AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం.. గుమ్మడి గురించి ఈ నిజాలు తెలిస్తే..

రోజంతా కంప్యూటర్ స్క్రీన్లు చూసి కళ్లు లాగుతున్నాయా? వేళాపాలాలేని తిండితో కడుపుబ్బరం, మలబద్ధకం వేధిస్తున్నాయా? అయితే మీ వంటింట్లో సులభంగా దొరికే గుమ్మడికాయను అస్సలు తక్కువ అంచనా వేయకండి.. కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా జీర్ణవ్యవస్థను గాడిలో పెట్టే ఈ పోషకాల గని గురించి ప్రముఖ డైటీషియన్లు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం.. గుమ్మడి గురించి ఈ నిజాలు తెలిస్తే..
Pumpkin Health Benefits
Krishna S
|

Updated on: Oct 11, 2026 | 9:43 PM

Share

రోజూవారీ ఉరుకులు పరుగుల జీవితం, వేళాపాలాలేని ఆహారపు అలవాట్లతో చాలామంది కడుపుబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో పాటు కంటి అలసటను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు వంటింట్లో సులభంగా లభించే గుమ్మడికాయ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గుమ్మడికాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కంటిచూపుకు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయను కేవలం ఒక కాలానుగుణ కూరగాయగానే చూస్తారని, కానీ పోషకాలపరంగా ఇది శరీరానికి అత్యంత మేలు చేసే ఆహారమని ఫర్ ట్రైనర్స్ వ్యవస్థాపకురాలు, రిజిస్టర్డ్ డైటీషియన్ లారెన్ స్లేటన్ స్పష్టం చేశారు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండి బీటా-కెరోటిన్, పీచుపదార్థం వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి.

పోషకాల భాండాగారం

గుమ్మడికాయలో పుష్కలంగా ఉండే ప్రధాన పోషకం విటమిన్ ఎ. ఒక్క కప్పు గుమ్మడికాయ శరీరానికి రోజూ అవసరమయ్యే విటమిన్ ఎలో దాదాపు 78 శాతాన్ని అందిస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారి కంటిచూపును మెరుగుపరుస్తుంది. సుమారు ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జులో దాదాపు 49 కేలరీలు, 3 గ్రాముల ఫైబర్, 12 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటాయి. కొవ్వు చాలా తక్కువగా ఉండే ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, రాగి వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి.

గుమ్మడికాయతో కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు..

కంటిచూపుకు రక్షణ: ఇందులోని కెరోటినాయిడ్లు, బీటా-కెరోటిన్ వయసు పెరిగే కొద్దీ వచ్చే దృష్టి లోపాలను నివారిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుదల: అధిక ఫైబర్ ఉండటం వల్ల ప్రేగులలోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది, మలబద్ధకం సమస్య తొలగిపోయి మలవిసర్జన సాఫీగా సాగుతుంది.

రోగనిరోధక శక్తి పెంపు: విటమిన్ ఎ, విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

గుండె ఆరోగ్యం, బీపీ నియంత్రణ: ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి, కండరాల పనితీరును మెరుగుపరుస్తూ గుండెను రక్షిస్తుంది.

బరువు నియంత్రణ: తక్కువ కేలరీలు, ఎక్కువ పీచుపదార్థం ఉండటం వల్ల దీనిని తిన్న తర్వాత చాలాసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో అతిగా తినడం, అనవసరమైన చిరుతిళ్లు తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు.

ఎలా తింటే ఎక్కువ ప్రయోజనం?

గుమ్మడికాయలోని బీటా – కెరోటిన్ కొవ్వులో కరిగే పోషకం. కాబట్టి శరీరం దీనిని పూర్తిగా గ్రహించాలంటే ఆలివ్ నూనె, అవకాడో లేదా నట్స్‌ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకోవడం మంచిది. అలాగే కాయధాన్యాలు, బీన్స్‌తో కలిపి వండుకోవడం వల్ల మరింత పౌష్టికాహారంగా మారుతుంది. దీనిని కూర, జ్యూస్ లేదా ఇతర వంటకాల రూపంలో తీసుకోవచ్చు.

తాజా గుమ్మడికాయ లేదా ప్యూర్ గుజ్జు.. ఏది ఉత్తమం?

ఇంట్లో వండిన తాజా గుమ్మడికాయకు, అదనపు చక్కెరలు కలపని క్యాన్డ్ ప్యూర్ గుమ్మడికాయ గుజ్జుకు పోషక విలువల పరంగా పెద్ద తేడా ఉండదు. తాజా కాయలు దొరకని పరిస్థితుల్లో ఎటువంటి రసాయనాలు లేదా చక్కెరలు లేని 100 శాతం సహజసిద్ధమైన గుమ్మడికాయ గుజ్జును నిల్వ చేసుకుని ఏడాది పొడవునా వివిధ వంటకాల్లో నిరభ్యంతరంగా వాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Follow Us