ఈ చిన్న పని చేస్తే చాలు మీ గులాబీ మొక్కకు పువ్వులు గుత్తులు గుత్తులుగా కాస్తాయ్.. మీకు తెలియని సీక్రెట్స్..
ఇంటి బాల్కనీలో గుబాళించే గులాబీలు ఉన్నట్టుండి వాడిపోతుంటే బాధపడని మనసు ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయని మొక్కను పెకిలించి పారేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. చిన్న చిన్న మార్పులతో, వంటింట్లో దొరికే సహజ పోషకాలతో వాడిపోయిన గులాబీ మొక్కకు మళ్లీ ప్రాణం పోసి, గుత్తులు గుత్తులుగా పూలు పూయించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇంటి బాల్కనీలోనో, పెరట్లోనే రంగురంగుల గులాబీలు గుబాళిస్తుంటే ఆ అందమే వేరు. రోజా పువ్వులను ఇష్టపడని వారు దాదాపు ఉండరు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో కనీసం ఒక్క గులాబీ మొక్కనైనా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. మొక్క పెరిగిన కొద్ది రోజులకే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, కొమ్మలు నల్లబడి ఎండిపోవడం లేదా మొగ్గలు రాకపోవడం. ఇలాంటప్పుడు చాలామంది మొక్క చనిపోయిందని భావించి పెకిలించి పారేస్తుంటారు. కానీ కొద్దిపాటి శ్రద్ధ, సరైన సంరక్షణ పద్ధతులు పాటిస్తే వాడిపోయిన గులాబీ మొక్కను కూడా తిరిగి పూలతో కళకళలాడేలా చేయవచ్చని రిషికేశ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన తోటమాలి రామ్ సాగర్ తో పాటు ఉద్యానవన నిపుణులు వివరిస్తున్నారు.
ఎండిన కొమ్మల కత్తిరింపు
మొక్క ఎండిపోతున్నట్లు కనిపిస్తే మొదట చేయాల్సింది కత్తిరింపు. మొక్కపై ఉన్న ఎండిపోయిన, నలుపు లేదా గోధుమ రంగులోకి మారిన కొమ్మలను కత్తెరతో కత్తిరించాలి. కొమ్మను కత్తిరించేటప్పుడు నేరుగా కాకుండా 45 డిగ్రీల కోణంలో, ఆరోగ్యకరమైన పచ్చటి కణుపుకు కాస్త పైగా కత్తిరించాలి. దీనివల్ల నీరు నిలవకుండా జారిపోతుంది. ఫంగస్ చేరకుండా ఉంటుంది. అనవసరమైన ఎండిన భాగాలను తొలగించడం వల్ల వేర్ల నుంచి వచ్చే శక్తి అంతా కొత్త చిగుళ్లు రావడానికి ఉపయోగపడుతుంది.
మట్టిని వదులు చేయడం – రూట్ కేర్
చాలావరకు కుండీలలోని మట్టి కాలక్రమేణా గట్టిపడిపోతుంది. కుండీ పైభాగంలో ఉన్న 1 నుండి 2 అంగుళాల మట్టిని ఏదైనా చిన్న పనిముట్టుతో సున్నితంగా వదులు చేయాలి. ఇలా చేయడం వల్ల వేర్లకు గాలి బాగా అందుతుంది మరియు నీరు సమానంగా ఇంకుతుంది.
బలమైన సేంద్రియ పోషకాలు
ఎండిపోతున్న మొక్కకు తక్షణ శక్తి అందించడానికి సేంద్రియ ఎరువులు మేలైన మార్గం. మట్టిని వదులు చేసిన తర్వాత గుప్పెడు వర్మీకంపోస్ట్ లేదా బాగా కుళ్ళిన ఆవు పేడను వేర్ల చుట్టూ వేసి మట్టిలో కలపాలి. వాడిన తర్వాత మిగిలిన టీ పొడిని బాగా కడిగి, ఎండబెట్టి నెలకు రెండుసార్లు కుండీలో వేస్తే నైట్రోజన్ అందుతుంది. అరటిపండు తొక్కలను నీటిలో 2-3 రోజులు నానబెట్టి ఆ నీటిని పోస్తే పొటాషియం పుష్కలంగా లభిస్తుంది, ఇది పూత ఎక్కువగా రావడానికి తోడ్పడుతుంది. టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ను లీటర్ నీటిలో కలిపి నెలకు ఒకసారి పిచికారీ చేస్తే ఆకులు పచ్చగా, బలంగా ఎదుగుతాయి.
సరైన నీటి యాజమాన్యం
- గులాబీ మొక్కలు పాడవడానికి 70శాతం కారణం అధికంగా నీరు పోయడమే.
- కుండీ పైమట్టి కనీసం ఒక అంగుళం మేర పొడిగా మారినప్పుడే నీరు పెట్టాలి.
- ఎల్లప్పుడూ మట్టి తేమగా ఉండాలే కానీ నీరు బురదలా నిల్వ ఉండకూడదు. నీరు నిలిస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
- కుండీ అడుగున రంధ్రం మూసుకుపోకుండా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి.
సూర్యరశ్మి – గాలి ప్రసరణ
గులాబీకి ఎండ ప్రాణాధారం. మొక్కను రోజూ కనీసం 5 నుండి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో ఉంచాలి. నీడలో లేదా గాలి సరిగ్గా ఆడని మూలల్లో పెడితే ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువ.
ముఖ్యమైన సంరక్షణ సూచనలు
ఫంగస్ నివారణ: కొమ్మలు కత్తిరించిన చివర్లలో కొద్దిగా పసుపు లేదా ఫంగిసైడ్ పౌడర్ రాస్తే కొమ్మలు కుళ్లిపోకుండా ఉంటాయి.
పురుగుల నివారణ: ఆకులపై తెల్ల దోమలు లేదా నల్లి వంటి పురుగులు కనిపిస్తే వేప నూనెను నీటిలో కలిపి వారానికి ఒకసారి పిచికారీ చేయాలి.
