గుమ్మడి గింజలు – కంటిచూపుకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఇవి తెలిస్తే అవాక్కే..
గంటల తరబడి మొబైల్ స్క్రోలింగ్.. కంప్యూటర్ స్క్రీన్ల వైపు నిరంతరం చూడటం.. ఫలితంగా చిన్న వయసులోనే కంటి సమస్యలు ప్రతి ఇంటా సర్వసాధారణం అయిపోయాయి. ఈ క్రమంలో కళ్లద్దాలు దూరం కావాలంటే ఏం తినాలి? అని చాలా మంది వెతుకుతుంటారు. అయితే మన వంటింట్లోనే దొరికే గుమ్మడి, అవిసె గింజలతో కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు..

నేటి డిజిటల్ యుగంలో చిన్న వయస్సులోనే మసక దృష్టి, కంటి అలసట, కళ్లు పొడిబారడం, డిజిటల్ కంటి ఒత్తిడి వంటి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. గంటల తరబడి కంప్యూటర్లు, మొబైల్ స్క్రీన్ల వైపు చూడటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో కొన్ని రకాల ఆహారాలు తింటే కళ్లద్దాలు అవసరం ఉండదు అనే నమ్మకంతో చాలా మంది రకరకాల చిట్కాలను వెతుకుతుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల పోషక ఆహారాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో దృష్టి లోపాల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. ముఖ్యంగా అవిసె గింజలు, గుమ్మడి గింజలు కంటి చూపు మెరుగుపడటానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజలతో కంటి తడికి భద్రత..
అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, విటమిన్ ఇ, లిగ్నాన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటిలోని రెటీనా ఆరోగ్యాన్ని కాపాడటానికి, ముఖ్యంగా కళ్లు పొడిబారే సమస్యను తగ్గించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కంటి వాపును తగ్గించి, కన్నీటి నాణ్యతను పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుమ్మడి గింజలతో రెటీనాకు బలం..
గుమ్మడి గింజలలో జింక్, మెగ్నీషియం, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి రెటీనా పనితీరు సరిగ్గా ఉండటానికి జింక్ అత్యంత కీలకమైన పోషకం. ఇది వయసు పెరగడం వల్ల వచ్చే దృష్టి లోపాలను నివారిస్తుంది. ఈ గింజలను లైట్‌గా వేయించుకుని తినవచ్చు లేదా సలాడ్లు, పెరుగు, స్మూతీలు, ఓట్స్‌లో కలుపుకుని తీసుకోవచ్చు.
కంటి చూపును మెరుగుపరిచే ఇతర ముఖ్య ఆహారాలు..
కేవలం గింజలు మాత్రమే కాకుండా, రోజూవారీ డైట్‌లో కింది వాటిని చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది:
క్యారెట్లు – చిలగడదుంపలు: వీటిలో కంటికి మేలు చేసే బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.
ఆకుకూరలు : వీటిలోని లుటీన్ మరియు జీక్సాంథిన్ కంటి కణాలను రక్షిస్తాయి.
చేపలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల నిధి.
సిట్రస్ పండ్లు: వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
గుడ్లు, బాదం, వాల్‌నట్లు.
దృష్టి మసకబారడానికి ప్రధాన కారణాలు..
కంటి చూపు మసకబారడానికి కేవలం స్క్రీన్లు చూడటమే కాకుండా కింది ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు..
- దగ్గరి దృష్టి లేదా దూర దృష్టి లోపాలు.
- డ్రై ఐ సిండ్రోమ్, కంటిశుక్లం.
- మధుమేహం వల్ల కలిగే కంటి జబ్బులు లేదా గ్లాకోమా.
- మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌ను మితిమీరి ఉపయోగించడం.
కంటి ఆరోగ్యం కోసం ఈ 5 సులభమైన అలవాట్లను పాటించండి..
20-20-20 నియమం: కంప్యూటర్ చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.
తగినంత నిద్ర: రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర కళ్లకు విశ్రాంతిని ఇస్తుంది.
పుష్కలంగా నీరు: శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తాగితే కళ్లు పొడిబారవు.
సన్‌గ్లాసెస్ వాడకం: ఎండలోకి వెళ్లేటప్పుడు హానికరమైన యూవీ కిరణాల నుండి రక్షణ ఇచ్చే సన్‌గ్లాసెస్ ధరించాలి.
రెగ్యులర్ చెకప్: సంవత్సరానికి ఒకసారైనా కంటి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
ఆరోగ్యకరమైన ఆహారం కంటి చూపును కాపాడుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. అయితే అవిసె గింజలు లేదా గుమ్మడి గింజలు తింటే కళ్లద్దాల అవసరం పూర్తిగా తొలగిపోతుందనే వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పని కంటి పరీక్షలు మాత్రమే మంచి దృష్టిని కాపాడుకోవడానికి ఉన్న అసలైన మార్గాలు.
