అయోధ్య, కాశీతో పాటు 7 జ్యోతిర్లింగాల దర్శనం.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ అద్బుత అవకాశం..
Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకునేవారి కోసం తక్కువ ధరలో ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం మూడు ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ నుంచి ఈ మూడు యాత్రలు ప్రారంభం కానున్నాయి.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఆర్‌సీటీసీ శుభవార్త అందించింది. దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించాలనుకునేవారికి మంచి అవకాశం కల్పిస్తోంది. ఒకే యాత్రలో అయోధ్య, కాశీ, రామేశ్వరం సందర్శించవచ్చు. ఈ మేరకు ప్రత్యేక భారత్ గౌరవ్ రైలును ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టింది. దీంతో పాటు మరో రెండు ప్యాకేజీలను కూడా తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవాలనునే ప్రజలకు ఇది అద్బుత అవకాశంగా చెప్పవచ్చు. డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రలు.. జనవరి 3 వరకు కొనసాగనున్నాయి.
ఒకే యాత్రలో అయోధ్య, కాశీ, రామేశ్వరం
ఎస్‌సీజెడ్‌బీజీ 70 ప్యాకేజీలో భాగంగా అయోధ్య, ప్రయోగరాజ్, వారణాసి, పూరి, కోణార్క్, బైద్యనాథ్ రామ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర డిసెంబర్ 14వ తేదీ వరకు ఉంటుంది. ఈ ప్రత్యేక రైలుకు సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీలో విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో బోర్డింగ్ సదుపాయం ఉంటుంది. టికెట్ల విషయానికొస్తే.. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.17 వేలు, థర్డ్ ఏసీ రూ.26,400, సెకండ్ ఏసీ రూ.34,400గా ఉంది.
జ్యోతిర్లింగ దర్శన ప్రత్యేక యాత్ర
ఏడు జ్యోతిర్లింగ దర్శన యాత్రను కూడా ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పూణేలోని భీమశంకర్, నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ , ఛత్రపతి శంభాజీనగర్‌లోని గృష్ణేశ్వర్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ద్వారకలోని నాగేశ్వర్, సోమనాథ్ దర్శనం కల్పిస్తారు. డిసెంబర్ 17 నుంచి 27 వరకు ఈ యాత్ర ఉంటుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ స్టేషన్లలో బోర్డింగ్ సౌకర్యం ఉంటుంది. ఇక మరొకటి దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర. ఇందులో భాగంగా తిరువణ్ణామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, చిదంబరం, తిరుచ్చి, తంజావూరు ఆలయాలను దర్శించుకోవచ్చు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులకు స్థానికంగా పర్యటన కోసం ఏసీ బస్సుల సౌకర్యం ఉంటుంది. అలాగే ఉండటం కోసం హోటల్ రూమ్ సౌకర్యం కల్పిస్తారు. అలాగే భోజన సౌకర్యం కూడా టికెట్ ధరలోనే ఉంటుంది. కానీ దేవాలయాల దర్శనం టికెట్లు, పర్యాటక ప్రదేశాల ఎంట్రన్స్ టికెట్లు వంటివి ప్రయాణికులే భరించుకోవాలి. అలాగే ప్రతీ కోచులో సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు.
