ఖరీదైన క్రీమ్స్ కాదు.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు.. ముఖం మెరిసిపోతుంది..
రోజంతా దుమ్ము, ధూళి, ఎండ, స్క్రీన్ లైట్ వల్ల మన చర్మం బాగా అలసిపోతుంది. రాత్రి పడుకునే ముందు ఆ మురికిని శుభ్రం చేయకుండా అలాగే నిద్రపోతే మొటిమలు, ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు త్వరగా వచ్చేస్తాయి. వేలకు వేలు పోసి బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే రాత్రిపూట కొన్ని సరైన స్కిన్‌కేర్ అలవాట్లు పాటిస్తే సహజమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు.

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది పగటిపూట రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. కానీ మన చర్మం తనను తాను రిపేర్ చేసుకుని, కొత్త కణాలను పునరుత్పత్తి చేసుకునే అసలైన సమయం రాత్రే.. పడుకునే ముందు కేవలం 10 నిమిషాలు కేటాయించి కొన్ని సరైన అలవాట్లను పాటిస్తే.. మొటిమలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. సహజంగానే నిగనిగలాడే చర్మాన్ని సొంతం చేసుకోవడానికి నిపుణులు సూచిస్తున్న ఆ 7 బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవడం ముఖ్యం.
మేకప్‌ను పూర్తిగా తొలగించండి
రోజంతా ముఖంపై పేరుకుపోయిన మేకప్, దుమ్ము, చెమటను శుభ్రం చేసుకోకుండా నిద్రపోవడం చర్మానికి చేసే అతిపెద్ద హాని. ఇది చర్మ రంధ్రాలను మూసివేసి మొటిమలకు దారితీస్తుంది. కాబట్టి, పడుకునే ముందు మైసెల్లార్ వాటర్ లేదా క్లెన్సింగ్ బామ్‌తో మేకప్‌ను పూర్తిగా తొలగించాలి.
డబుల్ క్లెన్సింగ్ పద్ధతి
మేకప్ తీసిన తర్వాత మీ చర్మ రకానికి సరిపోయే సున్నితమైన ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌తో ముఖం కడుక్కోవాలి. దీనినే డబుల్ క్లెన్సింగ్ అంటారు. ఇది చర్మంలోని సహజ తేమను దెబ్బతీయకుండా, లోతుల్లో దాగి ఉన్న మురికిని పూర్తిగా బయటకు పంపుతుంది.
ఫేస్ సీరమ్ – మాయిశ్చరైజర్
రాత్రిపూట చర్మ కణాలు వేగంగా పునరుద్ధరించబడతాయి. ఈ సమయంలో హయలురోనిక్ యాసిడ్ లేదా విటమిన్ సీరమ్ రాయడం వల్ల ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. ఆ తర్వాత చర్మంలో తేమ నిలిచి ఉండేలా మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోవద్దు.
కళ్ల చుట్టూ ప్రత్యేక సంరక్షణ
రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్లు చూడటం వల్ల కళ్లు అలసిపోయి కింద నల్లటి వలయాలు, ఉబ్బు ఏర్పడతాయి. కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు ఐ క్రీమ్ రాసి సున్నితంగా మసాజ్ చేస్తే ఉబ్బు తగ్గి కళ్లు ప్రకాశవంతంగా మారతాయి.
సిల్క్ దిండు కవర్లకు మారండి
సాధారణ కాటన్ దిండు కవర్లు చర్మంలోని తేమను పీల్చుకోవడంతో పాటు జుట్టు రాపిడికి గురై విరిగిపోయేలా చేస్తాయి. వీటికి బదులుగా సిల్క్ లేదా శాటిన్ దిండు కవర్లు వాడటం వల్ల ముఖంపై నిద్ర ముడతలు పడకుండా ఉండటమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
డిజిటల్ స్క్రీన్‌లకు దూరంగా..
నిద్రపోయే కనీసం గంట ముందు ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌లను పక్కన పెట్టేయండి. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. సరైన నిద్ర లేకపోతే ఆ ప్రభావం నేరుగా ముఖంపై కనిపిస్తుంది.
తగినంత నీరు, కాసేపు ధ్యానం
రాత్రి పడుకునే ముందు శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగాలి. అలాగే 5 నుంచి 10 నిమిషాల పాటు శ్వాస వ్యాయామాలు లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి గాఢ నిద్ర పడుతుంది. ప్రశాంతమైన నిద్రే అందమైన చర్మానికి అసలైన రహస్యం.
