ప్రకృతి ప్రసాదించిన అమృతం..సీజన్‌తో పనిలేదు! ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలో జరిగేది ఇదే
సాధారణంగా ఎండాకాలం రాగానే అందరూ ఎగబడి తాగే పానీయం కొబ్బరినీళ్లు. శరీరాన్ని చల్లబరచడానికి, డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి ఇది అద్భుతమైన సహజ పానీయం. అయితే వర్షాకాలం మొదలవ్వగానే చల్లటి వాతావరణంలో కొబ్బరినీళ్లు తాగితే జలుబు చేస్తుందా?, వర్షాకాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా లేదా? అనే సందేహాలు చాలామందిలో తలెత్తుతాయి. ఈ విషయమై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల కొబ్బరినీళ్లు తాగవచ్చా లేదా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలోనూ కొబ్బరినీళ్లు తాగడం శరీరానికి ఎంతో శ్రేయస్కరం. వర్షాకాలంలో సంభవించే నీటి ద్వారా వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు ఇందులోని యాంటీబాక్టీరియల్, ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఎంతగానో తోడ్పడతాయి. వర్షాకాలంలో రకరకాల ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు దాడి చేస్తుంటాయి. కొబ్బరినీళ్లలో ఉండే లారిక్ యాసిడ్, విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇస్తాయి.
వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ కాస్త మందగిస్తుంది. కొబ్బరినీళ్లలోని పీచు పదార్థం, నిత్యావసర ఎంజైములు జీర్ణక్రియను వేగవంతం చేసి, కడుపు ఉబ్బరం, ఇన్ఫెక్షన్లను అరికడతాయి. జ్వరం లేదా వర్షాకాలంలో వచ్చే డయేరియా వంటి సమస్యల వల్ల శరీరంలో తగ్గిన ఎలక్ట్రోలైట్లను పునరుద్ధరించడానికి కొబ్బరినీళ్లు మేలైన ఔషధంగా పనిచేస్తాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?:
వర్షాకాలంలో కొబ్బరినీళ్లు తాగేటప్పుడు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం అవసరం:
జలుబు, దగ్గు లేదా సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున లేదా రాత్రి వేళల్లో కొబ్బరినీళ్లు తాగకపోవడం మంచిది. మధ్యాహ్నం 11 గంటల నుండి 3 గంటల మధ్య తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. వర్షాకాలంలో చల్లటి కొబ్బరినీళ్లు అస్సలు తాగకూడదు. బొండం కొట్టిన వెంటనే తాజా నీటిని మాత్రమే తీసుకోవాలి. నిత్యం ఒకటి కంటే ఎక్కువ బొండాలు తాగడం వల్ల కొంతమందిలో గొంతు నొప్పి లేదా జలుబు చేసే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు ఒక బొండం నీరు సరిపోతుంది. సరియైన సమయంలో, పరిమితంగా తీసుకుంటే వర్షాకాలంలోనూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఎటువంటి హానీ జరగదు. పైగా ఇది మీ ఆరోగ్యానికి, చర్మానికి, రోగనిరోధక శక్తికి అదనపు బలాన్ని ఇస్తుంది.




