కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసే బలమైన ఫుడ్.. ప్రపంచం మొత్తం దీనివెంటే
జొన్న రొట్టె సంప్రదాయ ఆహారమే కాకుండా పోషకాలు అందించే ఆరోగ్యకరమైన ఎంపిక. జొన్నల్లో పీచుపదార్థం, ప్రోటీన్లు, ఇనుము, ఫాస్ఫరస్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పీచుపదార్థం రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నేటి ఆధునిక ప్రపంచంలో చిత్ర విచిత్రమైన రోగాలు, ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి, తీసుకునే ఆహారం విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఒకప్పుడు విస్మరించబడిన లేదా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బలవర్ధకమైన సంప్రదాయ ఆహార పదార్థాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో జొన్న రొట్టె అనూహ్యమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఇంతకుముందు కేవలం గోధుమ చపాతీలను మాత్రమే తినేవారు సైతం ఇప్పుడు జొన్న రొట్టెలను తమ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రపంచమంతా ఈ జొన్న రొట్టె వెంటే పడటానికి బలమైన ఆరోగ్య కారణాలు ఉన్నాయి.
జొన్న రొట్టె అందరికీ అన్ని రకాల తిండ్లు అరగని, కొన్నిసార్లు ప్రమాదకరం కూడా కాగల ఈ కాలంలో, ఎలాంటి శరీరం ఉన్నవారికైనా ఉత్తమమైన ఆహారం. దీనిని “చీప్ అండ్ బెస్ట్” అనే మాటతో సరిపోల్చవచ్చు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి జొన్న రొట్టెలు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
జొన్న రొట్టెలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించే గుణం కలిగి ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే శక్తి జొన్నలకు ఉంది. అంతేకాకుండా, జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి కూడా జొన్న రొట్టెలు సహాయపడతాయి.
ఎన్నో పోషకాలు..
పోషకాల విషయానికి వస్తే, జొన్నలు అత్యంత బలవర్ధకమైన ఆహారం.. బియ్యం, గోధుమలతో పోలిస్తే జొన్నల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలాగే, ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్థాలు (ఫైబర్) వంటి పోషకాలు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇనుము రక్తహీనతను నివారించగా, ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జొన్నల్లో ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించి, కణాలను రక్షిస్తాయి. ఒక కప్పు జొన్నల్లో ఎముకలు బలిష్టంగా ఉంచడానికి అవసరమైన ఫాస్ఫరస్ లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం కూడా జొన్నలకు ఉంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.. తద్వారా తరచుగా వచ్చే అనారోగ్యాల బారిన పడకుండా రక్షిస్తుంది.
వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలను జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గించుకోవచ్చు. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ శక్తిని పెంపొందించి, అందుకు అవసరమైన హార్మోన్లను వృద్ధి చేస్తాయి. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును సక్రమంగా ఉంచుతుంది. అంతేకాక, లైంగిక శక్తి పెంపుదలకు, సంతాన ఉత్పత్తికి సైతం జొన్నలు అమృతం లాంటివిగా పరిగణిస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో జొన్న పిండితో చేసిన రొట్టెలను విరివిగా తీసుకుంటారు. సమగ్ర ఆరోగ్యానికి జొన్న రొట్టె ఒక సంపూర్ణ ఆహారం అని చెప్పవచ్చు.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
