Hill stations: వావ్.. అనకుండా ఉండలేరు! హైదరాబాద్ కు సమీపంలో టాప్ టూరిస్ట్ కొండ ప్రాంతాలు.. మీరూ ఓ లుక్కేయండి
హైదరాబాద్ కు కొద్ది కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతాలు పచ్చదనంతో సింగారించుకుని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కేవలం గంటల ప్రయాణం దూరంలోనే అవి కేంద్రీకరించబడి ఉన్నాయి.
చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్ నగరంలో సందర్శనీయ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. నగరం చుట్టూ కొండలు ఉన్నా.. పర్యావరణ ప్రేమికులకు మాత్రం కాస్త నిరాశే. ప్రస్తుతం అంతా కాంక్రీట్ జంగిల్ కావడంతో అంతా ఆర్టిఫీయల్ అయిపోయింది. కొండలు, కోనలు, సెలయేరులు, పచ్చదనం పరుచుకున్న అందాలను ఆస్వాదించలేని దుస్థితి. అయితే హైదరాబాద్ కు కొద్ది కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతాలు పచ్చదనంతో సింగారించుకుని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కేవలం గంటల ప్రయాణం దూరంలోనే అవి కేంద్రీకరించబడి ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం అవేంటో తెలుసుకోండి.. ఈ క్రిస్మస్ వకేషన్ లో సరదాగా కుటుంబ సభ్యులు, స్నేహితులలో కలిసి ఆ ప్రాంతాలను చుట్టేసి వచ్చేయండి..
అనంతగిరి కొండలు..
నగరం నుంచి కేవలం 75 కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి కొండలు అత్యధిక మంది సందర్శించే హిల్ స్టేషన్. ఈ ప్రాంతానికి వెళ్లే మార్గంలోనే దట్టమైన అడవులు, హోరెత్తే ప్రవాహాల శబ్దాలు వినిపిస్తూ మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ట్రెక్కింగ్, బోటింగ్, రాక్ క్లైంబింగ్, నేచర్ వాక్, ఫోటోగ్రఫీకి ఇది బెస్ట్ ప్లేస్ ఇది.
ట్రెక్కింగ్ కు స్వర్గధామం.. ఈ ప్రాంతంలోకి కొండల మధ్య ట్రెక్కింగ్ పర్యాటకులకు విశేష అనుభూతినిస్తుంది. మీరు బృందంగా ఇక్కడికి చేరుకుంటే అంతా ఉత్సాహంగా గడపవచ్చు. అలాగే భవనాసి సరస్సు, వికారాబాద్ టౌన్, అరకు మ్యూజియం ఈ ప్రాంతంలో చూడదగిన ప్రాంతాలు. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.
నల్లమల కొండలు..
నగర రణగోణ ధ్వనుల నుంచి, గజిబిజి జీవితం నుంచి కాస్త సాంత్వన పొందాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ నల్లమల కొండలు. హైదరాబాద్ కు సమీపంలోనే ఉన్న ఈ ప్రాంతం గురించి చాలా మందికి తెలియదు. నగరం నుంచి దాదాపు 233 కి.మీ దూరంలో ఉంది. కృష్ణా, పెన్నా నదులు ఈ పర్వత శ్రేణిని ఆనుకొని ప్రవహిస్తుంటాయి. చుట్టూ దట్టమైన అడవి, జలపాతాలు ఆకర్షిస్తాయి. మానవ నిర్మిత కంబం సరస్సు అబ్బుర పరుస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పచ్చదనంతో ఫరిడవిల్లుతుంటుంది. అనేక రకాల వన్యప్రాణులను ఇక్కడ మనకు కనువిందు చేస్తాయి.
శ్రీశైలం..
సుందరమైన దృశ్యాలు, వివిధ సాహస యాత్రలు చేయాలనుకునేవారికి శ్రీశైలం హిల్ స్టేషన్ అద్భుత అనుభూతినిస్తుంది. ఇది హైదరాబాద్ నుంచి 215 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో ఉంది. ఇక్కడి ఆధ్యాత్మిక క్షేత్రాలు, గుహలు, బోటింగ్, దట్టమైన అడవులు, ఘాట్ రోడ్, జలపాతాలు, లోయలు వంటివి విశేషంగా ఆకర్షిస్తాయి. నాగార్జున సాగర్-శ్రీశైలం అభయారణ్యం, కామేశ్వరి ఆలయం, శ్రీశైలం ఆనకట్ట, ఉమా మహేశ్వరం ఆలయం వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఇక్కడ తప్పక సందర్శించాలి.
దూరమైనా చూసి తీరాల్సిన ప్రదేశాలు..
క్రిస్మస్ వకేషన్ లో కాస్త లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునే వారు ఈ ప్రాంతాలను పరిశీలించవచ్చు. కాస్త దూరం అయిన ఆయా ప్రాంతాలలో పర్యటిస్తే జీవితానికి సరిపడా అనుభవాలను మోసుకొని రావచ్చు.
లంబసింగి (ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్).. ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న లంబసింగి ప్రాంతం ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదం లాంటిది. ఈ వింటర్ సీజన్లో తప్పనిసరిగా చూడాల్సిన ప్రాంతం ఇది. మీకు కాశ్మీర్ లో ఉన్న అనుభూతిని ఇస్తుంది. ఇక్కడి ఆపిల్ తోటలు, దట్టమైన అడవులు, హోరెత్తే ప్రవాహాలు, జలపాతాలు, పొద్దుతిరుగుడు తోటలు, సుగంధ తోటల వాసనను ఆస్వాదించాల్సిందే కానీ వర్ణించలేం. అలాగే హైదరాబాద్ నుంచి కేవలం 526 కి.మీ దూరంలో ఉన్న అరకు లోయను కూడా సందర్శించవచ్చు, ఇది లంబసింగి కి దగ్గరలోనే ఉంటుంది.
హార్సిలీ హిల్స్.. ఇది కూడా ప్రముఖ సందర్శనీయ ప్రాంతమే. ఇక్కడ రాక్ క్లైంబింగ్ తో పాటు పలు సాహస క్రీడలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఉన్న150 సంవత్సరాల పురాతన యూకలిప్టస్ చెట్లు ఫోటో షూట్లకు హాట్ స్పాట్‌గా మారాయి. అలాగే హైదరాబాద్ నుంచి 514 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు కూడా మంచి హిల్ స్టేషన్. ఇక్కడ బర్డ్ వాచింగ్, ఫోటోగ్రఫీ, రాక్ క్లైంబింగ్, ఆఫ్-రోడింగ్ ఆకర్షణలు. అలాగే కౌండిన్య అభయారణ్యం, గంగోత్రి సరస్సు, చెన్నకేశవ ఆలయం చూడదగిన ప్రాంతాలు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..