ఉల్లిపాయలను ఇలా కోస్తే కళ్ల మంట అనేదే ఉండదు.. ఎవ్వరు చెప్పని కిచెన్ సీక్రెట్స్
భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ లేకపోతే ఆ రుచే మారేపోతుంది. ఆరోగ్యం విషయానికొస్తే దీనికి తిరుగులేదు. కానీ ఇంతటి రుచిని ఇచ్చే ఉల్లిపాయను కోయాలంటే మాత్రం ప్రతి ఒక్కరి కళ్ల వెంట నీళ్లు రాక మానవు. అయితే వంటింట్లో ఏడ్చే పని లేకుండా ఈజీగా ఉల్లిపాయలను ఎలా కట్ చేయాలో మీకు తెలుసా? అనే విషయాలు తెలుసుకుందాం..

భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ లేని కూర ఉండడం చాలా అరుదు. కూరల రుచిని పెంచడమే కాకుండా విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇంతటి విలువైన ఉల్లిపాయను కోయాలంటే మాత్రం చాలా మంది భయపడతారు. కత్తి తగలగానే కళ్ల నుంచి నీళ్లు కారడం, కళ్లు మంటలు పుట్టడం అందరికీ ఎదురయ్యే సమస్యే. అసలు ఉల్లిపాయ కోస్తే కళ్లలో నీళ్లు ఎందుకు వస్తాయి? ఆ సమస్యకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కళ్లలో నీళ్లు ఎందుకు వస్తాయి?
మనం ఉల్లిపాయను కట్ చేసినప్పుడు, దానిలోని కణాల విచ్ఛిన్నమై ఒక ప్రత్యేకమైన గ్యాస్ విడుదలవుతుంది. ఈ వాయువు మన కంటిపై ఉంటే సహజ ద్రవాన్ని తాకినప్పుడు కళ్లలో చికాకు పుడుతుంది. దాంతో కంటిని రక్షించుకోవడం కోసం మన మెదడు కన్నీటి గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా కళ్ల వెంట నీళ్లు వస్తాయి. ఇది శరీరం జరిపే చాలా సాధారణ ప్రక్రియ.
ఏడుపు రాకుండా ఉల్లిపాయ కోయడం ఎలా?
ఫ్రిజ్‌లో పెట్టండి: ఉల్లిపాయలు కోయడానికి ఒక 15 నుంచి 20 నిమిషాల ముందు వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. చల్లదనం వల్ల ఉల్లిపాయ నుండి ఆ చికాకు కలిగించే వాయువు విడుదలయ్యే వేగం చాలా వరకు తగ్గుతుంది.
పదునైన కత్తిని వాడండి: మొద్దుబారిన కత్తితో కోస్తే ఉల్లిపాయ కణాలు ఎక్కువగా నలిగిపోయి, ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ బాగా పదునుగా ఉన్న కత్తినే వాడండి.
గాలి ప్రసరించే చోట కోయండి: ఉల్లిపాయలు తరిగేటప్పుడు కిటికీలు తెరిచి ఉంచడం లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్, చిమ్నీ ఆన్ చేయడం మంచిది. దీనివల్ల ఆ వాయువు కళ్ల దాకా రాకుండా త్వరగా బయటకు పోతుంది.
అడుగు కత్తిరించండి: ఉల్లిపాయ ఉండే గట్టి వేరునే ఈ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ తర్వాతన కట్ చేయడం ఉత్తమం.
కళ్లజోడు ధరించడం: ఉల్లిపాయలు ఎక్కువగా కోయాల్సి వచ్చినప్పుడు కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ఆ వాయువు నేరుగా కళ్లపై పడకుండా అడ్డుకోవచ్చు.
ఉల్లిపాయలు కోసేటప్పుడు చేయకూడని పొరపాట్లు..
- మూసి ఉన్న గదిలో లేదా గాలి వెలుతురు సరిగ్గా లేని చోట ఉల్లిపాయలు కోయకూడదు.
- ఉల్లిపాయలు కోస్తున్నంత సేపూ చేతులతో కళ్లను పదే పదే రుద్దకూడదు. దీనివల్ల కంటి మంట మరింత పెరుగుతుంది.
- చేతులకు ఉల్లిపాయ రసం అంటుకుంటే.. పొరపాటున కూడా కళ్లను తాకవద్దు. ఒకవేళ తాకాల్సి వస్తే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతే తాకాలి.
- ఒకేసారి పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను తరిగి పెట్టుకోకుండా, అవసరమైన మేరకే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం మంచిది.
ఉల్లిపాయలు కోయడం ఒక పెద్ద టాస్క్‌లా భావించే వారికి ఈ చిన్న చిట్కాలు వంటి వాటిలో ఎంతో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ టైం ఉల్లిపాయ కోసేటప్పుడు వీటిని ట్రై చేసి చూడండి..
