మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందులో భాగమే మనం తాగే మంచినీళ్లు కూడా. ఇంకా చెప్పాలంటే, ఆహారం కంటే కూడా నీళ్లు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఆహారం లేకుండా కొన్ని వారాలపాటు జీవించగలం. కానీ, నీళ్లు తాగకపోతే రెండు రోజులు కూడా బతకడం కష్టం. మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిండిఉంటుంది.. సీజన్‌తో సంబంధం లేకుండా రోజుకు 10 గ్లాసుల నీళ్లు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా వేసవిలో. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఎక్కువ నీరు తాగాలి. కానీ, చాలా మంది వేసవిలో ఫ్రిజ్‌లోని నీటిని తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల శరీరానికి హాని జరుగుతుందని మీకు తెలుసా..? కానీ, మట్టి కుండలోని నీటిని తాగితే ఆరోగ్యం మరింత మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో మట్టి కుండలో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మట్టి కుండలో నీరు పోస్తే సహజంగానే అవి చల్లబడతాయి. బాష్పీభవన ప్రక్రియలో కుండలోని నీరు వేడిని కోల్పోతుంది. త్వరగా చల్లబడుతుంది. రిఫ్రిజిరేటర్ నీటిని వేగంగా చల్లబరుస్తుంది. కానీ, ఈ నీటిని తాగడం వల్ల దురద, గొంతు మంట, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కానీ మట్టి కుండ నీరు తాగడం వల్ల ఈ సమస్యలేవీ రావు. రోజూ మట్టి కుండ నీటిని తాగడం వల్ల జీవక్రియ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. నీటిలో ఉండే మినరల్స్ జీర్ణక్రియకు కూడా సహకరిస్తాయి. మట్టి కుండలో నీటిని పోయడం వల్ల నీటి నాణ్యత మెరుగుపడుతుంది. కుండకున్న పోరస్ స్వభావం నీటి నుండి మలినాలను ఫిల్టర్ చేసి, నీటిని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మనం తినే ఆహారంలో ఎక్కువ భాగం శరీరంలో ఆమ్లంగా మారి కాలుష్య కారకాలను సృష్టిస్తుంది. అయినప్పటికీ, మట్టి ఆల్కలీన్ కూర్పు తగిన pH సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది ఎసిడిటీ, పొట్ట సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మట్టిలో ఉండే వివిధ రకరకాల విటమిన్స్, మినరల్స్ అందులో నిల్వ ఉంచిన నీటికి చేరి శరీరానికి మేలు చేస్తాయి. మట్టి కుండ నీరు బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఈ నీరు తాగితే శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు. వేసవిలో చెమట వల్ల చర్మం జిడ్డుగా తయారై చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుండ నీళ్లు తాగితే ఆ సమస్యల నుండి దూరం కావచ్చు. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి పెరుగుతుంది. డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..