మాతృత్వం అనేది ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. గర్భధారణ సమయంలో మహిళా శరీరంలో ఎన్నో శారీరక, మానసిక మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే, ప్రసవం జరిగిన వెంటనే శరీరం సాధారణ స్థితికి రాదు. దానికి కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. ఈ క్రమంలో బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో అవసరం.
ప్రసవం తర్వాత తల్లి శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. ఈ సమయంలో పౌష్టికాహారం, తగినంత విశ్రాంతితో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. గర్భధారణ సమయంలో మూడు అంగుళాల నుంచి 20 అంగుళాల వరకు సాగిన గర్భాశయం, ప్రసవం తర్వాత క్రమంగా సంకోచిస్తూ ఆరు వారాలకు తన పూర్వ స్థితికి చేరుకుంటుంది. పొట్ట కండరాలు వదులై చర్మంపై స్ట్రెచ్‌మార్క్స్ రావచ్చు. వీటి కోసం ఆలివ్ ఆయిల్ లేదా మాయిశ్చరైజర్లు వాడటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
బాలింతల్లో కనిపించే సాధారణ సమస్యలు – పరిష్కారాలు
కాన్పు తర్వాత 24 గంటల నుంచి 10 రోజుల లోపు వచ్చే జ్వరాన్ని బాలింత జ్వరం అంటారు. జననాంగాల్లో ఇన్ఫెక్షన్ లేదా రక్తహీనత దీనికి కారణం కావచ్చు. వైద్యుల సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడాలి.
పాలు సరిగ్గా పట్టకపోవడం వల్ల లోపల గడ్డకట్టి చీము పట్టే అవకాశం ఉంది. బిడ్డకు పాలు పట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రసవం సమయంలో నరాలపై ఒత్తిడి వల్ల మూత్ర విసర్జనపై నియంత్రణ తగ్గవచ్చు. పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు దీనికి మంచి పరిష్కారం. తగినంత నీరు, పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
హార్మోన్ల మార్పులు, ఆందోళన వల్ల ప్రసవం తర్వాత కొందరిలో డిప్రెషన్ రావచ్చు. కుటుంబ సభ్యుల ఆప్యాయత, సహకారం దీనిని అధిగమించడానికి తోడ్పడతాయి.
పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
బాలింతకు రోజూ కంటే 600 కేలరీలు అదనంగా శక్తినిచ్చే పౌష్టికాహారం ఇవ్వాలి. ఆకుకూరలు, పప్పులు, పాలు, పండ్లు తప్పనిసరి. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి.
ప్రసవం తర్వాత అలసట తగ్గడానికి తగినంత నిద్ర అవసరం. బిడ్డను తల్లి పక్కనే పడుకోబెట్టడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది.
ఇన్ఫెక్షన్లు రాకుండా జననాంగాలను గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఉంచుకోవాలి. యోని స్రావాల్లో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
సాధారణ కాన్పు తర్వాత త్వరగా నడవడం మొదలుపెడితే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే (ఎంబాలిజమ్) ప్రమాదం తప్పుతుంది.
మొదటి ఆరు నెలలు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మొదటి రెండు రోజులు వచ్చే ‘జున్ను పాలు’ (కొలెస్ట్రమ్) బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కాన్పు తర్వాత ఆరు వారాలకు ఒకసారి తప్పనిసరిగా డాక్టర్ చెకప్‌కు వెళ్లాలి. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఎదుగుదల బాగుంటుందని గుర్తుంచుకోవాలి.