AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో ఈ పకోడీని మిస్ అవ్వద్దు.. నోరూరించే వెజిటబుల్ పకోడీ రెసిపీ మీకోసం..!

ఆహా.. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వేడి వేడి పకోడీల గుమగుమలు మన అందరిని టెంప్ట్ చేస్తాయి. బయట షాపుల్లో కొనే బదులు.. ఇంట్లోనే మన చేతులతో హైజీనిక్‌ గా, సూపర్ టేస్టీగా, క్రిస్పీ క్రిస్పీగా వెజిటబుల్ పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

వర్షాకాలంలో ఈ పకోడీని మిస్ అవ్వద్దు.. నోరూరించే వెజిటబుల్ పకోడీ రెసిపీ మీకోసం..!
Vegetable Pakora Receipe
Prashanthi V
|

Updated on: Jul 12, 2025 | 8:01 PM

Share

వెజిటబుల్ పకోడీ.. ఈ యమ్మీ రెసిపీ ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చాలు.. నిమిషాల్లో నోరూరించే స్పైసీ స్పైసీ పకోడీలు రెడీ చేయొచ్చు. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌ లో ఇంట్లో ఫ్రెష్‌ గా చేసుకుంటే ఆ కిక్కే వేరు. గ్యాస్, అజీర్తి టెన్షన్ లేకుండా.. ఫ్రెష్ వెజిటబుల్స్‌ తో ఆరోగ్యకరమైన పకోడీలను ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ లవర్స్ ఎవరైనా సరే.. ఈ రెసిపీని పక్కా ట్రై చేయాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం.. ఏం ఆలోచిస్తున్నారు.. వెంటనే కిచెన్‌ లోకి అడుగు పెట్టేయండి.

వెజిటబుల్ పకోడీకి కావాల్సిన పదార్థాలు

  • శనగపిండి – ½ కప్పు (అవసరమైతే ఇంకొంచెం కలుపుకోవచ్చు)
  • బియ్యప్పిండి – ¼ కప్పు (లేదా కార్న్ స్టార్చ్ 2 టేబుల్ స్పూన్లు – శనగపిండికి సరిపడా)
  • ఉప్పు – ½ టీ స్పూన్
  • వాము – ½ టీ స్పూన్
  • గరం మసాలా పొడి – ¼ నుంచి ½ టీ స్పూన్ (ఆప్షనల్)
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
  • పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి) లేదా (రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ½ నుంచి 1 టీ స్పూన్)
  • కొత్తిమీర/పుదీనా ఆకులు/దిల్ ఆకులు – 2 టేబుల్ స్పూన్లు (ఆప్షనల్)
  • వేపడానికి ఆయిల్ – సరిపడా
  • క్యారెట్ – 1 (¼ కప్పు)
  • క్యాప్సికమ్ – ¼ కప్పు
  • క్యాబేజీ – 1 కప్పు
  • ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
  • ఫ్రెంచ్ బీన్స్ – 6
  • పాలకూర – 1 కప్పు (ఆప్షనల్)

తయారీ విధానం

ముందుగా పకోడీలకు కావాల్సిన కూరగాయల ప్రాసెసింగ్ మొదలుపెట్టాలి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఉల్లిపాయ, ఫ్రెంచ్ బీన్స్, పాలకూర వంటి కూరగాయలను శుభ్రంగా కడిగి సన్నగా పొడవుగా తరిగి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఈ తరిగిన కూరగాయల మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో గట్టిగా నొక్కుతూ కలపడం ద్వారా కూరగాయల నుండి సహజమైన తేమ బయటకు వస్తుంది. ఇలా కలిపిన తర్వాత పిండి కలపడానికి ముందు సుమారు 10 నిమిషాల పాటు పక్కన ఉంచడం మంచిది.

పది నిమిషాల తర్వాత పక్కన పెట్టిన కూరగాయల మిశ్రమంలో శనగపిండి, బియ్యప్పిండి, వాము వేసి బాగా కలుపుకోవాలి. పిండి కలుపుతున్నప్పుడు మిశ్రమం చాలా పొడిగా అనిపిస్తే.. కొద్దిగా నీళ్లు చల్లి ముద్దలా చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. పిండి ద్రవంగా కాకుండా పకోడీలు వేయడానికి సరిపడా గట్టిగా ఉండాలి. అప్పుడే పకోడీలు కరకరలాడుతూ వస్తాయి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలిపిన తర్వాత రుచి చూసి అవసరమైతే ఉప్పు లేదా కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తద్వారా రుచి పర్‌ఫెక్ట్‌ గా ఉంటుంది.

ఇప్పుడు స్టౌవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి మధ్యస్థ మంటపై వేడి చేయాలి. నూనె సరిపడా వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దను నూనెలో వేసి చూడండి. అది వెంటనే పైకి తేలి వేగితే నూనె సరైన ఉష్ణోగ్రతలో ఉన్నట్లు లెక్క. అది నల్లగా మారకుండా చూసుకోవాలి. నూనె సరిగా వేడెక్కిన తర్వాత చేత్తో చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వేడి నూనెలో వేయాలి. పకోడీలను గట్టిగా నొక్కకుండా నెమ్మదిగా వదలాలి.

నూనెలో పకోడీలు వేసిన మొదటి 2 నిమిషాలు వాటిని అస్సలు కదపకుండా ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా తిప్పుతూ పకోడీలు బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. బంగారు రంగు రాగానే వాటిని కిచెన్ టిష్యూపై వేసి అదనపు నూనెను తీసేయండి. మిగిలిన పిండిని కూడా ఇదే పద్ధతిలో వేయించుకోవాలి. ప్రతిసారి నూనె తగినంత వేడిగా ఉందో లేదో చూసుకోవడం మర్చిపోవద్దు.

ఇలా వేయించిన వేడివేడి, కరకరలాడే వెజిటబుల్ పకోడీలను మసాలా టీ, అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ, మింట్ చట్నీతో ఆస్వాదిస్తే ఆ రుచే వేరు.

ఈ రెసిపీ సీక్రెట్స్

  • పకోడీలు క్రిస్పీగా రావాలంటే పిండిలో ఎక్కువ నీళ్లు పోయొద్దు. కూరగాయల నుండి వచ్చే తేమ సరిపోతుంది.
  • నూనెను మీడియం మంటపై మాత్రమే వేయించాలి. మంట తక్కువ ఉంటే నూనె ఎక్కువ పీల్చుకుంటాయి. ఎక్కువ మంట ఉంటే బయట కాలుతాయి. లోపల పచ్చిగా ఉంటాయి.
  • పాత శనగపిండి చేదుగా ఉంటుంది. ఎప్పుడూ ఫ్రెష్ పిండి వాడండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..