Cyber fraud: వాట్సప్‌లో “నో” అనే మెస్సేజ్ వచ్చిందా..? క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ.. జాగ్రత్త గురూ..
వాట్సాప్‌లో వచ్చే నకిలీ బ్యాంక్ డెబిట్ మెసేజ్‌లతో సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతిలో వల వేస్తున్నారు. "నో" అని రిప్లై ఇస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని, వెంటనే బ్లాక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాట్సాప్‌లో కొత్త సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నో అని రిప్లై ఇస్తే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదముంది. వాట్సాప్‌ను ఉపయోగించే ప్రజలు కొత్త రకం సైబర్ మోసం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేవలం “నో” అనే ఒక సమాధానంతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు గుర్తు తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి బ్యాంకు ఖాతా నుండి నగదు డెబిట్ అయినట్లు నకిలీ సందేశాలు పంపిస్తారు. ఈ రూపంలో ప్రజలను మోసగించడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. వాట్సప్ ద్వారా ఇప్పటికే నకిలీ లింకులు పంపించడం, స్పామ్ లింకుల ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి బ్యాంక్ ఖాతాలోని నగదును చోరీ చేయడం లాంటివి మనం తరచూ చూస్తున్నాం. కానీ ఇప్పుడు మోసగాళ్ల నయా ట్రిక్ ఉపయోగిస్తున్నారు. ఈ ట్రిక్ ఎలా పనిచస్తుంది..? ఎలా జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకుందాం.
సైబర్ నేరగాళ్లు వాట్సప్‌లో మీ బ్యాంక్ ఖాతా నుండి ఒక నిర్దిష్ట మొత్తం డెబిట్ అయినట్లు పేర్కొంటారు. మీరు ఆ లావాదేవీని చేయకపోతే వెంటనే “నో” అని రిప్లై ఇవ్వమని కోరతారు. ఈ సందేశాలను చూసిన వెంటనే బాధితులు ఆందోళన చెంది లావాదేవీని తాము చేయలేదని చెప్పడానికి “నో” అని రిప్లై ఇస్తారు. అయితే ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది. “నో” అని రిప్లై ఇచ్చాక బ్యాంక్ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. ఆ తర్వాత బహుళ లావాదేవీల ద్వారా బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ చేస్తారు. “నో” అని రిప్లై ఇచ్చినప్పుడు.. అది ఒక మాల్వేర్ ఫైల్‌ను లేదా స్పైవేర్‌ను యాక్టివేట్ చేస్తుంది.. ఈ మాల్వేర్ మీ ఫోన్‌లోకి ప్రవేశించి, హ్యాకర్ల చేతికి మీ ఫోన్ నియంత్రణను అందిస్తుంది. అప్పుడు హ్యాకర్లు మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకింగ్ వివరాలను, మీరు చేసే ప్రతి చాట్‌ను పర్యవేక్షించగలుగుతారు. దీంతో మీ బ్యాంక్ ఖాతా వివరాలు సులభంగా చోరీకి గురై ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ కొత్త మోసం బారిన పడకుండా వాట్సప్ వినియోగదారులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మీకు ఇలా యస్, నో సందేశాలు వాట్సప్‌లో వచ్చే స్పందించవద్దు.. వెంటనే ఆ నెంబర్ బ్లాక్ చేయండి. గుర్తు తెలియని నంబర్ల నుండి, ముఖ్యంగా అంతర్జాతీయ నంబర్ల నుండి వచ్చే బ్యాంకు లావాదేవీల సందేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దు. వాటిని వెంటనే బ్లాక్ చేయండి. మీ బ్యాంక్ ఖాతా నుండి నగదు డెబిట్ అయినట్లు సందేశం వస్తే.. ముందుగా అధికారిక బ్యాంకు యాప్‌లో మీ ఖాతా స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేసుకోండి. ఏదైనా అనుమానం ఉంటే, మీ డెబిట్/క్రెడిట్ కార్డు వెనుక భాగంలో ముద్రించిన లేదా మీ పాస్ బుక్‌లో ఉన్న అధికారిక కస్టమర్ కేర్ నంబర్‌ను మాత్రమే సంప్రదించండి. ఇంటర్నెట్‌లో కనిపించే నంబర్లను నమ్మవద్దని నిపుణులు చెబుతున్నారు.
