Homemade Rasgulla: నోరూరించే రసగుల్లా: ఇంట్లోనే తయారు చేసుకునే సులభమైన వంటకం!
పండగలు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది తీపి వంటకాలే. ఆ కోవలో బెంగాలీ స్వీట్స్‌కు ప్రత్యేక స్థానం. అందులో రసగుల్లాది అగ్రస్థానం. పాల నురుగులా తెల్లగా, మృదువుగా ఉండే ఈ తీపి వంటకం.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. బయట కొన్న రసగుల్లాలు తరచుగా గట్టిగా ఉంటాయి. కానీ, సరైన పద్ధతులు పాటిస్తే ఇంట్లోనే సులభంగా, అచ్చంగా స్వీట్‌షాపుల్లో దొరికే వాటిలాగే తయారుచేసుకోవచ్చు. దీనికి కావాల్సింది కొద్దిపాటి సహనం, కొన్ని చిట్కాలు మాత్రమే.

పండుగలైనా, పంక్షన్లైనా, మనసు బాగాలేనప్పుడైనా.. మనల్ని ఆనందపరిచేది ఏదైనా ఉందంటే అది తీపి వంటకమే. ముఖ్యంగా, రసగుల్లా పేరు వినగానే చాలామందికి నోరు ఊరుతుంది. బెంగాలీ స్వీట్స్‌లో రారాజుగా పిలవబడే ఈ రసగుల్లాలు, వాటి మృదుత్వం, తేనెలాంటి తీయదనంతో అందరినీ ఇట్టే కట్టిపడేస్తాయి. ఇంట్లో రసగుల్లాలు చేయడం చాలా కష్టం అని చాలామంది అనుకుంటారు. కానీ, కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే, మీరు కూడా ఇంట్లోనే స్పాంజీ, మృదువైన రసగుల్లాలు సులభంగా తయారుచేసుకోవచ్చు. వాటి తయారీ విధానం తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
లీటరు పాలు
రెండు చెంచాల నిమ్మరసం
రెండు కప్పుల పంచదార
నాలుగు కప్పుల నీళ్లు
రెండు యాలుకలు
తయారీ విధానం
ముందుగా, ఒక మందపాటి గిన్నెలో పాలు తీసుకుని బాగా మరిగించాలి. పాలు పొంగేటప్పుడు, మంట తగ్గించి, నిమ్మరసం వేసి నెమ్మదిగా కలపాలి. పాలు విరిగి, పనీర్ (చెన్నా), పాలు విడిపోయేలా చూడాలి. ఒకవేళ పాలు సరిగా విరగకపోతే, ఇంకొంచెం నిమ్మరసం వేయవచ్చు.
పాలు విరిగిన తర్వాత, ఒక పల్చటి క్లాత్‌లో ఈ మిశ్రమాన్ని వేసి, నీటిని వడగట్టాలి. వడగట్టిన తర్వాత, పనీర్‌ను చల్లటి నీటితో ఒకసారి కడగాలి. ఇది నిమ్మరసం వాసన, పుల్లదనం పోగొడుతుంది. ఇప్పుడు, క్లాత్‌లోని పనీర్‌ను గట్టిగా పిండాలి. నీళ్లు లేకుండా బాగా పిండిన తర్వాత, ఒక ప్లేట్‌లో తీసుకుని అరచేతితో సుమారు 10 నుంచి 15 నిమిషాలపాటు బాగా మర్దనా చేయాలి. పనీర్ మెత్తగా, మృదువుగా అవ్వాలి. ఇది రసగుల్లాలు స్పాంజీగా రావడానికి చాలా ముఖ్యం.
మర్దనా చేసిన పనీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. ఉండలు పగలకుండా, మృదువుగా ఉండాలి. ఈ ఉండలు ఎంత చిన్నగా చేసుకుంటే ఉడికిన తర్వాత అంత పెద్దగా అవుతాయి. మరోవైపు, ఒక పెద్ద గిన్నెలో పంచదార, నాలుగు కప్పుల నీళ్లు వేసి బాగా మరిగించాలి. పాకం బాగా మరిగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న పనీర్ ఉండలను ఒక్కొక్కటిగా వేసి, మూత పెట్టాలి. మంట అధికంగా ఉంచి సుమారు 10 నిమిషాలు ఉడికించాలి
రసగుల్లాలు ఉబ్బి, పెద్దవి అవుతాయి. ఆ తర్వాత మంట తగ్గించి మరో 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. మధ్యలో పాకం చిక్కబడినట్లు అనిపిస్తే, కొంచెం వేడి నీళ్లు కలుపుకోవచ్చు. ఉడికిన రసగుల్లాలు పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే తినడానికి రుచిగా ఉంటాయి. ఈ రసగుల్లాలను చల్లటి గది ఉష్ణోగ్రత వద్ద లేదా ఫ్రిజ్‌లో ఉంచి తింటే వాటి రుచి ఇంకా బాగుంటుంది.




