గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా.. అమృతమే తిన్నంత కమ్మగా..
పండగలు, నవరాత్రులు సమయంలో అమ్మవారికి సమర్పించేందుకు ఇంట్లో దద్దోజనం చేస్తుంటాం. అయితే కొన్ని సార్లు ఇది చేసి కొద్దిసేపటికే పులిసి పోవడం, లేదా పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి గుడి ప్రసాదం రుచితో, రోజంతా పులవకుండా ఉండేలా ఇంట్లోనే ఈజీగా దద్దోజనం ఎలా తయారీ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

సౌతిండియాలో సాంప్రదాయ వంటకాలు అనగానే గుర్తొత్తే మొదటి వటకం దద్దోజనం.. ముఖ్యంగా నవరాత్రులు వంటి పండుగల వేళ అమ్మవారికి నైవేద్యంగా, ఆలయాల్లో పవిత్ర ప్రసాదంగా దీనిని భక్తులకు అందజేస్తుంటారు. అయితే ఆలయాల్లో లభించే ప్రసాదం రుచి ఎంతో విశిష్టంగా ఉంటుంది. ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా దద్దోజనం రోజంతా కమ్మగా, గట్టిపడకుండా, పులిసిపోకుండా ఉండాలంటే.. దాన్ని వండేటప్పుడూ కొన్ని ప్రత్యేక పద్ధతులు, చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటి, గుడి స్టైల్‌లో ఇంట్లోనే దద్దోజనం ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.
దద్దోజనం తయారీకి కావలసిన పదార్థాలు:
- బియ్యం: ½ కప్పు
- నీళ్ళు: 1 కప్పు
- నెయ్యి: 1 టేబుల్ స్పూన్
- ఆవాలు: ¼ టీ స్పూన్
- పచ్చిశనగపప్పు: 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర: ¼ టీ స్పూన్
- మిరియాలు: సుమారు 20
- అల్లం: ½ ఇంచు ముక్క
- పచ్చిమిర్చి: 1
- కరివేపాకు: 2 రెమ్మలు
- ఇంగువ: కొద్దిగా
- తాజా పెరుగు: 1 కప్పు
- కాచి చల్లార్చిన పాలు: సుమారు 1 కప్పు
- ఉప్పు: రుచికి సరిపడినంత
దద్దోజనం తయారీ విధానం:
స్టెప్-1: ముందుగా అర కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒక కప్పు నీటితో కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే గిన్నెలోకి తీసుకుని గరిటెతో మెత్తగా మ్యాష్ చేయాలి. చల్లారితే గట్టిపడి మ్యాష్ చేయడం కష్టమవుతుంది కాబట్టి, వేడి మీదున్నప్పుడే చేయడం వల్ల దద్దోజనం క్రీమీగా వస్తుంది. అనంతరం దానిని పూర్తిగా చల్లారనివ్వాలి.
స్టెప్-2: స్టవ్ వెలిగించి పాన్‌లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. ఆపై ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేయించాలి. తర్వాత పోపు వేగాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలిక, కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. చివరగా ఇంగువ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి పాన్‌కే ఇంగువ వేగిపోతుంది. ఈ పోపును పూర్తిగా చల్లారనివ్వాలి; పోపు వేడిగా ఉన్నప్పుడే కలిపితే దద్దోజనం త్వరగా పులిసిపోతుంది.
స్టెప్-3: పూర్తిగా చల్లారిన అన్నంలో కప్పు తాజా పెరుగు వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.పెరుగు కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా పోస్తూ మిశ్రమం కాస్త పలుచగా ఉండేలా చూసుకోవాలి. కలిపేటప్పుడు కాస్త పలుచగా ఉంటే, కొద్దిసేపటి తర్వాత చిక్కబడినప్పటికీ తినే సమయానికి గట్టిపడకుండా మెత్తగా, రోజంతా తాజాగా ఉంటుంది.
స్టెప్-4: చివరగా చల్లారిన పోపుతో పాటు సరిపడా ఉప్పు వేసి మొత్తం అన్నానికి పట్టేలా బాగా కలపాలి. ఈ సులభమైన పద్ధతిని పాటిస్తే ఎంతో సువాసనతో, రోజంతా కమ్మగా ఉండే ఆలయ శైలి దద్దోజనం సిద్ధమవుతుంది. నవరాత్రి నైవేద్యాల కోసం ఇది చక్కటి ఎంపికగా నిలుస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
