AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కునోలో చీతాల జోరు.. ఒకేసారి 5 కూనలకు జన్మనిచ్చిన భారత ఆడ చీతా!

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో ప్రాజెక్ట్ చీతాలో కీలక విజయం నమోదైంది. భారత గడ్డపై పుట్టిన ఆడ చీతా KJP21 ఒకేసారి ఐదు ఆరోగ్యకరమైన కూనలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో మొత్తం చీతాల సంఖ్య 60కి చేరగా, ఇందులో 41 భారతీయ జన్మించినవే. బోట్స్‌వానా వంశానికి చెందిన కొత్త తరంతో, ప్రాజెక్ట్ చీతా లక్ష్యాలు మరింత బలోపేతమయ్యాయి. చీతాల సంరక్షణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.

కునోలో చీతాల జోరు.. ఒకేసారి 5 కూనలకు జన్మనిచ్చిన భారత ఆడ చీతా!
Cheetah Cubs Born In India
Balaraju Goud
|

Updated on: Oct 05, 2026 | 5:17 PM

Share

భోపాల్‌: భారత్‌లో చీతాల పునఃప్రవేశ కార్యక్రమమైన ప్రాజెక్ట్‌ చీతాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో భారతదేశంలోనే జన్మించిన ఓ ఆడ చీతా ఐదు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ తాజా జననాలతో దేశంలోని మొత్తం చీతాల సంఖ్య 60కి చేరింది. ఇందులో భారతదేశంలో పుట్టిన చీతాలు 41 ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో భారత్‌లో చీతాల సంఖ్య పెరగడమే కాకుండా.. దేశంలోనే పుట్టి పెరుగుతున్న చీతాల కొత్త తరం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

బోట్స్‌వానా వంశానికి కొత్త తరం..!

32 నెలల వయసున్న KJP21 అనే ఆడ చీతా ఈ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దేశంలో జన్మించిన ఆడ చీతాల్లో పిల్లలకు జన్మనిచ్చిన మూడో చీతాగా KJP21 గుర్తింపు పొందింది. ఇంతకుముందు ముఖి, KGP12 అనే ఆడ చీతాలు భారత్‌లో పిల్లలకు జన్మనిచ్చాయి. ఈ ఐదు పిల్లల జననానికి మరో ప్రత్యేకత ఉంది. వీటి తండ్రి బోట్స్‌వానాకు చెందిన మగ చీతా. దీంతో భారత గడ్డపై బోట్స్‌వానా వంశానికి చెందిన కొత్త చీతా తరం ఆవిర్భవించినట్లవుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. ఈ పరిణామం భారత చీతాల జనాభాలో కొత్త జన్యు వంశాన్ని చేర్చడంలో కీలకంగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో స్థిరమైన చీతా జనాభాను ఏర్పాటు చేయాలన్న ప్రాజెక్ట్‌ చీతా లక్ష్యాలకు ఇది మరింత బలం చేకూరుస్తుందని అన్నారు.

ప్రాజెక్ట్‌ చీతాకు మరో విజయంగా..!

చీతాల పునఃప్రవేశ కార్యక్రమంలో భాగంగా కునో జాతీయ పార్కులో చీతాల సంరక్షణ, పర్యవేక్షణ కొనసాగుతోంది. తాజా జననాలతో భారత్‌లో చీతాల సహజ సంతానోత్పత్తి ప్రక్రియ మరింత బలపడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చీతాల సంరక్షణలో కీలకంగా పనిచేస్తున్న పశువైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు, మేనేజర్లు, ఇతర సిబ్బంది అంకితభావాన్ని భూపేందర్‌ యాదవ్‌ అభినందించారు. చీతాల తదుపరి తరాన్ని రక్షిస్తూ.. దేశంలో దీర్ఘకాలికంగా స్థిరమైన చీతాల జనాభాను ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఐదు పిల్లల జననం మరో ముఖ్యమైన అధ్యాయమని పేర్కొన్నారు.

కునోలో ఇప్పటికే పుట్టిన చీతాల సంఖ్య పెరుగుతుండటం.. భారత్‌లో ప్రాజెక్ట్‌ చీతా భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. కొత్తగా జన్మించిన ఐదు పిల్లల ఆరోగ్య పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us