ఇటీవల కాలంలో చాలా మందికి చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోతుంది. దీంతో కొందరు జుట్టుకు రంగు వేసుకుంటే, మరికొందరు తెల్లజుట్టు దానంతట అదే పోతుందిలే అని అలాగే వదిలేస్తుంటారు. ఇంతకుముందు ఈ సమస్య వృద్ధులలో కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు మొదలు యుక్తవయసు వారి వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. 30 నుంచి 35 ఏళ్లలోపు వెంట్రుకలు నెరిసిపోవడమే కాదు.. పది-పన్నెండేళ్ల లోపు చిన్నారులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అలా చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడగటం పెద్ద ప్రమాదం ఏమీ కాదు. కినా మీరూ ఈ సమస్యతో బాధపడపుతుంటే దీనికి కారణం ఏమిటో? ఏం చేస్తే తెల్లగా మారిన జుట్టు నల్లగా మారుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
శరీరంలో విటమిన్ల లోపం జుట్టు రాలిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ బి 12, విటమిన్ డి, విటమిన్ బి 9 లోపం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోవడమేకాకుండా నెరిసిపోతుంది కూడా. దీనిపై ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ ఓ నివేదికను ప్రచురించింది. అందులో చిన్న వయసులోనే జుట్టు తెల్లగా లేదా గోధుమ రంగులోకి మారడానికి, ఆ తర్వాత రాలిపోవడానికి విటమిన్ లోపమే ప్రధాన కారణమని రుజువు చేసింది.
ఆయుర్వేద వైద్యుడు డా. ఆర్. పి. పరాశరుడు ప్రకారం.. శరీరంలో పిత్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారి వెంట్రుకలు చిన్నవయసులోనే తెల్లగా మారుతాయి. అంతేకాదు చిన్న వయసులో జుట్టు నెరసిపోవడానికి ఆహారం కూడా ప్రధాన కారణం. పిత్తం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల జుట్టు మూలాలు దెబ్బతింటాయి. దీంతో జుట్టు నెరిసిపోతుంది. పిత్తం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల శరీరంలో మెలనిన్ లోపం ఏర్పడుతుంది. తరువాత అది జుట్టు రంగును ప్రభావితం చేస్తుంది. మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం మంచిది.
విటమిన్ బి12, బి9 లోపం రాకుండా ఉండాలంటే ఆకుకూరలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి అంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాకుండా, గుడ్లు, సాల్మన్ చేపలను కూడా తినవచ్చు. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి పాలు, పెరుగు, గుడ్లు తినవచ్చు. అయితే దానికంటే ముందు విటమిన్ బి12, విటమిన్ డి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. ఈ విటమిన్ లోపిస్తే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. వీటివల్ల విటమిన్ లోపాన్ని సులభంగా అధిగమించవచ్చు.