వర్షాకాలంలో కిచెన్ సేఫ్టీ మస్ట్.. లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ పక్కా..!
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వంటగదిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఆహారం త్వరగా చెడిపోవడానికి.. తద్వారా ఆరోగ్య సమస్యలు రావడానికి దారి తీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వంటగదిని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.

వర్షాలు పడుతున్నప్పుడు వాతావరణం చల్లబడి, గాలి తేమగా మారుతుంది. ఈ తేమ వాతావరణం సూక్ష్మజీవులు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వంటగదిలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వంట చేసే చోట శుభ్రంగా ఉండకపోతే ఆహారం చెడిపోవడం, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో వంటగదిని శుభ్రంగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వంటగది శుభ్రత ముఖ్యం
ఈ సీజన్‌లో వంటగదిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్రిములు, బ్యాక్టీరియా త్వరగా పెరుగుతాయి. కాబట్టి వంట ముందు, వంట తర్వాత వంటగదిని శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి. వంట మొదలు పెట్టే ముందు చేతులు శుభ్రంగా కడగడం కూడా మర్చిపోవద్దు.
పాత్రలు వెంటనే కడగడం
వంట తర్వాత పాత్రలను కడగకుండా వదిలేస్తే.. అవి తేమను పీల్చుకొని బ్యాక్టీరియాకు నిలయంగా మారతాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇది చాలా ప్రమాదకరం. వాడిన వెంటనే పాత్రలను కడగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల వంటగదిలో వ్యాధి కలిగించే క్రిములు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.
వెట్ స్పూన్స్ వాడొద్దు
ఆహార పదార్థాలను తీసేటప్పుడు తడి చెంచాలు అస్సలు వాడకూడదు. తడి వల్ల ఆహారంలో తేమ చేరి అది త్వరగా చెడిపోతుంది. వండిన ఆహారం లేదా వండని ఆహారం తీయడానికి ఎప్పుడూ పొడి చెంచాలనే ఉపయోగించాలి.
కిచెన్ ఫుడ్ సేఫ్టీ
వర్షాకాలం గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంట్లో వంట సామాన్లు.. పప్పులు, నూనెలు, దినుసులు ఇలాంటివి త్వరగా పాడైపోతాయి. అందుకే వాటిని గాలి చొరబడని డబ్బాల్లో పెట్టి గట్టిగా మూత పెట్టాలి. ఇలా చేస్తే వర్షాకాలంలో కూడా సామాన్లు పాడవకుండా మంచిగా ఉంటాయి.
సింక్ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
సింక్ అనేది వంటగదిలో చాలా ముఖ్యమైన భాగం. వంట తర్వాత ఖాళీ చేసిన పాత్రలన్నీ ఇక్కడే పెడతాం. కాబట్టి ఇది శుభ్రంగా లేకపోతే క్రిములు ఏర్పడే అవకాశం ఎక్కువ. పైపుల గుండా బ్యాక్టీరియా కూడా రావచ్చు. అందుకే ప్రతిరోజూ సింక్ ను శుభ్రంగా కడగడం, క్లీనర్ తో తరచుగా శుభ్రం చేయడం తప్పనిసరి.




