AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదో తెలుసా..?

Bali Tops Global Travel Destinations List for 2026: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్న ప్రదేశంగా ఇండోనేషియాలోని బాలి నిలిచింది. 2026లో ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా బాలి.. ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డు గెలుచుకుందని ట్రిప్ అడ్వైజర్ ప్రకటించింది.

లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదో తెలుసా..?
Bali, Indonesia
Rajashekher G
|

Updated on: Jan 19, 2026 | 5:21 PM

Share

Bali travel destination 2026: ప్రపంచ పర్యాటకంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. భారతదేశంలోని అనేక చారిత్రక, ప్రత్యేకమైన ప్రదేశాలను విదేశీయులు వచ్చి సందర్శిస్తున్నారు. అలాగే, భారతీయులు కూడా విదేశాల్లోని అందమైన, ఆహ్లాదమైన ప్రదేశాలకు ప్రయాణిస్తున్నారు. వివాహాలు, హనీమూన్ కోసం ఎక్కువగా భారతీయులు విదేశాల్లోని అందమైన, ప్రశాంతమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యధికమంది పర్యాటకులను ఆకర్షించిన నగరాల జాబితాను ఓ ప్రముఖ ట్రావెల్ సంస్థ విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రపంచంలోని ప్రధాన నగరాలను కాదని.. ఇండోనేషియాలోని బాలి నగరం అగ్రస్థానంలో నిలిచింది. అయితే, బాలి అగ్రస్తానంలో నిలిచేందుకు అక్కడి సహజ అందాలు, చారిత్రక నిర్మాణాలు, భద్రతా ప్రమాణాలు ఇలా అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు అత్యధికంగా ఆసక్తి చూపుతున్న గమ్యస్థానంగా ఇండోనేషియాలోని బాలి నిలిచింది. ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ట్రిప్ అడ్వైసర్ విడుదల చేసిన 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక జాబితాలో బాలి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన లక్షలాది ప్రయాణికుల అనుభవాలు, సమీక్షలు, రేటింగ్స్ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ట్రిప్ అడ్వైసర్ తెలిపింది. పర్యాటక రంగంలో ఇది అత్యంత విశ్వసనీయమైన సూచికగా గుర్తింపు పొందింది.

సహజ అందాలు, సంస్కృతి – బాలికి ప్రధాన బలం

బాలి అనగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడి సహజ సౌందర్యం. నీలి సముద్ర తీరాలు, తెల్లని ఇసుక బీచ్‌లు, పచ్చని వరి పొలాలు, అగ్నిపర్వతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో సంప్రదాయ దేవాలయాలు, స్థానిక కళలు, నృత్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాలిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

ఆధ్యాత్మికత నుంచి అడ్వెంచర్ వరకూ

బాలి కేవలం విహారయాత్రకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రశాంతత కోరుకునేవారికి కూడా అనుకూలంగా ఉంది. ఊబుడ్ ప్రాంతంలో యోగా, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలకు విశేష ఆదరణ లభిస్తోంది. మరోవైపు స్కూబా డైవింగ్, సర్ఫింగ్, ట్రెక్కింగ్ వంటి సాహసక్రీడలు యువతను ఆకట్టుకుంటున్నాయి.

హనీమూన్, సొలో ట్రావెల్‌కు కూడా ఉత్తమ ఎంపిక

ప్రేమ జంటల కోసం రొమాంటిక్ వాతావరణం, విలాసవంతమైన రిసార్ట్స్ అందుబాటులో ఉండటం వల్ల బాలి హనీమూన్ గమ్యంగా పేరు గాంచింది. అలాగే ఒంటరిగా ప్రయాణించే వారికి భద్రత, సౌకర్యాలు ఉండటంతో సొలో ట్రావెల్ డెస్టినేషన్‌గా కూడా ఇది ముందంజలో ఉంది.

ప్రపంచ నగరాలకు పోటీగా నిలిచిన బాలి

2026 పర్యాటక జాబితాలో లండన్, పారిస్, డుబాయ్, రోమ్ వంటి ప్రముఖ నగరాలు ఉన్నప్పటికీ.. సహజ వాతావరణం, ఆతిథ్య సంస్కృతి, ఖర్చుకు తగిన అనుభవం కారణంగా బాలి వాటన్నింటికీ మించి అగ్రస్థానాన్ని సాధించింది.

బాలి పర్యాటక రంగానికి కొత్త ఊపిరి

ఈ గుర్తింపు వల్ల బాలి పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2026లో అంతర్జాతీయ పర్యాటకుల రాక గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సహజ అందాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునిక సౌకర్యాల సమ్మేళనం వల్ల 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపికగా బాలి నిలిచిందని చెప్పవచ్చు.