తీరొక్క బతుకమ్మలో తప్పక దర్శనమిచ్చేది తంగేడు పువ్వు… తంగేడు చెట్టు అనగానే బతుకమ్మకు వాడే పువ్వులు గుర్తుకు వస్తాయి. అయితే, ఈ తంగేడు మొక్క విశిష్టత, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..కానీ, తంగేడు ఒక ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం కేషియా ఆరిక్యులేటా. తంగేడు పువ్వులు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. తంగేడు పువ్వులతో తయారు చేసిన టీని తాగడం వల్ల అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. తంగేడు చెట్టు వేరుతో కాషాయం చేసుకొని తాగడం వల్ల నీళ్లవిరేచనాలు తగ్గుతాయి.
అతిమూత్ర వ్యాధి నియంత్రణకు తంగేడు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండె దడ తగ్గడం.. దానితో వచ్చే నీరసం, కళ్లు తిరగడం తగ్గిస్తుంది. తంగేడు ఆకులతో వీర్యవృద్ధి కలిగి, సంతానం కలుగుతుందని చెబుతారు. మధుమేహ వ్యాధితో కలిగే అతిమూత్ర వ్యాధి నివారణకు దోహదం చేస్తుంది. పంటి నొప్పి తగ్గడానికి కాండం టూత్ బ్రష్ లాగా చేసి వాడితే ఎంతో మంచిది. మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గటానికి దీని వేరు ఉపయోగపడుతుంది.
గుప్పెడు తంగేడు ఆకులను నీటిలో వేసి కషాయం కాచి ఆవిరి పడితే పార్శ్వపు తలనొప్పి మాయమవుతుంది అని చెబుతున్నారు. రేచీకటి తగ్గడానికి, రాత్రిపూట చూపు మెరుగుపడడానికి దోహదం చేస్తుంది. కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాషాయం కాచి ఇస్తే తక్షణం ఉపశమనం లభిస్తుంది. విరిగిన ఎముకలకు, పట్టుగా తంగేడు ఆకులు వాడతారు. నోటిపూతతో బాధపడేవారికి పత్రాలు నూరి మాత్రలుగా వాడితే పూత, పుండు తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..