నడవడం ఒక చక్కటి అనుభూతిని ఇస్తుంది. వీటి మధ్యలో ఉన్న మార్గాల్లో నడవడం, ఫోటోలు తీయడం ప్రతి పర్యాటకుడికీ ఇష్టంగా ఉంటుంది.

కల్పెట్టా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన సరస్సు ఉంది. అక్కడ పడవలో ప్రయాణం చేస్తూ పక్షుల్ని చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇది పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రదేశంగా గుర్తింపు పొందింది. సహజంగా ఉండే ఈ సరస్సు దగ్గర ఎక్కువగా ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంటుంది.

వేసవి సెలవుల్లో గానీ, వర్షాకాలంలో గానీ చల్లగా ఉండే ప్రదేశానికి వెళ్లాలనుకుంటే కల్పెట్టా ఉత్తమమైన ఎంపిక. ఇది చాలా మందికి తెలియని చక్కటి ప్రకృతి అందాలు కలిగిన హిల్ స్టేషన్. కొత్తగా తెలుసుకోవాలని, ట్రాఫిక్, గందరగోళం లేకుండా ప్రశాంతంగా, చల్లని ప్రదేశంలో సమయం గడపాలని ఉంటే కల్పెట్టా తప్పక ఓసారి సందర్శించండి.