
చెవి లోపల ధూళి, మైనం మాదిరి ఉండే గులిమి తొలగించడం అంత సులువుకాదు. వైద్యపరంగా సెరుమెన్ అని పిలువబడే ఇయర్‌వాక్స్ మన చెవులను దుమ్ము, బ్యాక్టీరియా నుంచి రక్షించడానికి చెవిలో ఉత్పత్తి అవుతుంది. సాధారనంగా చెవిలో ఏర్పడే ఈ గులిమి దానంతట అదే తగ్గిపోతుంది. కొంత మందికి ఇది అధిక మొత్తంలో చెవిలో పేరుకుపోయి అసౌకర్యం, వినికిడి సమస్యలు, ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. చాలా మంది దీనిని తొలగించడానికి ఇయర్ బర్డ్స్ ఉపయోగిస్తారు. కానీ ఇది చెవి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చెవిలోని గులిమిని తొలగించడానికి సహజ నివారణలను ఉపయోగిస్తే చాలా సురక్షితంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెవి పరిశుభ్రతను కాపాడుకోవడానికి సున్నితమైన, నాన్-ఇన్వాసివ్ పద్ధతులను ఉపయోగించడం ఉత్తమం..
కొన్ని చుక్కల గోరువెచ్చని ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెను పూయడం వల్ల గట్టిపడిన ఇయర్‌వాక్స్‌ను మృదువుగా తొలగించవచ్చు. ఇది ఇయర్‌వాక్స్‌ను తొలగించడానికి సహజమైన మార్గం.
హైడ్రోజన్ పెరాక్సైడ్ (3%) ద్రావణం ఇయర్‌వాక్స్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. తలను ఒక వైపుకు వంచి, చెవిలో 5 నుంచి 10 చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయాలి. చెవిని 5 నిమిషాలు అదే స్థితిలో ఉంచాలి. ఇలా 3 నుంచి 14 రోజులు చేస్తే.. గులిమి మాయం అవుతుంది. కానీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలి.
చెవిలోని గులిమిని సహజంగా తొలగించడానికి ఉప్పు నీటి ద్రావణం సురక్షితమైన చిట్కా. గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి, అందులో ఒక దూదిని ముంచి, చెవిలో పెట్టాలి. కొన్ని నిమిషాల తర్వాత తలను వంచి నీటిని తీసివేయవచ్చు.
వేడి నీటి గిన్నె నుంచి ఆవిరి పట్టడం వల్ల చెవిలోని గులిమిని సహజంగా తొలగించవచ్చు. వేడి నీటి నుండి వచ్చే ఆవిరి చెవిలో గులిమిని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.
బేకింగ్ సోడా ద్రావణం గట్టి ధూళిని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. 60 మి.లీ గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడాను వేసుకుని కరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక డ్రాపర్‌లో వేయాలి. మీ తలను ఒక వైపుకు వంచి చెవిలో 5 నుండి 10 చుక్కలు వేసుకోవాలి. ఈ ద్రావణాన్ని చెవిలో 1 గంట పాటు ఉంచి ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇంటి నివారణలు పని చేయకపోతే, పదే పదే చెవి నొప్పి, వినికిడి లోపం, తలతిరుగుతూ ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.