దేశంలో అనేక ప్రాంతాల్లో ఎండవేడిమితో జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు రుతుపవనాలు వచ్చే సమయం ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో తేమతో కూడిన ఉష్ణోగ్రత, వేడిగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొండ ప్రాంతాలకు వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ అత్యంత ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్‌లలో ఒకటి. ఇక్కడ భీమ్‌తాల్, మాల్వా తాల్, లోక్‌మతల్ సహా 7 ప్రధాన సరస్సులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మీరు కూడా ఈ వేసవిలో నైనిటాల్ వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. ఏ ప్రదేశాలను సందర్శించవచ్చునో తెలుసుకుందాం
నైనిటాల్‌లోని ఈ సరస్సును తప్పక చూడండి
నైనిటాల్‌లోని పర్వతాలు, సరస్సుల ప్రకృతి అందాలు, పచ్చని చెట్లను చూస్తే అక్కడ స్థిరపడాలని అనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రతి సరస్సుకు దాని సొంతం అందం ఉంది. అయితే మీరు ఇక్కడికి వెళ్తే మీరు ఖచ్చితంగా నైని సరస్సును సందర్శించాలి. ఈ సరస్సు పేరు మీదుగా నైనిటాల్ కు ఆ పేరు వచ్చింది. ఇక్కడ సూర్యాస్తమయం దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది.
భీమ్ తాల్
నైని సరస్సుతో పాటు, మీరు నైనిటాల్‌లోని భీమ్‌టాల్‌ను తప్పక సందర్శించాలి. ఈ సరస్సు వద్ద ఉన్న సహజ సౌదర్య దృశ్యాలను చూడాలంటే రెండు కనులు చాలవు అని అంటారు. ఈ సరస్సు మధ్యలో ఉన్న చిన్న దీవి అందాలు చూడాల్సిందే. ఈ ప్రదేశం బోట్ రైడింగ్ కి కూడా చాలా బాగుంటుంది. భీమ్టాల్ చుట్టూ పర్వతాలు, పచ్చదనం ఉంది.
టిఫిన్ టాప్, నైనిటాల్
నైనిటాల్‌కు వెళితే, టిఫిన్ టాప్‌ని కూడా సందర్శించండి. అన్ని వైపులా చెట్లు, పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం జీవితంలోని కష్టాలన్నింటినీ మరచిపోయేలా చేస్తుంది.
ఎకో వేవ్ గార్డెన్
ఫ్యామిలీతో కలిసి నైనిటాల్ వెళ్ళినట్లయితే, ఎకో వేవ్ గార్డెన్‌ని సందర్శించడం చాలా మంచి అనుభూతినిస్తుంది. వాస్తవానికి, ఈ ప్రదేశం జంతువుల ఆకారంలో చేసిన గుహలను కలపడం ద్వారా తయారు చేయబడింది. కనుక పిల్లలు ఇక్కడికి వెళ్తే చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు ఇక్కడ అందమైన ఫౌంటైన్లు కూడా ఉన్నాయి, ఇవి ఈ ప్రదేశ అందాన్ని మరింత పెంచుతాయి.
కైంచి ధామ్
కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తే.. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నట్లయితే, నైనిటాల్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైంచి ధామ్‌ను తప్పకుండా సందర్శించండి. ఇక్కడికి వెళ్తే మంచి ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..