AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లల పెళ్లి గురించి టెన్షనా? ఈ ‘మ్యారేజ్ మార్కెట్’ గురించి తెలిస్తే షాక్ అవుతారు!

ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే మన దగ్గర తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ యాప్స్‌లో ప్రొఫైల్స్ వెతకడం సహజం. కానీ చైనాలో పరిస్థితి మరో స్థాయికి చేరుకుంది. అక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏకంగా ఒక 'మ్యారేజ్ మార్కెట్'నే నిర్వహిస్తున్నారు. షాంఘైలోని పీపుల్స్ పార్క్ ప్రతి వారాంతంలో ఒక భారీ పెళ్లిళ్ల సంతలా మారిపోతుంది.

మీ పిల్లల పెళ్లి గురించి టెన్షనా? ఈ ‘మ్యారేజ్ మార్కెట్’ గురించి తెలిస్తే షాక్ అవుతారు!
Shanghat Marriage Market
Nikhil
|

Updated on: May 09, 2026 | 5:13 PM

Share

పెళ్లిళ్ల మార్కెట్‌లో పిల్లలకు బదులు వారి తల్లిదండ్రులే చురుగ్గా పాల్గొంటారు. తమ పిల్లల వయసు, వృత్తి, ఎత్తు, విద్య, హాబీలు వంటి వివరాలతో కూడిన బయోడేటాలను పార్కులో ప్రదర్శనకు ఉంచుతారు. అటుగా వెళ్లే ఇతర తల్లిదండ్రులు ఆ ప్రొఫైల్స్ చూసి, నచ్చితే అక్కడికక్కడే చర్చలు జరిపి ఫోన్ నంబర్లు మార్చుకుంటారు. ఇది అచ్చం పాతకాలపు అరేంజ్డ్ మ్యారేజ్ లాగే ఉన్నా, పబ్లిక్ పార్కులో జరగడమే విచిత్రం.

ఎందుకు ఈ మార్కెట్లకు ఇంత క్రేజ్?

చైనాలో ఈ మ్యారేజ్ మార్కెట్లు 2000వ సంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయి. నేటికీ వీటి ఆదరణ తగ్గకపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి

  • తీరిక లేని బిజీ లైఫ్: చైనాలోని యువత కెరీర్ పనుల్లో పడి డేటింగ్ చేయడానికి సమయం దొరకడం లేదు. మరికొందరు సిగ్గు వల్ల తోడును వెతుక్కోలేకపోతున్నారు.
  • లింగ అసమానత: చైనాలో చాలా కాలం పాటు అమలైన ‘ఒక్క బిడ్డ’ విధానం వల్ల లింగ నిష్పత్తిలో తేడాలు వచ్చాయి. దీనివల్ల పెళ్లి సంబంధాల కోసం పోటీ పెరిగింది.
  • నిపుణుల సహాయం: ఇక్కడ కేవలం తల్లిదండ్రులే కాకుండా, వృత్తిపరమైన మ్యాచ్ మేకర్లు కూడా అందుబాటులో ఉండి సరైన సంబంధాలను సూచిస్తుంటారు.

సోషల్ మీడియాలో వైరల్

ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌లో ఒక యువకుడు తన తండ్రి తనను బలవంతంగా ఈ మార్కెట్‌కు తీసుకెళ్లిన అనుభవాన్ని పంచుకున్నాడు. ఆ తండ్రి పార్కులోకి వెళ్లగానే వరుసగా ఉన్న బయోడేటాలను స్కాన్ చేసి, మూడు ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేశాడట. అందులో ఒక అమ్మాయిని ఫైనల్ చేసి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి కొడుకు కోసం ఒక డేట్ కూడా ఫిక్స్ చేసేశాడు.

ఈ మార్కెట్‌లో విదేశీయుల కోసం కూడా ప్రత్యేక విభాగాలు ఉండటం విశేషం. ప్రపంచం ఎంత డిజిటల్ మయం అయినా, పిల్లల పెళ్లి విషయంలో చైనా తల్లిదండ్రులు మాత్రం దేనినీ అదృష్టానికి వదిలేయడం లేదు. ఇంటర్నెట్ లోని యాప్స్ కంటే, తాము నేరుగా వెళ్లి చూసి నిర్ణయించడమే ఉత్తమమని వారు భావిస్తున్నారు. మన దగ్గర మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు ఎలాగో, అక్కడ ఈ మ్యారేజ్ మార్కెట్లు అలా అన్నమాట!

Follow Us