AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్.. కొనాల్సిన అవసరమే రాదు..

వర్షాకాలం ఇంటి మిద్దెపై కూరగాయల తోట ఏర్పాటుకు అత్యంత అనువైన సమయం. చెట్టు చిక్కుడు, బెండ, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర వంటి పంటలను సరైన పద్ధతిలో బ్యాచ్‌ల వారీగా నాటితే ఏడాది పొడవునా తాజా కూరగాయలను ఇంట్లోనే పండించుకోవచ్చు. మట్టి మిశ్రమం, విత్తనాల ఎంపిక, నీటి నిర్వహణపై జాగ్రత్తలు పాటిస్తే కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా సమృద్ధిగా దిగుబడి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్.. కొనాల్సిన అవసరమే రాదు..
Monsoon Gardening
Shaik Madar Saheb
|

Updated on: Jun 30, 2026 | 12:54 PM

Share

ఇంటి తోట పెంపకం అనేది కేవలం ఒక అలవాటు కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక మార్గం. ముఖ్యంగా వర్షాకాలం ఇంటి తోటల ఏర్పాటుకు అనువైన సమయం.. ఎందుకంటే మట్టిలో తగినంత తేమ లభ్యమవుతుంది. అందుకే.. ఈ సీజన్‌లో కూరగాయల విత్తనాలను విత్తుకోవడం ద్వారా.. మంచిగా పెరిగేందుకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ఇంట్లో తీగజాతి లేదా.. మామూలుగా కూరగాయల సాగుకు అనువైన సమయం.. ఒక కుటుంబం తమ సొంత కూరగాయల కోసం వర్షాకాలంలో ఎలాంటి విత్తనాలను నాటాలి..? ఏ విధంగా నాటితే.. మంచిగా పెరుగుతుంది..? అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

విత్తనాల ఎంపిక

ఒకవేళ వర్షం కురిస్తే.. లేదా తగినంత తడిగా ఉంటే, అదనంగా తడపాల్సిన అవసరం లేదని గమనించాలి.. ముఖ్యంగా.. ఈ సీజన్ విత్తనాలలో చెట్టు చిక్కుడు, గోరు చిక్కుడు, ధనియాలు, బెండ, పొద్దు తిరుగుడు, గుమ్మడి, బీర, చుక్కకూర, పాలకూర వంటివి నాటుకోవచ్చు.. క్యారెట్ వంటి కొన్ని కూరగాయలను ఆగస్టు నెలలో నాటడం మంచిది.. ఎందుకంటే ఇప్పుడు నాటితే సరిగ్గా పెరగవు.

పంటల ప్రణాళిక, బ్యాచ్ నాటడం

తోట పెంపకంలో కీలకమైన అంశం బ్యాచ్ నాటడం. ఒకేసారి అన్ని విత్తనాలను నాటకుండా, వారం లేదా పదిహేను రోజుల వ్యవధిలో విత్తనాలను నాటడం వల్ల నిరంతర దిగుబడిని పొందవచ్చు. ఉదాహరణకు, పాలకూర విత్తనాలను మొదట కొన్ని పైపుల్లో నాటి, ఆ తర్వాత వారం రోజులకు మరికొన్ని గ్రో బ్యాగుల్లో నాటడం ద్వారా ఒక బ్యాచ్ హార్వెస్ట్ సిద్ధంగా ఉండగానే తదుపరి బ్యాచ్ పెరుగుతూ ఉంటుంది. ఇది కూరగాయల కొరత లేకుండా చూస్తుంది.

కుటుంబ అవసరాలకు తగ్గట్టు నాటడం

నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడా కూరగాయలను పండించడానికి కొన్ని సూచనలు కూడా పాటించవచ్చు.. ఉదాహరణకు, చెట్టు చిక్కుడు వంటి వాటికి కనీసం 10 నుండి 15 మొక్కలు ఉండాలని, అప్పుడు మాత్రమే ప్రతి నాలుగు-ఐదు రోజులకు ఒక కర్రీకి సరిపడా దిగుబడి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.. కేవలం నాలుగు-ఐదు మొక్కలు ఉంటే సాంబార్ లేదా పులుసు వంటి వాటికి మాత్రమే సరిపోతాయి. బెండ విత్తనాలను చిక్కుడు నాటిన టబ్‌ల పక్కనే ఒక్కొక్క దాంట్లో నాలుగు చొప్పున నాటొచ్చు.. అదేవిధంగా పక్కనే కూర గుమ్మడి విత్తనాలను కూడా నాటుకోవచ్చు..

నాటడం పద్ధతులు, జాగ్రత్తలు

పాలకూర, చుక్కకూర: వీటిని పైపుల్లో నాటుకోవచ్చు.. చిన్న గుంటలు చేసి రెండు-మూడు గింజలు వేయడం ద్వారా మొలకలు బాగా వస్తాయి.

కొత్తిమీర (ధనియాలు): బ్లాక్ టబ్‌లలో నాటొచ్చు.. వర్షాకాలం కాబట్టి విత్తనాలను మట్టితో కప్పి, తేలికగా అదిమి పెట్టడం వల్ల వర్షం పడినా చెదరకుండా మొలకలు వస్తాయి. కొత్తిమీర, చుక్కకూర మొలకెత్తడానికి 15 రోజుల సమయం పడుతుంది.

చెట్టు చిక్కుడు, బెండ: బ్లాక్ టబ్‌లు, గ్రో బ్యాగులలో నాటుకోవచ్చు.. ఒకే రకం విత్తనాల్లో రెండు రకాలు (లేత రంగు, ముదురు రంగు గింజలు) నాటుకోవాలి.. 365 రోజుల చెట్టు చిక్కుడు రకాలు ఏడాది పొడవునా దిగుబడిని ఇస్తాయి. కనుపు చిక్కుడు వంటివి ఆగస్టు తర్వాతే నాటుకోవడం మంచిది.. ఎందుకంటే మొక్క పెరిగినా కాయలు రావు.

పెద్ద డ్రమ్ములో స్వర్డ్ బీన్స్ (తమ్మకాయలు) నాటుకోవచ్చు.. వాటితో పాటు ఖాళీ ప్రదేశాల్లో చుక్కకూర, పాలకూర చల్లుకోవచ్చు..

నీరు పెట్టడం: విత్తనాలు నాటిన తర్వాత, ఎంత వర్షం పడినా, తడిగా ఉన్నా సరే, తప్పనిసరిగా అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా నీరు పెట్టాలి.

అయితే.. ఇంటి మిద్దెపై కూరగాయల సాగు అయితే ఇలా చేయాలి.. పెరట్లో అయితే యథావిధిగా సాగు చేసుకోవచ్చు.. మట్టి మిశ్రమం, విత్తనాలు నాటే పద్ధతులపై అవగాహనతో ఉండటం ద్వారా.. కూరగాయలు కొనకుండానే ఏడాది పొడవునా కూరగాయలను సాగు చేసుకోవచ్చు..

ఇంటి తోట పెంపకం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడమే కాకుండా, మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us