Tea Bags: వామ్మో.. కొంపముంచుతున్న టీ బ్యాగ్‌లు! నిత్యం కోట్లాది ప్లాస్టిక్ కణాలు కడుపులోకి

|

Dec 29, 2024 | 12:47 PM

నిద్ర లేచింది మొదలు మళ్లీ పడక మీదకి చేరేంత వరకు చాలా మంది లెక్కకు మించి టీ, కాపీలు లాగించేస్తుంటారు. గతంలో ఫిల్టర్ టీలు, కాఫీలు ఉండేవి. నేటి కాలంలో అన్నీ ఇన్ స్టంట్ వచ్చేశాయి. దీంతో జబ్బులు కూడా ఇన్ స్టంట్ వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా టీ తయారీకి వినియోగించే టీ బ్యాగ్ లు మనకు తెలియకుండానే మన ఆయుష్శును హరించేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది..

Tea Bags: వామ్మో.. కొంపముంచుతున్న టీ బ్యాగ్‌లు! నిత్యం కోట్లాది ప్లాస్టిక్ కణాలు కడుపులోకి
Tea Bags
Follow us on

నేటి కాలంలో టీ బ్యాగ్‌ల వినియోగం సర్వసాధారణమై పోయింది. వీటితో టీ తయారీ ఎంతో సౌకర్యవంతంగా, సులభంగా ఉంటుంది. అయితే దీని వెనుక భయంకరమైన పెను ప్రమాదం పొంచి ఉంది. అవును.. టీ బ్యాగ్‌లలో ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అంశాలున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. టీ బ్యాగ్‌ల బయటి పొరకు ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పాలీమర్ ఆధారిత పదార్థాలతో తయారు చేయబడిన వాణిజ్య టీ బ్యాగ్‌లు మిలియన్ల కొద్దీ నానోప్లాస్టిక్‌లు, మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి. అంతేకాకుండా దీనిని ఉపయోగించినప్పుడు మిలియన్ల కొద్దీ మైక్రోప్లాస్టిక్‌లు టీ కప్పులోకి విడుదలవుతాయి.

అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా అధ్యయనం ప్రకారం.. ఫుడ్ ప్యాకేజింగ్ మైక్రో అండ్‌ నానోప్లాస్టిక్ (MNPL) కాలుష్యానికి ప్రధాన మూలం. ఈ నానోప్లాస్టిక్, మైక్రోప్లాస్టిక్ కణాలు మన పేగు కణాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి ఇవి రక్త కణాల్లో చేరి శరీరంలోని ఇతర భాగాల్లో పేరుకుపోతాయి. ఈ టీ బ్యాగ్‌లను ఇన్ఫ్యూషన్ కోసం ఉపయోగించినప్పుడు పెద్ద మొత్తంలో నానో-సైజ్ కణాలు, నానోఫిలమెంటస్ కణాలు విడుదలయ్యాయని UAB పరిశోధకులు చెబుతున్నారు.

పరిశోధనలో ఉపయోగించిన టీ బ్యాగ్‌లు నైలాన్-6, పాలీప్రొఫైలిన్, సెల్యులోజ్ వంటి పాలిమర్‌లతో తయారు చేసినవి. టీ తయారుచేసేటప్పుడు, పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్‌కు దాదాపు 1.2 బిలియన్ కణాలను విడుదల చేస్తుంది. సగటు పరిమాణం 136.7 నానోమీటర్లు. సెల్యులోజ్ ఒక మిల్లీలీటర్‌కు 135 మిలియన్ కణాలను విడుదల చేస్తుంది. వీటి సగటు పరిమాణం 244 నానో మీటర్లు. నైలాన్-6 ఒక మిల్లీలీటర్‌కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తుంది. వీటి సగటు పరిమాణం 138.4 నానోమీటర్లు. కాబట్టి ఇలాంటి టీ బ్యాగ్‌లు మానవ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని, వీటిని తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.