AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Suicide Prevention Day 2025: ప్రాణం విలువైనది భయ్యా..! ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఇవేనట..

World Suicide Prevention Day 2025: దేశ‌వ్యాప్తంగా ఒత్తిడి, మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్యలు పెరుగుతున్నాయ‌ని, అవి ఆత్మహ‌త్య ఆలోచ‌న‌ల‌కు దారితీస్తున్నాయ‌ని హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేసే ఆత్మహత్య నిరోధ హెల్ప్‌లైన్ (7893078930) అయిన 1 లైఫ్ సంస్థ (1life.org.in) తెలిపింది. తాజాగా విడుద‌ల చేసిన నివేదిక‌లో ఇందుకు సంబంధించి ప‌లు విషయాలను వెల్లడించింది. త‌మ‌కు ఫోన్ చేసేవారిలో చాలామంది తీవ్రమైన భావోద్వేగ‌, ఆర్థిక‌, సామాజిక ఒత్తిడిలో ఉంటున్నార‌ని పేర్కొంది.

World Suicide Prevention Day 2025: ప్రాణం విలువైనది భయ్యా..! ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఇవేనట..
1life Helpline Report
Shaik Madar Saheb
|

Updated on: Sep 10, 2025 | 8:33 AM

Share

దేశ‌వ్యాప్తంగా ఒత్తిడి, మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్యలు పెరుగుతున్నాయ‌ని, అవి ఆత్మహ‌త్య ఆలోచ‌న‌ల‌కు దారితీస్తున్నాయ‌ని హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేసే ఆత్మహత్య నిరోధ హెల్ప్‌లైన్ (7893078930) అయిన 1 లైఫ్ సంస్థ (1life.org.in) తెలిపింది. తాజాగా విడుద‌ల చేసిన నివేదిక‌లో ఇందుకు సంబంధించి ప‌లు విషయాలను వెల్లడించింది. త‌మ‌కు ఫోన్ చేసేవారిలో చాలామంది తీవ్రమైన భావోద్వేగ‌, ఆర్థిక‌, సామాజిక ఒత్తిడిలో ఉంటున్నార‌ని.. దానివ‌ల్ల వారిలో ఆత్మహ‌త్యల‌ ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయ‌ని వెల్లడించింది. 1 లైఫ్ హెల్ప్‌లైన్‌కు ఏడాదికి స‌గ‌టున 23వేల కాల్స్ వ‌స్తుంటాయి. వీటిని కౌన్సెల‌ర్లు విశ్లేషించి, స‌మాజంలో మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్యలు పెరిగిపోతున్నాయ‌ని తెలిపారు. ఈ క‌ష్టాల నుంచి కోలుకోవ‌డం చాలా ముఖ్యం. వాటిలో వ్యక్తిగ‌త సంబంధాలు తెగిపోవ‌డం, వ్యవ‌స్థాప‌ర‌మైన స‌మ‌స్యలు, నిరాశావాదం లాంటివి చాలా ఉంటాయి. ప్రతి కాల్‌లోనూ తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యక్తులు ఎదుర‌వుతారు. వాళ్లను బాగా అర్థం చేసుకోవ‌డం, సానుభూతి చూపించ‌డం, మ‌ద్దతు ఇవ్వడం ల‌క్ష్యంగా కౌన్సెల‌ర్లు మాట్లాడ‌తారు.

మానసిక ఆరోగ్యం మీద బ‌హిరంగంగా జ‌ర‌గాల్సిన చ‌ర్చల‌ను నింద‌, మౌనం ఎలా అడ్డుకుంటాయో కూడా ఈ డేటా చెబుతుంది. చాలా కుటుంబాల్లో వ్యక్తులు త‌మ స‌మ‌స్యల‌ను చెప్పడానికి అనుమ‌తించ‌రు. ఎవ‌రైనా త‌మ‌ను త‌ప్పుగా అనుకుంటారేమో, లేదా స‌మాజంలో చిన్నచూపు చూస్తారేమోన‌న్న భ‌యంతో కూడా త‌మ లోప‌లి ఆలోచ‌న‌ల‌ను బ‌య‌ట‌పెట్టకుండా లోలోప‌లే కుమిలిపోతుంటారు. త‌మ లోప‌లి భావాల‌ను బ‌య‌ట‌పెట్టక‌పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య మ‌రింత తీవ్రమ‌వుతుంది. దాంతో వాళ్లు మ‌రింత ఒంట‌రి అయిపోయిన‌ట్లు భావిస్తారు. ఈ త‌ర‌హా ట్రెండ్‌లను బ‌ట్టి చూస్తే.. జాలి, స‌మ‌యానికి జోక్యం చేసుకోవ‌డం లాంటి వాటి ప్రాధాన్యం స‌మాజానికి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని 1లైఫ్ భావిస్తోంది.

1లైఫ్ ప్రకారం.. హైరిస్క్ ఫోన్ కాల్స్ విష‌యంలో ప్రధాన‌మైన కార‌ణాలు..

రిలేష‌న్‌షిప్ స‌మ‌స్యలు (సుమారు30%): గొడ‌వ‌లు, బ్రేక‌ప్ లేదా వైవాహిక స‌మ‌స్యలు చాలావ‌ర‌కు ఆత్మహ‌త్య ఆలోచ‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. కాల్ చేసేవారిలో చాలామంది త‌మ మాట వినిపించుకోవ‌డం లేద‌ని, ఒంట‌రిగా అయిపోయామ‌ని చెబుతూ ఈ క‌ష్టాల నుంచి త‌ప్పించుకోవాలంటే ఆత్మహ‌త్య ఒక్కటే మార్గమ‌ని భావిస్తారు. కుటుంబాల్లో సరిగా మాట్లాడుకోలేక‌పోవ‌డం, యుక్త వ‌య‌సులో భావోద్వేగాల‌ను త‌ట్టుకునే శిక్షణ లేక‌పోవ‌డం వ‌ల్ల ప‌రిస్థితి ఇంత‌వ‌ర‌కు వ‌స్తుంది. సామాజికంగా చురుగ్గా ఉంటున్నా, విజ‌యాలు సాధిస్తున్నా కూడా వ్యక్తిగ‌త సంబంధాల విష‌యంలో బాగా ఇబ్బంది ప‌డుతున్నవారు త‌మ‌లో తామే కుమిలిపోతున్నార‌ని కౌన్సెల‌ర్లు గుర్తించారు.

అప్పులు, ఆర్థిక‌ స‌మ‌స్యలు (25%): నిరుద్యోగం, పెరిగిపోతున్న అప్పులు, బెట్టింగ్ యాప్‌ల‌లో న‌ష్టాలు, తిరిగి ఇవ్వని వ్యక్తిగ‌త రుణాలు, ఆర్థిక మోసాల‌కు గురికావ‌డం లాంటివి చాలామందిని నిరాశ‌లోకి నెట్టేస్తాయి. ఆర్థికంగా విఫ‌ల‌మ‌య్యామ‌న్న కుంగుబాటు, అప్పుల‌వాళ్లు, కుటుంబ‌స‌భ్యుల నుంచి పెరిగిపోయే ఒత్తిడి వ‌ల్ల ఇక నిస్సహాయంగా మిగిలిపోతారు. చాలామందికి త‌మ కుటుంబాల‌ను పోషించ‌లేక‌పోవ‌డంతో సిగ్గుప‌డి, అది చివ‌ర‌కు తీవ్ర నిరాశ‌లోకి దించేస్తుంది. ఆర్థిక అక్షరాస్యత, స‌మాజం నుంచి మ‌ద్దతు లాంటివి బ‌ల‌హీనంగా ఉండ‌డంతో ఊర‌ట కోసం సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్దామ‌నుకున్నా అవి ఉండ‌వు.

విద్య/వృత్తిప‌ర‌మైన ఒత్తిడి (సుమారు 22%): విద్యార్థులు, యువ వృత్తినిపుణులు త‌ర‌చు త‌మ‌కు ప‌రీక్షలు, వృత్తిప‌ర‌మైన స‌మ‌స్యలు, ప‌ని వాతావ‌ర‌ణం స‌రిగా ఉండ‌క‌పోవ‌డం లాంటి స‌మ‌స్యల‌తో స‌త‌మ‌తం అవుతున్నట్లు చెబుతారు. విఫ‌లం అవుతామ‌న్న భ‌యం, అంచ‌నాల‌ను అందుకోలేక‌పోవ‌డంతో త‌ర‌చు త‌మ‌మీద త‌మ‌కే అనుమానం వ‌చ్చి, ఆందోళ‌న‌తో ఆత్మహ‌త్య ఆలోచ‌న‌లొస్తాయి. ప‌క్కవాళ్ల‌తో పోల్చిచూడ‌డం, సోష‌ల్ మీడియాలోనూ పోలిక‌లు ఎక్కువ కావ‌డంతో ఈ స‌మ‌స్యలు ఎక్కువైపోయి తాము వెన‌క‌బ‌డుతున్నామ‌ని అనుకుంటారు. మెంటార్లు లేదా మ‌ద్దతిచ్చే వృత్తివాతావ‌ర‌ణం లేక‌పోవ‌డంతో చాలామంది త‌మ ప‌రిస్థితి డెడ్ ఎండ్ అని భావిస్తారు.

మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్యలు (సుమారు 10%): ఒంట‌రిత‌నం, ఒత్తిడి, కుంగుబాటు, ప‌నికిరామ‌న్న భావ‌న‌లు ఎక్కువ‌మంది కాల‌ర్స్‌లో క‌నిపిస్తున్నాయి. కుటుంబం నుంచి స‌మాజం నుంచి త‌గిన మ‌ద్దతు లేక‌పోతే చాలామంది మౌనంగా బాధ‌ప‌డుతూ, క‌నిపించ‌ని ఇబ్బందిలో మునిగిపోతారు. కొంద‌రు సాయంకోసం ప్రయ‌త్నించినా త‌మ‌ను ఎద్దేవా చేస్తున్నార‌ని, కొట్టిపారేస్తున్నార‌ని చెబుతూ మ‌రింత ఒంట‌రిత‌నంలో కూరుకుపోతున్నారు. అందుబాటులో మాన‌సిక ఆరోగ్య సేవ‌లు లేక‌పోవ‌డంతో వారు స‌రైన స‌మ‌యానికి సాయం అందుకోక‌వ‌డం క‌ష్టమ‌వుతోంది.

సామాజిక స‌మ‌స్యలు (సుమారు 12%): ఎల్జీబీటీక్యూ లాంటి కొన్ని వ‌ర్గాల‌కు చెందిన‌వారు బ‌ల‌వంతపు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వ‌స్తుంది.. త‌రచు వీరిని వెలివేస్తారు, లేదా తాము అంగీక‌రించ‌ని గుర్తింపుతో జీవించాల్సి వ‌స్తుంది. ఇలా త‌ర‌చు ఉండే ఒత్తిడి వ‌ల్ల వారికి త‌ప్పనిస‌రిగా ఆత్మహ‌త్య ఆలోచ‌న‌లొస్తాయి. చాలా సంద‌ర్భాల్లో కుటుంబం, స‌మాజం వెలివేయ‌డంతో వాళ్లకు చాలా అవ‌స‌ర‌మైన మ‌ద్దతు దొర‌క‌దు. త‌మ గుర్తింపును నిరూపించుకోవ‌డానికి పోరాడుతుంటే త‌ర‌చు ఎదుర‌య్యే ఛీత్కారాలు వారికి తీవ్ర మాన‌సిక స‌మ‌స్యల‌ను సృష్టించి, త‌ప్పించుకోవ‌డాన్ని అసాధ్యం చేస్తాయి.

కొంత త‌క్కువ సంఖ్యలోనే అయినా కొంత‌మంది ప్రవ‌ర్తన స‌రిగా ఉండ‌దు. తిట్టిన‌ట్లు ఉంటారు. దాంతో కౌన్సెల‌ర్లకు అద‌న‌పు భారం ప‌డుతుంది. దాంతో నిజంగా సంక్షోభంలో ఉన్నవారి నుంచి కీల‌క‌మైన కౌన్సెల‌ర్లను ఇటు మ‌ళ్లించాల్సి వ‌స్తుంది. ఇలాంటి చ‌ర్యలు హెల్ప్‌లైన్ సీరియ‌స్‌నెస్ త‌గ్గించ‌డ‌మే కాక‌, ప్రాణాలు కాపాడాల‌నుకునే కౌన్సెల‌ర్లను నిరుత్సాహ‌ప‌రుస్తాయి. ఇలా అవ‌స‌రం లేకుండా చేసే కాల్స్ త‌క్కువ‌గానే ఉన్నా, మాన‌సిక ఆరోగ్య సేవ‌ల‌ను గౌర‌వించాల‌న్న అవ‌గాహ‌న అంద‌రిలో ఉండాల్సిన అవ‌స‌రాన్ని ఇవి సూచిస్తాయి. ప్రాంక్ కాల్స్ వ‌ల్ల వృథా అయ్యే ప్రతి నిమిషం కూడా ఏదో ఒక ప్రాణాన్ని కాపాడే అవ‌కాశాన్ని కోల్పోవ‌డానికి కార‌ణం అవుతుంద‌ని 1లైఫ్ స్పష్టీక‌రిస్తుంది.

ఈ ప‌రిణామాల గురించి 1 లైఫ్ ఆత్మహ‌త్యల నిరోధ హెల్ప్‌లైన్‌లోని క‌న్సల్టెంట్ సైకాలజిస్ట్ మిస్ రెబెక్కా మాట్లాడుతూ. “ప్రతి కాల్ వెనుక భ‌రించ‌లేని బాధ‌, భ‌యం, లేదా ఒంట‌రిత‌నంతో పోరాడే ఒక‌వ్యక్తి ఉంటారు. నిజానికి వాళ్లు చ‌నిపోవాల‌ని అనుకోరు. కానీ త‌మ క‌ష్టాల‌కు ముగింపు కోరుకుంటారు. వాళ్లను జ‌డ్జ్ చేయ‌కుండా, వారికి ఒక ఆశ క‌ల్పించేలా విన‌డం ద్వారా జీవించ‌డానికి త‌గిన కార‌ణాలు క‌నుగొన‌డంలో వారికి సాయం చేయ‌గ‌లం. ఒక‌స‌మాజంగా, మ‌నం త‌ప్పనిస‌రిగా మాన‌సిక ఆరోగ్యం గురించి చ‌ర్చించ‌డం, సామాజిక స‌మ‌స్యలు త‌గ్గించ‌డం, బేష‌ర‌తుగా మ‌ద్దతు ఇవ్వడం లాంటివి చేయాలి” అని వివ‌రించారు.

కష్టాల్లో ఉన్నవారు మౌనంగా బాధ‌ప‌డ‌డం కంటే స‌హాయం పొంద‌డాన్ని 1లైఫ్ ప్రోత్సహించింది. త‌గిన సమయానికి చేసే కౌన్సెలింగ్.. నిరాశ‌ను అనుకూల‌త‌గా మార్చగ‌ల‌ద‌ని సంస్థ పేర్కొంది. మాన‌సిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యవ‌స్థల‌ను రూపొందించ‌డానికి విధాన నిర్ణేత‌లు, విద్యావేత్తలు, ఉద్యోగ నియామ‌క సంస్థలు, స‌మాజంలో నాయ‌కులు కూడా ప్రోయాక్టివ్ చ‌ర్యలు తీసుకోవాలి. ఆత్మహ‌త్యల నిరోధం అనేది కేవ‌లం హెల్ప్‌లైన్ల బాధ్యత మాత్రమే కాద‌ని 1లైఫ్ నొక్కిచెబుతోంది. కుటుంబాలు, కార్యాల‌యాలు, మొత్తం స‌మాజం క‌లిసిక‌ట్టుగా చేయాల్సిన ప‌ని అని స్పష్టం చేస్తోంది..

కాగా.. 1లైఫ్ సంస్థలో 120 మంది నిబ‌ద్ధత క‌లిగిన వాలంటీర్లు ఉన్నారు. వారిలో విభిన్న నేప‌థ్యాల‌కు చెందిన మ‌హిళ‌లే 75%కు పైగా ఉన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ స‌హా 15 భార‌తీయ భాష‌ల్లో 1 లైఫ్ ప‌నిచేస్తుంది. గ‌డిచిన ప‌దేళ్లలో 1.5 ల‌క్షల కాల్స్‌ను 1లైఫ్ స్వీక‌రించింది. మాన‌సిక ఆరోగ్యానికి సంబంధించిన స‌మాచారాన్ని అందించ‌డంలో విశ్వసనీయ సంస్థగా 1 లైఫ్‌ను ప్రముఖ న‌టి దీపికా పదుకోనె స్థాపించిన లివ్ ల‌వ్ లాఫ్ ఫౌండేష‌న్ గుర్తించింది. మీకు ఏమైనా సమస్యలుంటే.. ఈ నెంబర్ కు 7893078930 ఫోన్ చేయండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..