Premature Greying: లేత వయసులోనే జుట్టు తెల్లబడి పెద్దవారిలా కనిపిస్తున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..

తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సహజ సంకేతం. కానీ ఇప్పుడు చాలా మందికి ఇరవైలలో కొందరికి అంతకంటే ముందుగానే జుట్టు తెల్లబడిపోతుంది. ఇది శరీరంలో దాగి ఉన్న తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమా అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అన్ని సందర్భాల్లో కాదుగానీ కొన్ని సందర్భాల్లో..

Premature Greying: లేత వయసులోనే జుట్టు తెల్లబడి పెద్దవారిలా కనిపిస్తున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
Premature Greying

Updated on: Feb 18, 2026 | 8:31 PM

ఎప్పుడో 60 ఏళ్లకు రావల్సిన తెల్ల జుట్టు నేటి కాలంలో లేత వయసులోనే పలకరిస్తుంది. తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సహజ సంకేతం. కానీ ఇప్పుడు చాలా మందికి ఇరవైలలో కొందరికి అంతకంటే ముందుగానే జుట్టు తెల్లబడిపోతుంది. ఇది శరీరంలో దాగి ఉన్న తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమా అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అన్ని సందర్భాల్లో కాదుగానీ కొన్ని సందర్భాల్లో చిన్న వయస్సులోనే జుట్టు నెరవడం శరీరంలోని ఆరోగ్య సమస్యకు హెచ్చరిక సంకేతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జుట్టు రంగు మెలనిన్ అనే వర్ణద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. వయస్సుతో పాటు ఈ వర్ణద్రవ్యం తగ్గడం సాధారణం. కానీ ఈ ప్రక్రియ చిన్న వయస్సులోనే ప్రారంభమైతే దాని వెనుక అనేక ఆరోగ్య కారణాలు ఉండవచ్చు.

విటమిన్ బి12 లోపం

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రైకాలజీలో ప్రచురితమైన 2018 అధ్యయనంలో జుట్టు అకాలంగా తెల్లబడటానికి గల ముఖ్య కారణాల్లో విటమిన్ B12 లోపం ఒకటి. బీ12 విటమిన్‌ సాధారణ స్థాయిల కంటే తక్కువగా ఉంటుంటే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు అకాలంగా తెల్లబడి వృద్ధాప్యం వేగంగా వచ్చినట్లు అనిపిస్తుంది.

థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల పాత్ర

థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యత చెదిరిపోతే, జుట్టు సాధారణ పెరుగుదల, రంగు ప్రభావితమవుతుందని ఓ పరిశోధనలో తేలింది. హైపోథైరాయిడిజం జుట్టు త్వరగా తెల్ల రంగులోకి మారే ధోరణితో ముడిపడి ఉంటుంది. డెర్మటాలజీ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్‌లో ప్రచురితమైన సమాచారం ప్రకారం విటిలిగో, అలోపేసియా అరేటా వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు జుట్టు వర్ణద్రవ్యం కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా జుట్టు అకాలంగా తెల్ల రంగులోకి మారుతుంది.

ఇవి కూడా చదవండి

ఆక్సీకరణ ఒత్తిడి

2020లో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుందని, ఇది జుట్టు రంగుకు కారణమైన మూల కణాలను నాశనం చేస్తుందని పేర్కొంది. అంతేకాకుండా ఒత్తిడి నేరుగా జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది.

జీవనశైలి ప్రభావాలు

వైద్యుల అభిప్రాయం ప్రకారం ఆలస్యంగా నిద్ర లేవడం, అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం, కాలుష్యం, రసాయనాలతో కూడిన హెయిర్‌ ఉత్పత్తులను అధికంగా ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

అయితే అన్ని సందర్భాల్లోనూ జుట్టు తెల్లబడటం అనేది శరీరంలో అంతర్లీనంగా దాగి ఉన్న పెద్ద వ్యాధి కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. కొన్నిసార్లు ఇది వంశపారంపర్యంగా లేదా సహజంగా కూడా సంభవిస్తుంది. అయితే జుట్టు తెల్లబడటం అనేది అసాధారణ అలసట, జుట్టు రాలడం, బరువు తగ్గడం, హార్మోన్ల సమస్యలతో కూడి ఉంటే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి సంబంధిత రక్త పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా సమస్యను తొలినాళ్లలోనే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు వీలవుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us