
ఇటీవలి కాలంలో మౌత్ వాష్‌ల వాడకం పెరిగింది. మౌత్ వాష్ నోటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే ద్రవం. ఇందులో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు, ఫ్లోరైడ్, ఫ్లేవరింగ్ ఆయిల్స్ వంటి వివిధ పదార్థాలు ఉంటాయి. నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడం, దుర్వాసనను తొలగించడం, కొన్నిసార్లు దంతాలను కావిటీస్ నుంచి రక్షించడం దీని ఉద్దేశ్యం. జనాలు దీనిని ఉపయోగించడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ప్రతిరోజూ మౌత్ వాష్ ఉపయోగించడం అందరికీ అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక రోజుకు రెండుసార్లు సరిగ్గా పళ్ళు తోముకుంటే సరిపోతుంది. దీనికితోడు ఫ్లాస్సింగ్, దంతవైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించడం వంటివి మంచి అలవాట్లు. అయినప్పటికీ మౌత్ వాష్ వాడకం అవసరమా? అసలు దీన్ని ప్రతిరోజూ ఉపయోగించవచ్చా? ఈ సందేహాలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం..
చాలా మౌత్ వాష్ లలో ఆల్కహాల్ ఉంటుంది. ఇది లాలాజలాన్ని తగ్గిస్తుంది. నోటిని పొడిబారిస్తుంది. తక్కువ లాలాజలం బ్యాక్టీరియా పెరుగుదల అవకాశాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరి నోటిలో మంచి, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. రోజువారీ మౌత్ వాష్ వాడకం వల్ల మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.
నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి మీరూ మౌత్ వాష్ ఉపయోగిస్తే అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నిజమైన సమస్య కడుపు, చిగుళ్ళు, దంతాలలో ఉండవచ్చు.
మౌత్ వాష్ ను తరచుగా వాడటం వల్ల చాలా మందిలో చికాకు, నోటి పూత, అలెర్జీలు వస్తాయి.
నోటిని శుభ్రంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం చాలా అవసరం. మౌత్ వాష్ అనేది ఒక అనుబంధ చర్య మాత్రమే. ఇది తప్పనిసరి కాదు. తరచుగా చిగుళ్ల పూత, నిరంతర దుర్వాసన, తీవ్రమైన ప్లేక్ ఉంటే వైద్యులు కొన్నిసార్లు మౌత్ వాష్‌ను ఉపయోగించమని సిఫార్సు చేస్తారు. అప్పుడు మాత్రమే దానిని ఉపయోగించాలి. వైద్యులు సిఫార్సు చేసిన వ్యవధి వరకు మాత్రమే మౌత్ వాష్ ఉపయోగించాలి. నోట్లో 20 నుంచి 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మింగకూడదు. చిన్న పిల్లలకు మౌత్ వాష్ ఇవ్వకూడదు. వీలైతే ఆల్కహాల్ లేని మౌత్ వాష్ ఉపయోగించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.