Parenting Tips: పిల్లలకు ఈ విషయాలు ఖచ్చితంగా నేర్పించండి.. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలరు..!
తల్లిదండ్రులకు తమ పిల్లలు మంచి జీవితం గడపాలి, విజయం సాధించాలి అనే ఆశ ఉంటుంది. ఇందుకోసం వారు చాలా ప్రయత్నాలు చేస్తారు. మంచి పాఠశాలల్లో చేర్పించడం, శిక్షణ ఇవ్వడం, స్నేహితుల మీద దృష్టి పెట్టడం చేస్తారు. అయితే పిల్లలు టీనేజ్ దశకు వచ్చాక మరికొన్ని ముఖ్యమైన విషయాలను సమయానికి నేర్పించాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లలు మంచి వ్యక్తిగా తయారవుతారు.

పిల్లలు పెద్దవుతున్నప్పుడు ముఖ్యంగా టీనేజ్ దశలో ఉండగా వారి మనసు తేలికగా దెబ్బ తింటుంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వారి మనసును బలంగా తయారు చేయాలి. పిల్లలకు తాము ఎంత శక్తివంతంగా ఉన్నారో, ఎంత సాధించగలరో గుర్తు చేయాలి. వారు మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రశాంతంగా ఆలోచించగలగాలి. ఇలా చేస్తే వారు చెడు మార్గంలోకి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి.
టీనేజ్ దశలో పిల్లలకు కొంత స్వాతంత్య్రంతో పాటు బాధ్యతలు ఇవ్వాలి. ఒక చిన్న పని అయినా వారితో చేయించాలని చెప్పాలి. ఇలా చేయడం వల్ల వారు భయపడకుండా ముందుకు సాగగలుగుతారు. ప్రతి పని వారి మనసుతో చేస్తారు. అప్పుడు వారికి తమపై భరోసా కలుగుతుంది. ఈ అలవాటు భవిష్యత్తులో వారిని సమర్థులుగా తీర్చిదిద్దుతుంది.
ఈ వయస్సులో పిల్లలకు ఏది సరైందో, ఏది సరికాదో అర్థం చేసుకోవడం కష్టం. కొంతమంది పిల్లలు మంచిగా నటించి మాట్లాడేవాళ్ల మాటలు నమ్మి తప్పు చేస్తారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. వారికి నచ్చే భాషలోనే ఏది నయమో, ఏది కాదు అనే తేడా చెప్పాలి. ఇలా చేసినప్పుడు వారు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ వయస్సులో పిల్లలు చిన్న విషయానికి వారి మనసును బాధపెట్టుకుంటారు. అంతేకాదు ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఆలోచించటం జరుగుతుంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు సానుకూలంగా ఎలా ఆలోచించాలో నేర్పాలి. ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కోవాలని ధైర్యాన్ని చెప్పాలి. మీరు వారి మనస్సులో వెలుగు నింపినప్పుడు.. వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు.
మీ పిల్లలు చెడు సహవాసంలో ఉన్నా.. మంచి విషయాలు సరిగా నేర్పితే వారు చెడిపోరు. సమయానికి సానుకూల ఆలోచనలు, నెగ్గే ధైర్యం, మంచి నిర్ణయం తీసుకునే అలవాటు కలిగితే వారు ఎప్పుడూ మంచినే ఎంచుకుంటారు.
