Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dokka Sitamma: అన్నదానం విశిష్టతను చాటిచెప్పిన ఆంధ్రుల అన్నపూర్ణమ్మ ‘మన డొక్కా సీతమ్మ’కు ఘనమైన నివాళి..

Dokka Sitamma: అన్నపూర్ణ దేవి(Annapurana Devi) అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. అన్నపూర్ణ దేవీ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (East Godavari District) డొక్క సీతమ్మ అని వింటూనే..

Dokka Sitamma: అన్నదానం విశిష్టతను చాటిచెప్పిన ఆంధ్రుల అన్నపూర్ణమ్మ ‘మన డొక్కా సీతమ్మ’కు ఘనమైన నివాళి..
Dokka Seetamma
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2022 | 3:33 PM

Dokka Sitamma: అన్నపూర్ణ దేవి(Annapurana Devi) అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. అన్నపూర్ణ దేవీ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (East Godavari District) డొక్క సీతమ్మ అని వింటూనే ఉన్నాం. అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలోతడిసిన వ్యక్తి “అమ్మా సీతమ్మ తల్లి .. ఆకలేస్తుందమ్మా” అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి ,దుప్పటి ,వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కాసీతమ్మ తల్లి. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ . అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. నేటి తరానికి ఆమె గొప్పదనం గురించి తెలియజేద్దాం..

తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు ‘బువ్వన్న’ గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ ‘బువ్వ'(అన్నం) పెట్టటమే! అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి ఆమె. బాల్యంలో సీతమ్మకి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు.

లంకల గన్నవరంకి కోడలుగా అడుగు 

గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు. బువ్వన్నగారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మ అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు ‘డొక్కా’ గా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజు రోజుకూ పెరగసాగాయి. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఆప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆచుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు.

ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే.. ఆవిడ జీవితంలో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు “ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం… అక్కడ సీతమ్మ  మనకు అన్నం పెడతారు” అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మ . వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి… వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ. అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో..  ‘అపర అన్నపూర్ణ’ గా శ్రీమతి సీతమ్మ పేరుపొందారు.

నిరంతర అన్నదానంతో ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భార్త “ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు…” అన్నారు. దానికి ఆవిడ “నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు” అని చెప్పింది. తరువాత ఒక రోజు సాయంకాలం ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ భర్త గునంతో తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. ఆ బంగారు కాసుల రాశులతో మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.

ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే “నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా” అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, “నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకాలు ఎందుకు, వద్దు” అన్నారు ఆవిడ. “అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు” అని ఆ కలెక్టరు చెబితే, “నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి” అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం.

అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పటమే కాకుండా నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న ‘అపర అన్నపూర్ణమ్మ’మన డొక్కా సీతమ్మ..  జాతిరత్నం. 1909 ఏప్రియల్ 28న శివైక్యం చెందారు. డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియచేయటం, ఆమె చేసిన నిస్స్వార్ధ సేవలను గుర్తుచేసి ఆమె చరిత్రనుండి స్ఫూర్తివంతుల ను చేయటమే ఆమహానీయురాలికి మనం ఇవ్వగలిగే ఘనమైన నివాళి!….

( బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములనుండీ సేకరణ)

Also Read: Tamil Nadu: రోడ్డును బ్లాక్ చేసిన ఏనుగు.. అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ.. తల్లి, బిడ్డ క్షేమం