AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంటల కొద్దీ రుద్దే పనిలేదు.. ఈ చిన్న ట్రిక్‌తో రాగి, ఇత్తడి పాత్రలు తళతళ మెరుస్తాయ్..

పూజ గదిలో నిత్యం వెలిగే ఇత్తడి దీపపు కుందులు, రాగి చెంబులు కొద్ది రోజులకే నల్లబడిపోవడం ప్రతి ఇంట్లో ఎదురయ్యే తలనొప్పి వ్యవహారం. పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు.. ఆ మొండి నలుపును వదిలించడానికి పీతాంబరి, సబ్బులు పెట్టి చేతులు నొప్పులు పుట్టేలా రుద్దాల్సి వస్తుంది. గంటల కొద్దీ కష్టపడినా ఆశించిన మెరుపు రాదు. అయితే చేతులకు ఎలాంటి శ్రమ లేకుండా నిమిషాల్లోనే వాటిని కొత్తగా మార్చొచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గంటల కొద్దీ రుద్దే పనిలేదు.. ఈ చిన్న ట్రిక్‌తో రాగి, ఇత్తడి పాత్రలు తళతళ మెరుస్తాయ్..
How To Clean Brass And Copper
Krishna S
|

Updated on: Oct 18, 2026 | 8:53 PM

Share

వంటగదిలో లేదా పూజా గదిలో ఉండే రాగి, ఇత్తడి పాత్రలు కొద్ది రోజులకే సహజ మెరుపును కోల్పోయి నల్లగా, కాంతిహీనంగా మారిపోవడం సహజం. ముఖ్యంగా పూజలో నిత్యం వాడే లోటాలు, పంచపాత్రలు, గ్లాసులు, దీపపు కుందులపై మురికి పొర గట్టిగా పేరుకుపోతుంది. పండుగల సమయాల్లో వీటిని శుభ్రం చేయడానికి చేతులు నొప్పులు పుట్టేలా గంటల తరబడి రుద్దాల్సి వస్తుంది. మార్కెట్లో దొరికే పీతాంబరి, రసాయన పౌడర్లతో పనిలేకుండా వంటింట్లో దొరికే సాధారణ వస్తువులతోనే క్షణాల్లో పాత మెరుపును తిరిగి తీసుకొచ్చే ఒక సులభమైన ఇంటి చిట్కా గురించి తెలుసుకోవడం ముఖ్యం. రాగి, ఇత్తడి లోహాలు గాలిలోని ఆక్సిజన్, తేమతో నిరంతరం చర్య జరపడం వల్ల వాటి ఉపరితలంపై ఆక్సీకరణ పొర ఏర్పడుతుంది. ఈ సహజ రసాయన చర్య కారణంగానే పాత్రలపై నల్లటి లేదా ముదురు గోధుమ రంగు మలినాలు గట్టిగా అంటుకుంటాయి. దీనిని కేవలం నీరు, సాధారణ సబ్బుతో కడిగితే ఆ పొర వదలదు. అయితే సహజసిద్ధమైన ఆమ్ల గుణాలు కలిగిన పదార్థాలతో ఈ ఆక్సీకరణ పొరను క్షణాల్లో కరిగించవచ్చు.

మ్యాజికల్ క్లీనింగ్ లిక్విడ్ తయారీ ఇలా

ఈ సహజ ద్రావణం కోసం ఒక గిన్నెలో 2 టీస్పూన్ల నిమ్మ ఉప్పు తీసుకోవాలి. దానికి 1 టీస్పూన్ సాధారణ ఉప్పు, 2 టీస్పూన్లు తెల్ల వెనిగర్ కలపాలి. ఆ తర్వాత పాత్రలను సులభంగా శుభ్రం చేయడానికి అందులో 1 టీస్పూన్ లిక్విడ్ డిష్‌వాష్ జెల్ వేయాలి. చివరగా కొద్దిగా నీరు పోసి, ఉప్పు, నిమ్మ ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా కాకుండా పాత్రపై సమానంగా పూయడానికి వీలుగా ఉండాలి.

సులభంగా శుభ్రం చేసుకునే విధానం

ముందుగా పాత్రపై ఉన్న దుమ్ము లేదా నూనె జిడ్డును తొలగించడానికి సాధారణ నీటితో కడగాలి. ఆ తర్వాత తయారుచేసుకున్న ద్రావణాన్ని నల్లబడిన రాగి, ఇత్తడి పాత్రల ఉపరితలంపై మెత్తటి స్పాంజ్ లేదా చేతితో సమానంగా రాయాలి. మొండి నలుపు పేరుకుపోయిన చోట ద్రావణాన్ని పూసి కేవలం 2 నుంచి 3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ సమయంలోని రసాయన చర్య వల్ల మురికి పొర వదులైపోతుంది. అనంతరం మెత్తని స్పాంజ్‌తో సున్నితంగా రుద్దితే నల్లదనం మాయమై పాత్రలు తళతళా మెరుస్తాయి.

లోపలి భాగాన్ని క్లీన్ చేయడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

లోటా లేదా గ్లాసుల లోపలి భాగం మురికిగా ఉంటే, కొద్దిగా ద్రావణాన్ని లోపల పోసి చుట్టూ తిప్పాలి. ఆపై స్పాంజ్ సాయంతో శుభ్రం చేయాలి. ఉపరితలంపై గీతలు పడకుండా ఉండేందుకు ఇనుప స్క్రబ్బర్లు వాడకూడదు. అలాగే ప్రత్యేకమైన పాలిష్ లేదా పూత ఉన్న పాత్రలపై ఈ ద్రావణాన్ని నేరుగా వాడకుండా, ముందుగా అడుగుభాగంలో చిన్న ప్రదేశంలో పరీక్షించి చూడటం మంచిది.

తడి లేకుండా తుడవడం ముఖ్యం

పాత్రలు పూర్తిగా మెరిసిన తర్వాత, ఆమ్ల అవశేషాలు ఏవీ మిగలకుండా శుభ్రమైన నీటితో క్షుణ్ణంగా కడగాలి. కడిగిన వెంటనే ఒక పొడి కాటన్ వస్త్రంతో పాత్రను తడి లేకుండా తుడవాలి. నీటి బిందువులు పాత్రపై ఆరిపోతే మళ్లీ తెల్లటి లేదా నల్లటి మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉన్నందున పూర్తిగా ఆరబెట్టడం మర్చిపోకూడదు. ఈ చిన్న చిట్కాతో ఎక్కువ శ్రమ లేకుండానే పూజా పాత్రలను నిత్యం కొత్తవాటిలా ఉంచుకోవచ్చు.

Follow Us