చెత్తబుట్టలో పడేసే ఉల్లిపాయ పొట్టుతో అద్భుతమైన ఎరువు.. మొక్కలు ఏపుగా పెరగాలంటే ఇలా చేయండి!
ఇంట్లో మొక్కలను అందంగా, పచ్చగా పెంచడానికి ఖరీదైన ఎరువులు కొనవలసిన అవసరం లేదు. ప్రతిరోజూ వంటగదిలో వ్యర్థంగా పారవేసే ఉల్లిపాయ పొట్టుతో అత్యంత శక్తివంతమైన ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది మొక్కల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ పొట్టుతో శక్తివంతమైన ఆర్గానిక్ ఎరువు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ప్రతి ఇంటి వంటగదిలో ఉల్లిపాయలు సర్వసాధారణంగా ఉపయోగిస్తాము. అయితే, వాటి పొట్టును చాలా మంది చెత్తబుట్టలో పడేస్తుంటారు. ఈ పొట్టులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని ఉపయోగించి మొక్కలకు ఉచితంగా మరియు సులభంగా సహజమైన ఎరువును ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
అవసరమైన పదార్థాలు:
ఉల్లిపాయల పొడి పొట్టు సరిపడా
శుభ్రమైన నీరు
ఒక క్లీన్ ప్లాస్టిక్ కంటైనర్ లేదా బాటిల్
ఎరువు తయారీ విధానం:
ముందుగా ఒక శుభ్రమైన కంటైనర్‌ను తీసుకుని, అందులో సేకరించిన ఉల్లిపాయ పొట్టును నింపండి. ఆ పొట్టు పూర్తిగా మునిగేలా తగినంత నీటిని ఆ కంటైనర్‌లో పోయాలి. ఇప్పుడు కంటైనర్‌కు గట్టిగా మూత పెట్టి, నేరుగా ఎండ తగలకుండా ఉండే నీడ ప్రాంతంలో ఉంచాలి. దీనిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ప్రతిరోజూ ఒకసారి మూత తెరిచి మళ్లీ మూసివేయాలి. ఇలా చేయడం వల్ల లోపల తయారైన గ్యాస్ సులభంగా బయటకు పోతుంది.
మొక్కలకు ఎలా ఉపయోగించాలి?:
పొట్టును 24 గంటలు నానబెట్టిన తర్వాత నీటిని వడకట్టాలి. ఈ ద్రావణంలో సమాన భాగాలుగా సాధారణ నీటిని కలిపి చిన్న మొక్కలు, కటింగ్స్‌కు ఉపయోగించవచ్చు. పొట్టును 4 రోజులు నానబెట్టి వడకట్టిన తర్వాత, ఒక భాగం ఎరువుకు మూడు భాగాలు నీరు కలిపి ఇండోర్ మొక్కలకు వేయవచ్చు. లేదంటే.. 7 రోజుల పాటు నానబెట్టిన నీటిని వడకట్టి, సమానంగా నీరు కలిపి కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలకు ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 7 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచకూడదు.




