AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: అర్ష్‌దీప్‌ను వదులుకుని హార్దిక్‌ను ఎందుకు తీసుకున్నారు? కారణం చెప్పిన పంజాబ్ ఓనర్

ఐపీఎల్ 2027కు ముందు హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌లోకి మారడంపై సహ యజమాని మోహిత్ బర్మన్ కీలక విషయాలు వెల్లడించారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో మ్యాచ్‌ను మార్చగల సామర్థ్యం, నాయకత్వ అనుభవం కారణంగా హార్దిక్‌ను తీసుకున్నట్లు చెప్పారు. అర్ష్‌దీప్ సింగ్‌ను వదులుకోవడం కష్టమైన నిర్ణయమని తెలిపారు.

IPL 2027: అర్ష్‌దీప్‌ను వదులుకుని హార్దిక్‌ను ఎందుకు తీసుకున్నారు? కారణం చెప్పిన పంజాబ్ ఓనర్
Hardik Pandya, Arshdeep Singh
Rakesh
|

Updated on: Nov 14, 2026 | 5:16 PM

Share

IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఆటగాళ్ల మార్పిడి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లగా.. పంజాబ్ జట్టులో కీలక బౌలర్‌గా ఉన్న అర్ష్‌దీప్ సింగ్ ముంబైకి మారాడు. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటో పంజాబ్ కింగ్స్ సహ యజమాని మోహిత్ బర్మన్ తాజాగా వివరించారు. హార్దిక్ లాంటి ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకోవడం టైటిల్ గెలవాలన్న తమ లక్ష్యానికి ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

హార్దిక్‌లోని మూడు స్పెషాలిటీలు

హార్దిక్ పాండ్యా ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడని మోహిత్ బర్మన్ అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటితోనూ మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సామర్థ్యం అతడికి ఉందని చెప్పారు. అంతేకాదు.. కెప్టెన్సీ అనుభవం, కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడే నైపుణ్యం కూడా హార్దిక్‌కు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే బలంగా ఉన్న జట్టుకు మరో కొత్త బలం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2025లో పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరిందని, వచ్చే అడుగు వేసి టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని చెప్పారు.

ముంబైతో డీల్ అంత త్వరగా కుదరలేదు

హార్దిక్‌ను జట్టులోకి తీసుకునే ఒప్పందం ఒక్కరోజులోనే పూర్తికాలేదని బర్మన్ వెల్లడించారు. ఈ స్థాయి ఆటగాడిని దక్కించుకునే అవకాశం రావడం తమకు చాలా ఆసక్తికరంగా అనిపించిందని చెప్పారు. ఈ చర్చల్లో జట్టు యాజమాన్యంతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా దగ్గరగా పాల్గొన్నట్లు వివరించారు. చివరకు పంజాబ్ కింగ్స్ భవిష్యత్తు లక్ష్యాలకు ఈ నిర్ణయం సరైనదని భావించి ముందుకెళ్లినట్లు తెలిపారు. అధికారిక వివరాల ప్రకారం హార్దిక్ పంజాబ్ జట్టులోకి రూ.18 కోట్ల ఒప్పందంతో చేరాడు. అర్ష్‌దీప్ కూడా అదే రూ.18 కోట్ల మొత్తంతో ముంబై ఇండియన్స్‌కు మారాడు.

శ్రేయస్ కెప్టెన్సీలో హార్దిక్ ఆడటంపై ఏమన్నారంటే?

పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. హార్దిక్ అతడి కెప్టెన్సీలో ఆడటంపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తమకు ఎలాంటి సమస్య లేదని మోహిత్ బర్మన్ స్పష్టం చేశారు. నిజానికి జట్టులో ఇద్దరు మంచి క్రికెట్ ఆలోచనలు ఉన్న ఆటగాళ్లు ఉండటం ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు. శ్రేయస్ 2025లో పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడం గొప్ప విజయమని గుర్తుచేశారు. హార్దిక్‌కు కూడా జట్లకు కెప్టెన్సీ వహించిన అనుభవం, టైటిళ్లు గెలిచిన అనుభవం ఉందని చెప్పారు. ఇద్దరూ జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని బర్మన్ ధీమా వ్యక్తం చేశారు.

అర్ష్‌దీప్‌ను వదులుకోవడం చాలా కష్టమైంది

అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టు నుంచి పంపించాలనే నిర్ణయం చాలా కష్టంగా అనిపించిందని బర్మన్ తెలిపారు. అతడు గత ఎనిమిది సీజన్లుగా పంజాబ్ కింగ్స్‌తో ఉన్నాడని, జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడని చెప్పారు. పంజాబ్‌కు చెందిన ఆటగాడు కావడంతో అభిమానుల్లోనూ అర్ష్‌దీప్‌కు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు. అతడిని దేశంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎదగడం దగ్గరుండి చూశామని అన్నారు. అయితే టైటిల్ గెలవాలనే లక్ష్యం కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. ఐపీఎల్ అధికారిక గణాంకాల ప్రకారం హార్దిక్ 162 మ్యాచ్‌ల్లో 2,955 పరుగులు చేసి 82 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లతో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us