చలికాలం.. చాలా మంది ఇష్టపడే కాలం. మంచుతెరల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించాలే గానీ వర్ణించలేం. అయితే ఈ ఏడాది చలి పులి పంజా విసురుతోంది. చలి తీవ్రత అధికంగా ఉంటోంది. చాలా చోట్ల స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో సాధారణంగా అందరూ వేడి కోసం తాపత్రయపడతారు. తమ శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. దాని కోసం పలు ప్రత్యామ్నాయాలు వెతుకుతారు. వేడివేడి ఆహార వస్తువులు తీసుకోవాలని ఆరాటపడతారు. మీరు కూడా ఈ విధంగానే చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.. చలికాలంలో మిమ్మల్ని హాట్ గా ఉంచే ఇంటి చిట్కాలు మీకోసం..
వేడినిచ్చే దుస్తులు వేసుకోండి.. చలికాలంలో సాధారణంగా వాతావరణం కూల్ గా ఉండటంతో పాటు, చలి గాలులు కూడా వీస్తుంటాయి. ఆ సమయంలో శరీరానికి వెచ్చదనం అవసరం. అందుకోసం వీలైనంత వరకూ దళసరి ఉన్ని వస్త్రాలు ధరించాలి. తద్వారా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
సూర్యరశ్మిని తగలనివ్వండి.. పగటిపూట అవకాశం ఉన్నంత వరకూ మీ ఇంటి తలుపులు, కిటికీలు తెరచి ఉంచి సూర్యరశ్మి లోపల పడేలా చూసుకోవాలి. తద్వారా రూం టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది. మళ్లీ రాత్రి వేళకు అన్ని తలుపులు, కిటికీలు మూసి వేస్తే టెంపరేచర్ కొంత అదుపులో ఉండే అవకాశం ఉంటుంది.
వేడి పదార్థాలు తినండి.. కొన్ని రకాల స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం శరీరానికి కొన్ని ఆహార పదార్థాలు వేడిని కలుగజేస్తాయి. వాటిలో పసుపు, తేనే, అల్లం, దాల్చిన చెక్క, నట్స్ , గుడ్లు, పెప్పర్ వంటివి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా శరీరం వేడిని సంతరించకుంటుంది.
వేడి వేడిగా తాగండి.. హాట్ గా ఏదైనా తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని సంపాదించుకోవచ్చు. కాఫీ, టీ,సైడర్, వంటి వేడి పానీయాలు తీసుకోవడం ఉత్తమం.
ఫిజికల్ గా యాక్టివ్.. శరీర కదలిక ద్వారా బాడీలో వేడి ఉత్పత్తి అవుతుంది. చలి వాతావరణంలో ఏదో వ్యాయామం చేయడం మంచిది. రన్నింగ్ చేయడం, ఇల్లు తుడవడం, ఇంటి తోటలో ఏదైనా పని చేయడం, ఏదైనా గేమ్ ఆడటం చేస్తూ ఉండాలి.
సాక్స్ వాడండి.. చలి వాతావరణానికి కాలి పాదాలను తగలకుండా చూసుకోవడం ద్వారా శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చు. దీని కోసం కాలికి సాక్స్ వాడటం ఉత్తమం. నిద్రకు ఉపక్రమించే టప్పుడు కూడా కనీసం గంట ముందు సాక్స్ వేసుకోవడంతో చలిని అధిగమించవచ్చు.
విటమిన్ బీ12, ఐరన్ అవసరం.. శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేసే ఎర్ర రక్త కణాలు తక్కువ ఉన్నప్పుడు కూడా మీరు చలి ఎక్కువగా అనుభవిస్తారు. దీనిని ఎనీమియా అంటారు. దీనిని అధిగమించడం కోసం విటమిన్ బీ12, ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గుడ్లు, చేపలు, సీ ఫుడ్, ఆకుకూరలు, కూరగాయల్లో ఇవి అధికంగా లభ్యమవుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం