సోఫాపై ఛాయ్ పడిందా? పౌడర్ వేయాలా.. నీళ్లా? ఈ ట్రిక్‌తో మరక మాయం!
సోఫాపై టీ మరకలు పడినప్పుడు సరైన పద్ధతి ముఖ్యం. వెంటనే శుభ్రమైన గుడ్డతో అద్దాలి, రుద్దకూడదు. చల్లటి నీరు, తేలికపాటి డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలి. సోఫా క్లీనింగ్ కోడ్ (W, S, WS, X) తప్పక చూడాలి. పాత మరకలకు వెనిగర్ వాడవచ్చు, కానీ నూనె మరకలకు పౌడర్ ఉత్తమం. అధిక నీరు, గట్టిగా రుద్దడం మానుకోండి.

ఇంట్లో సోఫాపై టీ పడటం చాలా సాధారణమే. అయితే మరక పడిన వెంటనే చాలామంది కంగారుపడి గట్టిగా రుద్దడం లేదా ఏదో ఒక పౌడర్ చల్లడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మరక పోవడం మాట అటుంచితే.. అది మరింతగా ఫ్యాబ్రిక్‌లోకి ఇంకిపోయే అవకాశం ఉంది. టీ మరకకు సరైన సమయంలో సరైన పద్ధతిని ఉపయోగిస్తే మాత్రం దాన్ని చాలావరకు సులభంగా తొలగించవచ్చు.
ముందుగా ఈ పని చేయండి
సోఫాపై టీ పడిన వెంటనే ఆలస్యం చేయకుండా ఒక శుభ్రమైన, పొడి గుడ్డ తీసుకుని మరక ఉన్న ప్రాంతంపై మెల్లగా నొక్కాలి. టీని గుడ్డ పీల్చుకునేలా చేయాలి. అయితే మరకను అటూ ఇటూ రుద్దకూడదు. అలా రుద్దితే టీ ఫ్యాబ్రిక్ పీచుల్లోకి మరింత లోతుగా వెళ్లడంతో పాటు మరక విస్తరించే అవకాశం ఉంటుంది.
పౌడర్ వేయాలా? నీళ్లు పోయాలా?
టీ మరకలకు సాధారణంగా పౌడర్ కంటే చల్లటి నీరు, తేలికపాటి లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగపడతాయి. సుమారు రెండు కప్పుల చల్లటి నీటిలో ఒక టీస్పూన్ తేలికపాటి లిక్విడ్ డిటర్జెంట్ కలపాలి. ఈ ద్రావణంలో మృదువైన గుడ్డను కొద్దిగా తడిపి మరకపై మెల్లగా అద్దాలి. మరక బయట నుంచి లోపలికి శుభ్రం చేస్తే అది మరింత విస్తరించకుండా ఉంటుంది. అనంతరం మరో శుభ్రమైన గుడ్డను చల్లటి నీటితో కొద్దిగా తడిపి ఆ ప్రాంతాన్ని అద్దాలి. చివరగా పొడి టవల్‌తో తేమను పీల్చుకుని సోఫాను పూర్తిగా ఆరనివ్వాలి.
సోఫా క్లీనింగ్ కోడ్ తప్పక చూడాలి
క్లీనర్ ఉపయోగించే ముందు సోఫా కుషన్ కింద లేదా ఫ్రేమ్‌పై ఉన్న క్లీనింగ్ ట్యాగ్‌ను పరిశీలించాలి.
W: నీటి ఆధారిత క్లీనర్ ఉపయోగించవచ్చు.
S: సాల్వెంట్ ఆధారిత క్లీనర్ అవసరం; నీటి ఆధారిత క్లీనర్ వాడకూడదు.
WS: నీటి లేదా సాల్వెంట్ ఆధారిత క్లీనర్ ఉపయోగించవచ్చు.
X: ద్రవ క్లీనర్లను ఉపయోగించకుండా వాక్యూమింగ్ వంటి పద్ధతులు అనుసరించాలి.
ట్యాగ్ లేకపోతే.. క్లీనర్‌ను ముందుగా సోఫాలో కనిపించని చిన్న ప్రదేశంలో పరీక్షించడం మంచిది.
ఆరిపోయిన టీ మరకలకు?
తాజా మరకలతో పోలిస్తే పాత, ఆరిపోయిన టీ మరకలను తొలగించడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని ఫ్యాబ్రిక్‌లపై తెల్ల వెనిగర్, నీటి తేలికపాటి ద్రావణం ఉపయోగపడవచ్చు. ఒక భాగం వెనిగర్‌కు రెండు భాగాల నీరు కలిపి, దాన్ని నేరుగా సోఫాపై పోయకుండా గుడ్డతో మెల్లగా అద్దాలి. అయితే వెల్వెట్, పట్టు వంటి సున్నితమైన ఫ్యాబ్రిక్‌లపై వెనిగర్ ఉపయోగించే ముందు తప్పనిసరిగా తయారీదారు సూచనలు, స్పాట్ టెస్ట్‌ను పాటించాలి.
నూనె మరకలకు మాత్రం పౌడర్!
ఇక్కడే పౌడర్ ఉపయోగపడుతుంది. టీ మరకలకు పౌడర్ మొదటి ఎంపిక కాకపోయినా.. నూనె, గ్రీజు వంటి మరకలకు టాల్కమ్ పౌడర్, కార్న్‌స్టార్చ్ లేదా బేకింగ్ సోడా కొంతవరకు నూనెను పీల్చుకోవడంలో సహాయపడవచ్చు.
ఈ తప్పులు మాత్రం చేయకండి!
మరకను గట్టిగా రుద్దకండి. సోఫాపై ఎక్కువగా నీళ్లు పోయకండి. అధిక తేమ ఫోమ్‌లోకి వెళ్లి దుర్వాసన లేదా బూజు సమస్యలకు దారితీయవచ్చు. అలాగే ఏ క్లీనింగ్ ద్రావణాన్నైనా ముందుగా చిన్న, కనిపించని ప్రాంతంలో పరీక్షించాలి.
మొత్తంగా.. టీ పడిన వెంటనే గట్టిగా రుద్దడం కాదు.. ముందుగా పీల్చుకోవాలి, తర్వాత ఫ్యాబ్రిక్‌కు అనుకూలమైన క్లీనింగ్ పద్ధతితో మెల్లగా శుభ్రం చేయాలి. మరక తాజాగా ఉన్నప్పుడే స్పందిస్తే సోఫాను పాడుచేయకుండా శుభ్రం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
