తన మరణానంతర సంతాప సభను ముందే జరుపుకున్న బామ్మ.. కారణమేంటంటే?
సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తారు. మరణించిన వ్యక్తి గురించి తమకున్న అనుబంధాన్ని, ప్రేమను మాటల్లో వ్యక్తం చేస్తారు. అయితే ఆ మాటలను వినే అవకాశం మాత్రం ఆ వ్యక్తికి ఉండదు. కానీ అమెరికాకు చెందిన ఓ 80 ఏళ్ల బామ్మ మాత్రం తన గురించి నలుగురూ ఏం మాట్లాడుకుంటారో తాను బతికుండగానే వినాలనుకుంది. తన సంతాప సభను ముందే ఏర్పాటు చేసుకుంది.

అమెరికాలోని జార్జియా రాష్ట్రం, మాకాన్‌కు చెందిన షెల్వీ నీల్ అనే 80 ఏళ్ల మహిళకు తన మరణం తర్వాత జరిగే సంతాప సభకు తాను హాజరుకాలేననే ఆలోచన వచ్చింది. తన గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పే మంచి మాటలను తాను కూడా వినాలనుకుంది. అందుకే తనకోసం తానే ఓ స్మారక వేడుకను ఏర్పాటు చేసుకుంది. కార్యక్రమానికి ‘FOMO Funeral’ అని పేరు పెట్టింది. FOMO అంటే ‘Fear Of Missing Out’. అంటే జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలను కోల్పోతామనే భయం. తన గురించి ఇతరులు చెప్పే మంచి మాటలను వినే అవకాశాన్ని కోల్పోవడం ఇష్టం లేకే షెల్వీ ఈ ఆలోచన చేసినట్లు తెలిపింది.
కుటుంబ సభ్యుల మద్దతుతో ప్రత్యేక ఏర్పాట్లు
షెల్వీ తన ఆలోచనను కుమార్తె టామీ క్రచ్‌ఫీల్డ్‌తో పంచుకుంది. మొదట ఇది వింతగా అనిపించినప్పటికీ, తల్లి కోరికను అర్థం చేసుకున్న కుమార్తె ఆమెకు మద్దతుగా నిలిచింది. ఇద్దరూ కలిసి కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. షెల్వీ, ఆమె దివంగత భర్త దాదాపు 25 ఏళ్లపాటు నివసించిన ఇంట్లోనే ఈ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు సహా సుమారు 100 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణంగా సంతాప సభల్లో కనిపించే విషాద వాతావరణానికి భిన్నంగా ఈ వేడుక నవ్వులు, పాటలు, ఆత్మీయ జ్ఞాపకాలతో సందడిగా సాగింది. షెల్వీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కరు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆమె తమ జీవితాల్లో ఎలాంటి స్థానం సంపాదించుకుందో వివరించారు.
శవపేటికలో బామ్మ ఫొటో కటౌట్.. కేక్‌పై ఆసక్తికర సందేశం!
ఈ వేడుకలో షెల్వీకి సంబంధించిన ఓ కటౌట్‌ను శవపేటికలో ఉంచారు. కేక్‌పై రాసిన సందేశం అందరినీ ఆకట్టుకుంది. తన అంత్యక్రియలను కూడా మిస్ కావడానికి ఇష్టపడని మహిళగా షెల్వీని అభివర్ణిస్తూ సందేశాన్ని రాశారు. తన స్మారక వేడుకకు తనే హాజరై, తన గురించి ఇతరులు చెప్పే మాటలను వినాలనుకున్న ఆమె ఆలోచనను ఈ వేడుక ప్రతిబింబించింది. తన గురించి ఇతరులు మంచి మాటలు చెప్పినా, విమర్శించినా తాను స్వయంగా వినాలనుకుంటున్నట్లు షెల్వీ చెప్పింది. ఎవరైనా తన గురించి చెడుగా మాట్లాడితే మైక్‌ను ఆపేయడానికి కూడా వెనుకాడనని సరదాగా వ్యాఖ్యానించింది. అంత్యక్రియలు అంటే విషాదంతోనే ఉండాల్సిన అవసరం లేదని, ఆనందంగా జరుపుకోవచ్చని తన ఆలోచనతో చాటిచెప్పింది.
జీవితాన్ని ప్రేమించాలనే సందేశం!
మన గురించి మనస్ఫూర్తిగా చెప్పే మంచి మాటలను మనం బతికున్నప్పుడే వినగలిగితే, ఆ ఆనందమే వేరు కదా! అందుకే షెల్వీ తన 80వ పుట్టినరోజును సాధారణ వేడుకలా కాకుండా, జీవితంలోని మధుర జ్ఞాపకాలను అందరితో పంచుకునే ప్రత్యేక సందర్భంగా మార్చుకుంది. షెల్వీ నీల్ నిర్వహించిన ఈ ‘FOMO Funeral’ కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరణం గురించి భయపడకుండా, బతికున్నప్పుడే మనుషుల మధ్య ప్రేమను, అనుబంధాన్ని ఆస్వాదించాలనే సందేశాన్ని ఆమె ఆలోచన అందిస్తోంది.